మధ్యప్రదేశ్‌లో హంగ్‌? | madhyapradesh assembly elections in hung results | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో హంగ్‌?

Published Wed, Dec 12 2018 3:42 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

madhyapradesh assembly elections in hung results - Sakshi

భోపాల్‌లో జ్యోతిరాదిత్య కటౌట్లతో కాంగ్రెస్‌ కార్యకర్తలు

భోపాల్‌: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది.

మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్‌ నేతలు మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ను ఆనందీబెన్‌ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్‌ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి.

ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్‌
సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్‌ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్‌ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్‌ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్‌ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్‌ చేరుకున్నారు.

గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌
మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.



వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు
భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్‌ ఫిగర్‌ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్‌ కీ బేటా)పే రొందిన చౌహాన్‌ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్‌ ఆవాస్‌ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్‌ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement