ram naresh yadav
-
పార్క్‌లో ఎస్సై అమ్మాయి చెవులు పిండి..
ఆగ్రా: యువతులు, మహిళలపై ఎలాంటి వేధింపులు జరగకుండా చూసేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ యాంటీ రొమియో పోలీసు బృందాలను క్రీయాశీలం చేయగా ఓ పోలీసు మాత్రం అదుపు తప్పాడు. ఇతరులు వేధిస్తే అడ్డుకోవాల్సింది పోయి తానే ఓ యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. ఫలితంగా అతడిపై వెంటనే బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళితే.. మెయిన్‌పురికి చెందిన ఎస్సై రామ్ నరేశ్ యాదవ్ యాంటీ రోమియో డ్రైవ్‌లో భాగంగా లోహియాలోని ఓ పార్క్ వద్దకు వెళ్లి ఓ అమ్మాయిని వేధించాడు. ఆమె చెవులుపట్టి లాగుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడితో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు అక్కడ ఉన్న అమ్మాయిలపై అరుస్తూ పార్క్‌ల చుట్టూ తిరగకుండా ఇంటికి వెళ్లిపోండంటూ గట్టిగా రిచారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి బయటకొచ్చి పెద్ద వైరల్‌గా మారింది. దీంతో అతడిని వెంటనే పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. దీనిపై డిపార్ట్మెంటల్ దర్యాప్తు కూడా ఆదేశించారు. -
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఓపీ కోహ్లీ
మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాశ్ కోహ్లీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రధేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర మీనన్ రాజ్‌భవన్ లో బీజేపీ సీనియర్ నేత కోహ్లీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పదవీ కాలం బుధవారం ముగియడంతో ప్రస్తుతం గుజరాత్ గవర్నర్ అయిన ఓ.పీ.కోహ్లీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. -
ఎంపీ గవర్నర్‌కు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌కు నోటీసులు పంపించింది. వ్యాపం కుంభకోణంలో గవర్నర్ రామ్ నరేశ్‌కు కూడా భాగస్వామ్యం ఉందని, ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్నందున ఆయనను వెంటనే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో స్పందన తెలియజేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఒక వేళ గవర్నర్ స్ధానంలో ఉండి అవినీతికి పాల్పడినట్లు నిరూపితమైతే అతడిని తొలగించడానికి కావాల్సిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. సంజయ్ శుక్లా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. -
వ్యాపం స్కాంలో ఎ-10 గవర్నరేనా?
దేశాన్నే వణికిస్తున్న వ్యాపం స్కాంలో పెద్దవాళ్లు ఎవరినీ వదల్లేదని, అందరినీ బుక్ చేస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెబుతున్నా.. ఈ కేసులో మాత్రం ఓ పెద్ద చేప విచారణ నుంచి తప్పించుకుందనే అంటున్నారు. గవర్నర్ రాం నరేష్ యాదవ్‌ను ఈ కేసులో ఎ-10గా చేర్చారని, అయితే.. రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో ఆయనపై విచారణను చేపట్టకుండా ఆపేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి బయటపెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దొరికిన ఆధారాలను బట్టి చూస్తే గవర్నర్‌పై విచారణ చేపట్టాల్సిందేనని, ఇప్పుడు అలా చేయకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రిని రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ స్కాంలో సీఎం చౌహాన్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్‌ను తొలగించాల్సిందేనని, అలా చేస్తే ఆయన మొత్తం గుట్టంతా విప్పుతారనే బీజేపీ భయపడుతోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ విమర్శంచారు. గవర్నర్ పదవి నుంచి రాం నరేష్ యాదవ్‌ను తొలగించాలంటూ దాఖలైన కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. -
'గవర్నర్ తొలిగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
-
'గవర్నర్ తొలగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సంచలనాత్మక వ్యాపం స్కామ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్‌ను తొలగించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిచంది. తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రప్రభుత్వం గతంలోనే ఆయనను ఆదేశించినప్పటికీ రాంనరేశ్ యాదవ్ మాత్రం ఇప్పటికీ గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవినుంచి తొలిగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ ప్రధాన ముద్దాయి. కాగా గత మార్చిలో శైలేశ్ అనుమానాస్పద రీతితో మరణించారు. గవర్నర్ రాంనరేశ్ యాదవ్ పాత్రకూడా నిర్ధారణ కావడంతో కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్.. హైకోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్లో గవర్నర్ పేను చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 2 వేల మందికిపైగా అరస్టుకాగా, మరో 800 మందిని తర్వరలో అరెస్టుచేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
మధ్యప్రదేశ్ గవర్నర్‌కు ఊరట
జబల్పూర్(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్టు స్కామ్‌లో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్ యాదవ్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది. రాష్ట్ర అధినేతగా రాజ్యాంగం కల్పించిన న్యాయ రక్షణల వల్ల ఆయనపై పదవిలో ఉండగా ఎలాంటి కేసులు నమోదు చేయటానికి వీల్లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు చెప్పింది. అవసరమైతే గవర్నర్ స్టేట్మెంట్ను రికార్డు చేయవచ్చని పోలీసులకు సూచించిం ది. స్టేట్మెంట్ రికార్డు సమయంలో న్యాయపరమైన అన్ని నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఈ కేసులో మిగతా నిందితులపై కేసుల నమోదుకు కానీ, విచారణకు కానీ స్వతంత్రంగా చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. -
ప్రత్యేక విమానంలో అంత్యక్రియలకు...
భోపాల్: మధ్య ప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ తన కుమారుడు శైలేష్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో హాజరుకానున్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో భోపాల్ లోని సంజయ్ గాంధీ మెడికల్ ఇన్సిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు, యాభై ఏళ్ళ కొడుకు శైలేష్ మరణవార్తను కుటుంబ సభ్యులు ఇంకా చెప్పలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను లక్నోకు తరలించే ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలు, అనంతరం పదమూడు రోజుల కార్యక్రమం ముగిసేవరకు గవర్నర్ లక్నోలోనే ఉంటారని సమాచారం. వ్యాపమ్ కుంభకోణంలో నిందితుడుగా ఉన్న శైలేష్ యాదవ్ బుధవారం లక్నోలోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు టీచర్ల పరీక్షలో ఉత్తీర్ణతకు పది మంది విద్యార్థుల నుండి 3 లక్షలను ముడుపులుగా తీసుకున్నట్లు శైలేష్ పై ఆరోపణలున్నాయి. మెదడులో రక్తస్రావమై మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ , పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. -
కుంభకోణాల పుట్ట
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంచి పేరుంది. ఆయన గురించి చెప్పినప్పుడల్లా జాతీయ మీడియా ప్రశంసాపూర్వకమైన విశేషణాలు ఉపయోగిస్తుంటుంది. ‘మెతక స్వభావి’ మొదలుకొని ‘వివాదరహితుడి’ దాకా అందులో చాలా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్లక్రితం గుజరాత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఢిల్లీపై గురి పెట్టినప్పుడు ఆయనకు పోటీగా శివరాజ్ సింగ్‌ను ముందుకు తోసే ప్రయత్నం జరిగింది. అభివృద్ధిలో మొదటినుంచీ ముందే ఉన్న గుజరాత్‌ను మోదీ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లిన మాట నిజమే అయినా... పూర్తిగా వెనకబడి ఉన్న మధ్యప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి శివరాజ్ సింగ్ చాలా శ్రమకోర్చారని ఒక సందర్భంలో అద్వానీయే ప్రశంసలు కురిపించారు. అలాంటి మధ్యప్రదేశ్‌లో తొలిసారి 2009లో వెల్లడై అప్పుడప్పుడు తెరపైకి వస్తున్న ‘పరీక్షల స్కాం’ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి అది మరింత బలంగా దూసుకొచ్చి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నరేష్ యాదవ్ పదవికి ఎసరు తెచ్చింది. ఆయన గారిపై ఎఫ్ఐఆర్ దాఖలు కావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారు, పలుకుబడి కలవారు నిబంధనలను తోసిరాజని ఎంత నిస్సిగ్గుగా తమ పనులు నెరవేర్చుకుంటారో తెలియాలంటే ఈ స్కాంను చూడాల్సిందే! ఆ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు నెలకొల్పిన మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపమ్)కు... పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి రాని ఉద్యోగాల నియామకాల బాధ్యతను కూడా కొన్నాళ్లక్రితం కట్టబెట్టారు. అయిదేళ్లక్రితమే ప్రవేశ పరీక్షల విషయంలో నిందారోపణలు ఎదుర్కొన్న వ్యాపమ్‌కు అదనంగా ఉద్యోగాల నియామకాన్ని అప్పగించడం నిజానికి ఘోర తప్పిదం. ప్రవేశ పరీక్ష ల్లో అనర్హులకు నచ్చిన చోట సీటు దొరికేలా చేసేందుకు ‘వ్యాపమ్’ సీనియర్ అధికారులు వ్యవహరించిన తీరు... ఆ సంస్థలో అవినీతి, అక్రమాలు వ్యవస్థీకృతమైన తీరు అత్యంత దిగ్భ్రాంతికరం. పరీక్ష రాయాల్సిన అభ్యర్థి అడ్మిట్ కార్డులో అతని తరఫున రాసే వేరే వ్యక్తి ఫొటో ఉంచడం... పరీక్ష అయిపోయాక అసలైన అభ్యర్థి ఫొటో పెట్టి అడ్మిట్ కార్డును మార్చడం అందులో ఒకటి. అసలు అభ్యర్థి బదులు పరీక్ష రాసే వ్యక్తి సహజంగానే తెలివైన వ్యక్తి గనుక అతను సునాయాసంగా అధిక మార్కులు ‘సాధించిపెడతాడు’. పరీక్ష హాల్లో ఇద్దరేసి ‘తెలివితక్కువ’ అభ్యర్థుల మధ్య ప్రతిభావంతుణ్ణి కూర్చోబెట్టి అతని జవాబు పత్రాలనుంచి వారిద్దరూ కాపీకొట్టే ఏర్పాటు చేయడం రెండో పద్ధతి. మూడో విధానం మరింత సృజనాత్మకమైనది. జవాబుల కోసం ఉపయోగించే ఓఎంఆర్ షీటును ఖాళీగా వదిలేసి రమ్మని ఎంపిక చేసిన అభ్యర్థులకు ముందే చెబుతారు. వారు పరీక్షకు పట్టే సమయాన్ని ఖాళీగా గడిపి వెళ్లిపోతారు. ఆ తర్వాత వారికి అత్యధిక మార్కులు వచ్చినట్టు ప్రకటిస్తారు. ఆ మార్కులకు అనుగుణంగా ఓఎంఆర్ షీట్లు నింపుతారు. బోర్డు అధికారులే కొందరితో ఆ ఓఎంఆర్ షీట్లు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టంకింద పిటిషన్లు దాఖలు చేయిస్తారు. పర్యవసానంగా ఆ షీట్లు బయటికొస్తాయి. ఎంపికైన అభ్యర్థుల ‘ప్రతిభ’ లోకానికి వెల్లడవుతుంది. కోట్లాది రూపాయలు చేతులు మారి యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని పట్టుకోవడం నిజానికి అత్యంత కష్టతరం. కానీ, రెండేళ్లక్రితం డాక్టర్ ఆనంద్ రాయ్ అనే కంటి వైద్య నిపుణుడు ఆశిష్ చతుర్వేది అనే మరొకరితో కలిసి దీన్నంతటినీ పసిగట్టారు. దీని కూపీ లాగాలని, సామాన్య పౌరులకు న్యాయం కలగజేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 2013లో హైకోర్టు దీనిపై విచారణకు ఆదేశించాక తేనెతుట్టె కదిలింది. బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ సహా 130 మంది పట్టుబడ్డారు. వీరిలో పరీక్షల కంట్రోలర్ పంకజ్ త్రివేదీ మొదలుకొని అనేకమంది సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఉన్నారు. 720 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా నిందితులుగా తేలారు. 218 మంది అజ్ఞాతంలోకెళ్లగా మిగిలినవారిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కుంభకోణంలో ఆరెస్సెస్ ముఖ్యుడు సురేష్ సోనీ హస్తమున్నదని త్రివేదీ వాంగ్మూలమిచ్చారు. దీనికి ఆధారాలు లభ్యంకాలేదని పోలీసులు తేల్చిన మాట నిజమే అయినా కొంతకాలం క్రితం ఆరెస్సెస్ సోనీని బాధ్యతల నుంచి తప్పించడానికి ఇదొక కారణమని గుప్పుమంది. ఈ మహా కుంభకోణాన్ని అత్యంత చాకచక్యంగా నడిపించినవారిలో కొందరు బెయిల్ తెచ్చుకుంటే... మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు. కానీ, దీన్ని లోకానికి వెల్లడించిన వారిద్దరూ ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆశిష్ చతుర్వేదిపై ఇప్పటికే మూడుసార్లు దాడులు జరిగాయి. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు ఇలాంటి నిర్వాకంలో నిండా కూరుకుపోయిన ‘వ్యాపమ్’కు ఉద్యోగ నియామకాల బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఇంకేం... అందులో సైతం ఆ సంస్థ ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగాలను అంగడి సరుకు చేశారు. ఎడాపెడా దండుకున్నారు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాంనరేష్ యాదవ్ సైతం ఇందులో కూరుకుపోయారంటే ఆ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఏ స్థితికి చేరాయో... ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీఎం శివరాజ్ సింగ్ ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా రుజువు కాలేదు గదా అని బీజేపీ నేతలు దబాయిస్తున్నారు. కానీ పట్టపగ్గాల్లేకుండా విద్య, ఉద్యోగాల్లో కుంభకోణం నడుస్తుంటే కళ్లూ, చెవులూ మూసుకుని కూర్చున్న పాలకులది పాపం కాదా? అందుకు నైతిక బాధ్యత ఉండదా? మధ్యప్రదేశ్ వ్యవహారాలపై బీజేపీ అధినాయ కత్వం మౌనం వహిస్తున్న తీరు ఆశ్చర్యకరం. శివరాజ్‌సింగ్ తన సచ్ఛీలత నిరూపించుకోవాలి. నైతిక బాధ్యతను గుర్తెరగాలి. -
మధ్యప్రదేశ్ గవర్నర్ రాంనరేష్ యాదవ్ రాజీనామా
మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన స్కాంలో ఆయన కుమారుడు నిందితుడిగా ఉండటం, ఆయనపై కూడా సిట్ బృందం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇక చాలు.. ఈ పదవి నుంచి వైదొలగాలని ఆదేశించడంతో రాం నరేష్ యాదవ్ తన పదవికి బుధవారం నాడు రాజీనామా చేశారు. దీంతో ఇటీవలి కాలంలో ఆరోపణల కారణంగా బలవంతంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చిన గవర్నర్ల జాబితాలోకి ఆయన కూడా చేరారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వ్యవహరించిన ఎన్డీ తివారీ కూడా ఆరోపణల కారణంగానే తన పదవి పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్ గవర్నర్ పై ఎఫ్ఐఆర్ నమోదు
ఢిల్లీ:మధ్యప్రదేశ్‌లో సంచలం రేపిన పరీక్షల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మార్కుల కుంభకోణంలో గవర్నర్ పాత్ర ఉందని స్పెషల్ టాస్క్ ఫోర్స్ తేల్చడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై గవర్నర్ నుంచి కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. కుంభకోణంపై రామ్ నరేశ్ పై ఆరోపణలు ఎదుర్కొవడంతో అతన్ని గవర్నర్ బాధ్యతల నుంచే తప్పించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వచ్చాయి. రామ్ నరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ ను నమోదు చేశారు. -
ఎంపీ గవర్నర్‌పై ఎఫ్ఐఆర్
మధ్యప్రదేశ్‌లో సంచలం రేపిన పరీక్షలు, ఉద్యోగ నియమాకాల కుంభకోణంలో ఆ రాష్ట్ర గవరర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం నాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (ఎంపీపీఈబీ) నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగాల నియమకాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వెలువెత్తడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. కుంభకోణం ప్రధాన సూత్రధారి గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గవర్నర్ పాత్రపైనా అనేక ఆరోపణలు వినవచ్చాయి. ఈ నేపథ్యంలో అటు కుమారుడితో పాటు తండ్రినీ విచారించేందుకు టాస్క్ ఫోర్స్ సిద్ధమైంది. రాంనరేశ్ రాజ్యాంగ పదవిలో ఉండటంతో హైకోర్టు అనుమతితో ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు.