మధ్యప్రదేశ్‌లో ఎవరిది ‘పైచేయి’? | Madhya Pradesh Political Scene, Who will win | Sakshi
Sakshi News home page

Nov 27 2018 4:02 PM | Updated on Mar 18 2019 9:02 PM

Madhya Pradesh Political Scene, Who will win - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను సెమీ ఫైనల్‌గా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్న నేపథ్యంలో వాటిల్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జరగుతున్న ఎన్నికలను ‘టై–బ్రేకర్‌’గా పరిగణించవచ్చు. ఐదు రాష్ట్రాల్లో మిజోరమ్, చత్తీస్‌గఢ్‌లు చిన్న రాష్ట్రాలు కాగ, తెలంగాణ ఎన్నికలను ప్రాంతీయ యుద్ధంగానే భావించవచ్చు. రాజస్థాన్‌ పెద్ద రాష్ట్రమే అయినప్పటికీ రెండు దశాబ్దాల నుంచి కాంగ్రెస్, బీజేపీలే వరుసగా పంచుకుంటున్నాయి. పైగా రాజస్థాన్‌లో ఈసారి కాంగ్రెస్‌ విజయం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. ప్రధాన హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఏ సర్వేలు స్పష్టం చేయడం లేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌ వైపు, మరికొన్ని సర్వేలు బీజేపీ వైపు మొగ్గుచూపాయి.

మధ్యప్రదేశ్‌ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్నికలను ప్రధానంగా ప్రభావితం చేసే వర్గం ఇదే. పంటలకు సరైన గిట్టుబాటు ధరలను కల్పించాలని, రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ 2017లో రైతులు నిర్వహించిన సమ్మె ఇక్కడ రక్తసిక్తమయింది. మండ్‌సార్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మరణించారు. ఆ సంఘటన నాడు యావత్‌ దేశ రైతు లోకాన్ని కదిలించింది. రైతులకు గిట్టుబాటు ధరల స్థానంలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘భవంతర్‌ భుక్తాన్‌ యోజన’ పేరిట కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు, మార్కెట్‌ ధరకు ఉన్న వ్యత్యాసాన్ని నేరుగా ప్రభుత్వం ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకం విఫలమైందని, వ్యాపారులకు, ధనిక రైతులకే ఉపయోగపడుతోందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రుణాలను మాఫీ చేయకపోవడం పట్ల కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు కూడా తమను దెబ్బతీసిందని వారు వాపోతున్నారు.

ఎన్నికలపై నిరుద్యోగం ప్రభావం
నిరుద్యోగ సమస్య రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగులు 53 శాతమని, నిరుద్యోగం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న యువకుల సంఖ్య 2005తో పోలిస్తే 2015 నాటికి 20 రెట్లు పెరిగిందని ‘బిరోజ్‌గర్‌ సేన’ వెల్లడించింది. రాష్ట్ర వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ‘వ్యాపం’ కుంభకోణం పట్ల కూడా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేయడం, జీఎస్టీని ప్రవేశపెట్టడం పట్ల మరోపక్క చిన్న వ్యాపారులు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నారు.

దళితులు వ్యతిరేకం
ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని సుప్రీం కోర్టు సడలించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏప్రిల్‌ 2వ తేదీన నిర్వహించిన భారత్‌ బంద్‌ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో విమల్‌ ప్రకాష్‌ అనే దళితుడు మరణించాడు. ఈ సంఘటనే కాకుండా శివరాజ్‌ సింగ్‌ చౌవాన్‌ సంపన్న వర్గాల సంక్షేమం కోసమే కషి చేశారని, నిమ్న వర్గాలైన తమను అంతగా పట్టించుకోలేదని ఎస్సీ, ఎస్టీలు బలంగా భావిస్తున్నారు. నాడు బంద్‌తో దళితులు దూరం అవుతారని భావించిన మోదీ సర్కార్‌ ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టాన్ని యథావిధిగా పునరుద్ధరించారు. అది కొంత మంది అగ్రవర్ణాలకు కోపం తెప్పించింది. వారు సెప్టెంబర్‌ ఐదవ తేదీన ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని ఎత్తివేయాలంటూ రాష్ట్రంలో బంద్‌ నిర్వహించారు. దేశ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను నియమించడం పట్ల, దేశంలో తాము ఆశించిన రిజర్వేషన్ల విధానాన్ని ఎత్తివేయక పోవడం పట్ల కూడా కొన్ని అగ్రవర్ణాలు పాలకపక్షంపై ఆగ్రహంతో ఉన్నాయి.  

మెజారిటీ ప్రజలు పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ‘మామ’గా వారికి దగ్గరైన శివరాజ్‌ సింగ్‌ చౌవాన్‌ పట్ల వారికి అంత వ్యతిరేకత లేదు. అందువల్లనే కాంగ్రెస్‌–బీజేపీ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాయావతి నాయకత్వంలో బీఎస్పీ పార్టీ కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడం తమకు లాభించే అంశమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ‘సపక్స్‌ సమాజ్‌’ అని కొత్త పార్టీ ఆ మేరకు బీజేపీ ఓట్లను చీలుస్తుందన్న విషయాన్ని వారు మరచిపోతున్నారు. రాష్ట్రంలో 45 శాతం మంది ఉన్న ఆదివాసీల్లో కూడా ఎక్కువ మంది కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతానికి ‘హస్తం’ దే పైచేయని సామాజిక, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement