ప్రత్యేక విమానంలో అంత్యక్రియలకు...
భోపాల్: మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ తన కుమారుడు శైలేష్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో హాజరుకానున్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో భోపాల్ లోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్సిస్టిట్యూట్లో చికిత్స పొందుతున్న ఆయనకు, యాభై ఏళ్ళ కొడుకు శైలేష్ మరణవార్తను కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్లో ఆయనను లక్నోకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు, అనంతరం పదమూడు రోజుల కార్యక్రమం ముగిసేవరకు గవర్నర్ లక్నోలోనే ఉంటారని సమాచారం.
వ్యాపమ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న శైలేష్ యాదవ్ బుధవారం లక్నోలోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు టీచర్ల పరీక్షలో ఉత్తీర్ణతకు పది మంది విద్యార్థుల నుండి 3 లక్షలను ముడుపులుగా తీసుకున్నట్లు శైలేష్ పై ఆరోపణలున్నాయి. మెదడులో రక్తస్రావమై మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ , పోస్ట్మార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.