వ్యాపం స్కాంలో ఎ-10 గవర్నరేనా?
దేశాన్నే వణికిస్తున్న వ్యాపం స్కాంలో పెద్దవాళ్లు ఎవరినీ వదల్లేదని, అందరినీ బుక్ చేస్తున్నామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెబుతున్నా.. ఈ కేసులో మాత్రం ఓ పెద్ద చేప విచారణ నుంచి తప్పించుకుందనే అంటున్నారు. గవర్నర్ రాం నరేష్ యాదవ్ను ఈ కేసులో ఎ-10గా చేర్చారని, అయితే.. రాజ్యాంగపరమైన రక్షణ ఉండటంతో ఆయనపై విచారణను చేపట్టకుండా ఆపేశారని అంటున్నారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి బయటపెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది.
దొరికిన ఆధారాలను బట్టి చూస్తే గవర్నర్పై విచారణ చేపట్టాల్సిందేనని, ఇప్పుడు అలా చేయకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రిని రక్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ స్కాంలో సీఎం చౌహాన్తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ను తొలగించాల్సిందేనని, అలా చేస్తే ఆయన మొత్తం గుట్టంతా విప్పుతారనే బీజేపీ భయపడుతోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషన్ విమర్శంచారు. గవర్నర్ పదవి నుంచి రాం నరేష్ యాదవ్ను తొలగించాలంటూ దాఖలైన కేసుపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది.