ట్వీటర్ యుద్ధం
తెలంగాణ పోలీస్‌పై దిగ్విజయ్ వివాదాస్పద పోస్టు
తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్
- ఐసిస్ పేరిట వెబ్‌సైట్ ఏర్పాటుచేసి
- ముస్లింలను రెచ్చగొడుతున్నారని డిగ్గీ ట్వీట్
- ఉనికి చాటుకోవడానికే వివాదాస్పద వ్యాఖ్యలు: కేటీఆర్
- వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్
- దిగ్విజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ పోలీసులపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులు ఐసిస్ పేరిట నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటుచేసి ముస్లిం యువతను రెచ్చగొడుతున్నారని సోమవారం ట్వీటర్‌లో పోస్టు చేశారు. ‘తెలంగాణ పోలీసులు నకిలీ ఐసిస్ వెబ్‌సైట్ నడుపుతున్నారు. ముస్లిం యువతను రెచ్చగొడుతూ ఉగ్రవాదంవైపు మళ్లేందుకు ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో రైల్లో బాంబు బ్లాస్ట్‌కు బాధ్యులైన నిందితులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అదేరోజు కాన్పూర్‌లో సైఫుల్లా ఎన్‌కౌంటర్ జరిగింది.
ముస్లిం యువతపై వల పన్నడంలో భాగంగా వారిని ఉగ్రవాదంవైపు రెచ్చగొడుతున్నారా, ఇది నైతికమా, తెలంగాణ పోలీసులు ఇలా వల పన్నేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం ఇచ్చారా, అలా అయితే కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయరా, ఒకవేళ ఆయన పోలీసులకు ఆ అధికారం ఇవ్వని పక్షంలో దీనిపై దర్యాప్తు జరిపించి బాధ్యులపైన చర్య తీసుకోవాలి’అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియా వెబ్‌సైట్లు విద్వేషపూరిత, తీవ్రవాద పోస్టింగులను తొలగించకుండా లాభాపేక్షతో పని చేస్తున్నాయని, వీటిపై భారీ జరిమానాలు విధించాలంటూ బ్రిటన్ హోం అఫైర్స్ కమిటీ ఇచ్చిన సిఫారసులపై ‘ది గార్డియన్’ పత్రిక రాసిన కథనాన్ని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. ‘దీన్ని నేను అంగీకరిస్తున్నా. మరి తెలంగాణ పోలీసులు బోగస్ ఐసిస్ వెబ్‌సైట్‌ను సృష్టించి ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడాన్ని ఏమంటారు?’’అని మళ్లీ ఓ గంట తర్వాత ట్వీట్ చేశారు.
వెంటనే క్షమాపణ చెప్పాలి..: కేటీఆర్
ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం సరి కాదని, వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్వీటర్‌లో డిమాండ్ చేశారు. రాష్ట్ర శాంతి భద్రతల వ్యవహారాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉగ్రవాదులను పట్టించిన తెలంగాణ పోలీస్‌పై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదని హితవుపలికారు. ఢిల్లీలో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
కర్ణాటక, గోవా రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఆయనను తొలగించడంతో ఉనికి కోసం దిగ్విజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్ కూడా దిగ్విజయ్ వ్యాఖ్యలను సమర్థించినట్టే అవుతుందని చెప్పారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను దిగ్విజయ్ వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
హాస్యాస్పదం: ఎంపీ కవిత
ఎంపీ కవిత ట్వీటర్‌లో స్పందిస్తూ.. దిగ్విజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు. దిగ్విజయ్‌వి నిరాధార ఆరోపణలని, ఒక సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలను ఊహించలేదని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖ కూడా ట్వీటర్ ద్వారా స్పందించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా ఒక సీనియర్ నేత ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధకరమని డీజీపీ ఘాటుగా స్పందించారు. దేశ భద్రత కోసం పనిచేస్తున్న పోలీస్ శాఖపై చేసిన వ్యాఖ్యలు పోలీస్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలి: కె.లక్ష్మణ్
తెలంగాణ పోలీసులపై ట్వీటర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు ఐసిస్ నకిలీ వెబ్‌సైట్‌లతో ముస్లిం యువతను రెచ్చగోడుతున్నారంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయనపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం
రాష్ట్ర పోలీస్ శాఖపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్‌పై పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. సీనియర్ నాయకుడిగా ఉంటూ ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం భావ్యం కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించే క్రమంలో కానిస్టేబుల్ శ్రీనివాస్ ప్రాణాలు ఎదురొడ్డి పోరాడాడు. అతడికి శౌర్య చౌక్ర పతకాన్ని స్వయంగా రాష్ట్రపతి బహుకరించారు. 2015 సూర్యాపేటలో సిమీ ఉగ్రవాదులతో పోరాటంలో ఒక ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు అమరులయ్యారు. ఇవి మీకు గుర్తుకులేవా’అని ప్రశ్నించారు. ఒక రాష్ట్ర శాంతి భద్రతలే కాకుండా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ పాత్ర అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించిన విషయం దిగ్విజయ్ సింగ్ మర్చిపోవడం బాధకరమని పేర్కొన్నారు. పోలీస్ శాఖను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.