కుంభకోణాల పుట్ట | Scams in madhya pradesh state | Sakshi
Sakshi News home page

కుంభకోణాల పుట్ట

Published Wed, Feb 25 2015 11:18 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

Scams in madhya pradesh state

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మంచి పేరుంది. ఆయన గురించి చెప్పినప్పుడల్లా జాతీయ మీడియా ప్రశంసాపూర్వకమైన విశేషణాలు ఉపయోగిస్తుంటుంది. ‘మెతక స్వభావి’ మొదలుకొని ‘వివాదరహితుడి’ దాకా అందులో చాలా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్లక్రితం గుజరాత్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ఢిల్లీపై గురి పెట్టినప్పుడు ఆయనకు పోటీగా శివరాజ్ సింగ్‌ను ముందుకు తోసే ప్రయత్నం జరిగింది.
 
 అభివృద్ధిలో మొదటినుంచీ ముందే ఉన్న గుజరాత్‌ను మోదీ ఇంకాస్త ముందుకు తీసుకెళ్లిన మాట నిజమే అయినా... పూర్తిగా వెనకబడి ఉన్న మధ్యప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి శివరాజ్ సింగ్ చాలా శ్రమకోర్చారని ఒక సందర్భంలో అద్వానీయే ప్రశంసలు కురిపించారు. అలాంటి మధ్యప్రదేశ్‌లో తొలిసారి 2009లో వెల్లడై అప్పుడప్పుడు తెరపైకి వస్తున్న ‘పరీక్షల స్కాం’ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి అది మరింత బలంగా దూసుకొచ్చి ఆ రాష్ట్ర గవర్నర్ రాం నరేష్ యాదవ్ పదవికి ఎసరు తెచ్చింది. ఆయన గారిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు కావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నవారు, పలుకుబడి కలవారు నిబంధనలను తోసిరాజని ఎంత నిస్సిగ్గుగా తమ పనులు నెరవేర్చుకుంటారో తెలియాలంటే ఈ స్కాంను చూడాల్సిందే!
 
ఆ రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించేందుకు నెలకొల్పిన మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపమ్)కు... పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలోకి రాని ఉద్యోగాల నియామకాల బాధ్యతను కూడా కొన్నాళ్లక్రితం కట్టబెట్టారు. అయిదేళ్లక్రితమే ప్రవేశ పరీక్షల విషయంలో నిందారోపణలు ఎదుర్కొన్న వ్యాపమ్‌కు అదనంగా ఉద్యోగాల నియామకాన్ని అప్పగించడం నిజానికి ఘోర తప్పిదం. ప్రవేశ పరీక్ష ల్లో అనర్హులకు నచ్చిన చోట సీటు దొరికేలా చేసేందుకు ‘వ్యాపమ్’ సీనియర్ అధికారులు వ్యవహరించిన తీరు...  ఆ సంస్థలో అవినీతి, అక్రమాలు వ్యవస్థీకృతమైన తీరు అత్యంత దిగ్భ్రాంతికరం.
 
పరీక్ష రాయాల్సిన అభ్యర్థి అడ్మిట్ కార్డులో అతని తరఫున రాసే వేరే వ్యక్తి ఫొటో ఉంచడం... పరీక్ష అయిపోయాక అసలైన అభ్యర్థి ఫొటో పెట్టి అడ్మిట్ కార్డును మార్చడం అందులో ఒకటి. అసలు అభ్యర్థి బదులు పరీక్ష రాసే వ్యక్తి సహజంగానే తెలివైన వ్యక్తి గనుక అతను సునాయాసంగా అధిక మార్కులు ‘సాధించిపెడతాడు’. పరీక్ష హాల్‌లో ఇద్దరేసి ‘తెలివితక్కువ’ అభ్యర్థుల మధ్య ప్రతిభావంతుణ్ణి కూర్చోబెట్టి అతని జవాబు పత్రాలనుంచి వారిద్దరూ కాపీకొట్టే ఏర్పాటు చేయడం రెండో పద్ధతి. మూడో విధానం మరింత సృజనాత్మకమైనది. జవాబుల కోసం ఉపయోగించే ఓఎంఆర్ షీటును ఖాళీగా వదిలేసి రమ్మని ఎంపిక చేసిన అభ్యర్థులకు ముందే చెబుతారు.
 
వారు పరీక్షకు పట్టే సమయాన్ని ఖాళీగా గడిపి వెళ్లిపోతారు. ఆ తర్వాత వారికి అత్యధిక మార్కులు వచ్చినట్టు ప్రకటిస్తారు. ఆ మార్కులకు అనుగుణంగా ఓఎంఆర్ షీట్లు నింపుతారు. బోర్డు అధికారులే కొందరితో ఆ ఓఎంఆర్ షీట్లు వెల్లడించాలంటూ సమాచార హక్కు చట్టంకింద పిటిషన్లు దాఖలు చేయిస్తారు. పర్యవసానంగా ఆ షీట్లు బయటికొస్తాయి. ఎంపికైన అభ్యర్థుల ‘ప్రతిభ’ లోకానికి వెల్లడవుతుంది. కోట్లాది రూపాయలు చేతులు మారి యథేచ్ఛగా సాగిన ఈ కుంభకోణాన్ని పట్టుకోవడం నిజానికి అత్యంత కష్టతరం. కానీ, రెండేళ్లక్రితం డాక్టర్ ఆనంద్ రాయ్ అనే కంటి వైద్య నిపుణుడు ఆశిష్ చతుర్వేది అనే మరొకరితో కలిసి దీన్నంతటినీ పసిగట్టారు. దీని కూపీ లాగాలని, సామాన్య పౌరులకు న్యాయం కలగజేయాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
 
 తీగ లాగితే డొంకంతా కదిలినట్టు 2013లో హైకోర్టు దీనిపై విచారణకు ఆదేశించాక తేనెతుట్టె కదిలింది. బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ సహా 130 మంది పట్టుబడ్డారు. వీరిలో పరీక్షల కంట్రోలర్ పంకజ్ త్రివేదీ మొదలుకొని అనేకమంది సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు, దళారులు ఉన్నారు. 720 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా నిందితులుగా తేలారు. 218 మంది అజ్ఞాతంలోకెళ్లగా మిగిలినవారిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కుంభకోణంలో ఆరెస్సెస్ ముఖ్యుడు సురేష్ సోనీ హస్తమున్నదని త్రివేదీ వాంగ్మూలమిచ్చారు.
 
 దీనికి ఆధారాలు లభ్యంకాలేదని పోలీసులు తేల్చిన మాట నిజమే అయినా కొంతకాలం క్రితం ఆరెస్సెస్ సోనీని బాధ్యతల నుంచి తప్పించడానికి ఇదొక కారణమని గుప్పుమంది. ఈ మహా కుంభకోణాన్ని అత్యంత చాకచక్యంగా నడిపించినవారిలో కొందరు బెయిల్ తెచ్చుకుంటే... మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు. కానీ, దీన్ని లోకానికి వెల్లడించిన వారిద్దరూ ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఆశిష్ చతుర్వేదిపై ఇప్పటికే మూడుసార్లు దాడులు జరిగాయి. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు ఇలాంటి నిర్వాకంలో నిండా కూరుకుపోయిన ‘వ్యాపమ్’కు ఉద్యోగ నియామకాల బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు.
 
 ఇంకేం... అందులో సైతం ఆ సంస్థ ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఉద్యోగాలను అంగడి సరుకు చేశారు. ఎడాపెడా దండుకున్నారు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రాంనరేష్ యాదవ్ సైతం ఇందులో కూరుకుపోయారంటే ఆ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ ఏ స్థితికి చేరాయో... ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీఎం శివరాజ్ సింగ్ ప్రమేయం ఉన్నట్టు ఎక్కడా రుజువు కాలేదు గదా అని బీజేపీ నేతలు దబాయిస్తున్నారు. కానీ పట్టపగ్గాల్లేకుండా విద్య, ఉద్యోగాల్లో కుంభకోణం నడుస్తుంటే  కళ్లూ, చెవులూ మూసుకుని కూర్చున్న పాలకులది పాపం కాదా? అందుకు నైతిక బాధ్యత ఉండదా? మధ్యప్రదేశ్ వ్యవహారాలపై బీజేపీ అధినాయ కత్వం మౌనం వహిస్తున్న తీరు ఆశ్చర్యకరం. శివరాజ్‌సింగ్ తన సచ్ఛీలత నిరూపించుకోవాలి. నైతిక బాధ్యతను గుర్తెరగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement