The Exorcism Of The Emily Rose Real Story In Telugu - Sakshi
Sakshi News home page

The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!!

Published Sun, Nov 21 2021 1:06 PM | Last Updated on Wed, Nov 24 2021 10:39 AM

The Exorcism Of The Emily Rose True Story In Telugu - Sakshi

కుటుంబంతో మిషెల్‌

The Real Story Behind ‘The Exorcism of Emily Rose’ Is More Terrifying Than the Movie: దేవుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం ఉనికి గురించీ వింటూనే ఉన్నాం.. నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం, నమ్మకపు ప్రభావం..‘దెయ్యాలు క్రూరమైన వి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి.. వాటికి దేవుడంటే భయం’ అని! కానీ దైవశక్తికి సైతం లొంగని ఆరు ప్రేతాత్మలు.. ఆరేళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి, అనుక్షణం నరకయాతన పెట్టాయి. చివరికి క్రూరంగా చంపేశాయి. 2005లో ప్రపంచాన్ని వణికించిన ‘ది ఎక్సార్సిజం ఆఫ్‌ ఎమిలీ రోజ్‌’ అనే సినిమా కల్పిత కథ కాదు, 1976లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన ‘అన్నెలీస్‌ మిషెల్‌’ కన్నీటి గాథ నేటికీ ఓ మిస్టరీనే.



ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం.. ఎంతటి బలవంతుడినైనా ఒంటిచేత్తో నొక్కిపెట్టి కదలకుండా చెయ్యగలగడం, పైకి లేచి చేతులు చాచి.. వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం.. కాళ్లతో పాటు చేతులనూ ఉపయోగించి మెట్లు దిగడం.. మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం.. ఇదంతా నేటి హారర్‌ చిత్రాల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలు.కానీ  దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నెలీస్‌ని చూసినప్పుడే!

అన్నెలీస్‌.. పశ్చిమ జర్మనీ, బవేరియాలోని లీబ్లిఫింగ్‌లో 1952, సెప్టెంబర్‌ 21న పుట్టింది. జోసెఫ్, అన్నా మిషెల్‌ ఆమె తల్లిదండ్రులు. వాళ్లు రోమన్‌ కేథలిక్స్‌. అన్నెకు ముగ్గురు సోదరీమణులు. చిన్ననాటి నుంచి దైవభక్తి కలిగిన ఆమె.. తల్లిదండ్రులతో పాటు వారంలో రెండుసార్లు చర్చికి హాజరయ్యేది. అలాంటి అన్నె.. ఉన్నట్టుండి దేవుడ్ని ద్వేషించడం మొదలుపెట్టింది. ఆమెకు 16 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా ఆరోగ్యం దెబ్బతింది. వ్యాధి లక్షణాలను బట్టి మూర్ఛగా, మానసిక రుగ్మతగా గుర్తించిన వైద్యులు.. ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు. ‘ఆత్మలు కనిపిస్తున్నాయి’ అంటూ భయపడసాగింది అన్నె.



అదంతా వ్యాధి లక్షణాల్లో భాగమే అన్నారు వైద్యులు. దేవుడ్ని ప్రార్థిస్తున్న సమయంలో ఎవరో.. ‘నువ్వు నరకంలో కుళ్లిపోతున్నావు’ అంటున్నారని చెప్పేది ఆ అమ్మాయి. దాన్నీ మానసిక సమస్యగానే పరిగణించారు. కాలక్రమేణా జీసస్‌ చిత్రాన్ని చూసినా, శిలువను చూసినా వింతవింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దైవక్షేత్రాల్లోకి వెళ్లాలంటే భయపడేది. బలవంతంగా ప్రార్థన స్థలాలకు తీసుకుని వెళ్తే.. నేల కాలిపోతోంది, కాళ్లు మంటలు పుడుతున్నాయనేది. అన్నె ప్రవర్తన చూసిన ఆమె స్నేహితులకు, కుటుంబసభ్యులకు  ‘ఆమెను ఆత్మ ఆవహించిందా?’ అనే అనుమానం బలపడింది. అదే భయంతో అన్నెకు భూతవైద్యం అందించాలని చర్చి ఫాదర్‌ ఎర్నస్ట్‌ అల్ట్‌ను ఆశ్రయించారు.

అయితే అప్పటికే భూతవైద్యంపై కఠిన నియమాలు ఉండటంతో వెంటనే అనుమతి లభించలేదు. చివరికి.. అన్నె స్వయంగా అల్ట్‌కు లేఖ రాసింది. ‘నాకు ఆరోగ్యంగా జీవించాలనుంది. నా గురించి ప్రార్థించండి. జనుల కోసం బాధను అనుభవిస్తాను. కానీ, ఈ నరకం చాలా భయానకంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను’ అంటూ. అది చదివిన ఫాదర్‌ అల్ట్‌ మనసు కరిగి, ఆ లేఖను బిషప్‌ జోసెఫ్‌ స్తంగల్‌కు చూపించారు. దాంతో బిషప్‌.. ప్రీస్ట్‌ ఆర్నాల్డ్‌ రెంజ్‌కు భూత వైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. కానీ ఇదంతా రహస్యంగా జరగాలని ఆదేశించారు. 1975 సెప్టెంబర్‌ 24 నుంచి అన్నెకు మందులు ఇవ్వడం మానేసి, భూతవైద్యం మొదలుపెట్టారు. మొత్తం వైద్యపద్ధతిని, అన్నె ప్రవర్తనని.. వీడియోల రూపంలో, ఆడియోల రూపంలో రికార్డ్‌ చేశారు. నేటికీ వాటిని నెట్‌లో వినొచ్చు, చూడొచ్చు. 

ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆరు గొంతులు వినిపించేవి. అవి ప్రేతాత్మలవని గుర్తించారు భూతవైద్యులు. వాటి పేర్లు లుసీఫర్, కైన్, జుదాస్‌ ఇస్క్రీయాట్, బెలీయల్, లెజియాన్, నెరో అని తేల్చారు. కానీ వాటిని అన్నె శరీరంలో నుంచి వెళ్లగొట్టడంలో విఫలమయ్యారు.

వారానికి రెండు మూడు రోజులు 4 గంటల చొప్పున.. 67 సార్లు ఆమెకు భూతవైద్యాన్ని అందించారు. అయినా ఫలితం లేదు. ఆ నరకం భరించలేక అన్నె 1976, జులై 1న తన 23వ ఏట చనిపోయింది. అప్పుడే ప్రపంచం అన్నే కథవైపు తిరిగి చూసింది. ఈ మరణానికి బిషప్‌ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సహకరించిన అన్నె తల్లిదండ్రులనూ అరెస్ట్‌ చేశారు. అన్నె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతో ఆమె చనిపోయిందని, ఎముకలన్నీ ఛిద్రమై, మాంసం ముద్దలా మారిందని, కేవలం 30 కేజీల బరువు ఉందని పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు.. భూతవైద్యులు రికార్డు చేసిన వీడియో, ఆడియో టేపులను కోర్టు ముందు ఉంచడంతో.. అవే వారిని కాపాడాయి.

అన్నె తన మూత్రాన్ని తానే తాగేదని, తనని తాను గాయపరచుకొనేదని సాక్షులు తెలిపారు. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని విసిరికొట్టడం, అన్నే వింతగా ప్రవర్తించడం అన్నింటికీ సాక్ష్యాలు ఉండటంతో కోర్టు నమ్మింది. అందరినీ విడుదల చేసింది. ‘ప్రేతాత్మల కారణంగా చనిపోవడంతో పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చెయ్యలేకపోయాం.. మరోసారి ఆ అవకాశం ఇవ్వాలి’ అని కోర్టుని కోరారు అన్నె తల్లిదండ్రులు. కోర్టు అంగీకారంతో.. రెండేళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో నాణ్యమైన శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టారు. అన్నె అనారోగ్యంతో బాధపడుతుంటే భూతవైద్యం చేసి, తిండిపెట్టకుండా చంపేశారని, తల్లిదండ్రుల ఒత్తిడి, కఠిన నియమాలు, చాదస్తం కారణంగానే అన్నె పిచ్చిదైందనే పలు విమర్శలు వచ్చాయి.  

సరిగ్గా 37 ఏళ్ల తర్వాత 2013, జూన్‌ 6న అన్నెలీస్‌ మిషెల్‌ నివాసమున్న ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఎవరూలేని ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయనేది మరో మిస్టరీ. పైగా ఆ మంటల్లో తమకు అన్నెలీస్‌ ఆత్మ కనిపించిందని స్థానికులు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడం సంచలనమైంది. దాంతో ఈ కథ మరోసారి తెర మీద కొచ్చింది. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఆరవ నెల, ఆరవ తేదీ.. 2013లోని అంకెలు కలిపితే ఆరు, కాబట్టి.. ‘666 అనే నంబర్‌ దెయ్యాల సంఖ్య’ అంటూ మీడియా కూడా అప్పట్లో ప్రచారం చేసింది. దాంతో అగ్నిప్రమాదానికి కారణం ప్రేతాత్మలేనని కొందరు భయాందోళనలకు గురయ్యారు. మరికొందరు కొట్టిపారేశారు. 
- సంహిత నిమ్మన

చదవండి: Crime Story: తన హత్యకు తానే పథకం వేసుకున్నాడు.. ద్రోహి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement