'గవర్నర్ తొలగింపు' దావాను స్వీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సంచలనాత్మక వ్యాపం స్కామ్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేశ్ యాదవ్ను తొలగించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిచంది.
తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటున్న కారణంగా పదవి నుంచి తప్పుకోవాలని కేంద్రప్రభుత్వం గతంలోనే ఆయనను ఆదేశించినప్పటికీ రాంనరేశ్ యాదవ్ మాత్రం ఇప్పటికీ గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవినుంచి తొలిగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్వహించిన పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణంలో గవర్నర్ రాంనరేశ్ యాదవ్ కుమారుడు శైలేశ్ యాదవ్ ప్రధాన ముద్దాయి. కాగా గత మార్చిలో శైలేశ్ అనుమానాస్పద రీతితో మరణించారు. గవర్నర్ రాంనరేశ్ యాదవ్ పాత్రకూడా నిర్ధారణ కావడంతో కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్.. హైకోర్టు అనుమతితో ఎఫ్‌ఐఆర్లో గవర్నర్ పేను చేర్చింది. ఇప్పటివరకు ఈ కేసులో 2 వేల మందికిపైగా అరస్టుకాగా, మరో 800 మందిని తర్వరలో అరెస్టుచేస్తారనే వార్తలు వినవస్తున్నాయి. మరోవైపు నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.