ఐదు రాష్ట్రాల ఫలితాలు: బీజేపీకి బిగ్‌ షాక్‌.. | Big loss to BJP in Four State Assembly Elections | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 11 2018 5:40 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Big loss to BJP in Four State Assembly Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 2014 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి భారతీయ జనతా పార్టీకి తగిలిన అతిపెద్ద షాక్‌ నేటి ఫలితాలు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో నువ్వా, నేనా అన్నట్లు బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇవ్వడం, రాజస్థాన్‌లో వసుంధర రాజె నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం, రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి చత్తీస్‌గఢ్‌లో పాగా వేసిన బీజేపీని కాంగ్రెస్‌ పార్టీ గద్దె దించడం అసాధారణమే. తెలంగాణలో ఐదు స్థానాలు కలిగిన బీజేపీ, అత్యధిక స్థానాలకు పోటీ చేసి కనీసం 20 సీట్లనైనా గెలుచుకుందామని ఆశించి బొక్కా బోర్లా పడింది. ఇక మిజోరంలో కాంగ్రెస్, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మధ్యనే అధికార మార్పిడి జరగడం సర్వ సాధారణమే.

ప్రీపోల్‌ సర్వేలు, పోస్ట్‌ పోల్‌ సర్వేలన్నీ కూడా కొంత గతి తప్పాయి. జాతీయ సర్వేలన్నీ రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని సూచించాయి. వాటి అంచనాలను తలకిందులు చేస్తూ చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం విశేషం. తెలంగాణలో పాలకపక్షం టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఎక్కువ సర్వేలు చెప్పినా అఖండ విజయం సాధింస్తుందని ‘ఇండియా టుడే’ సర్వేనే అంచనా వేయగలిగింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోకపోవడం కాంగ్రెస్‌ అధిష్టానంకు కొంత నిరుత్సాహం కలిగించే అంశమే.

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ విజయం
రాజస్థాన్‌లో మొత్తం 200 సీట్లకుగాను 199 సీట్లకు ఎన్నికలు జరిగాయి. 2013 ఎన్నికల్లో బీజేపీకి 163 సీట్లు రాగా, కాంగ్రెస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినదానికన్నా ఎక్కువ సీట్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1993 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఓసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తోంది. ఈసారి వసుంధర ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తోంది. వసుంధర రాజె స్వతహాగా అహంభావి కావడం, ప్రజలతో మమేకమయ్యే మనస్తత్వం లేకపోవడం ఓటర్లకు ఆమెను దూరం చేస్తూ వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గజేంద్ర షెకావత్‌ను తొలగించడం, 2017లో వ్యతిరేకించినప్పటికీ వివాదాస్పద ‘పద్మావత్‌’ సినిమాను విడుదల చేయడం రాజ్‌పుత్‌లకు ప్రభుత్వం మీద కోపం తెప్పించింది.

ఏప్రిల్‌–మే నెలల్లో వ్యవసాయ సంక్షోభం కారణంగా ఐదుగురు రైతులు ఆత్మహత్య  చేసుకోవడం, నిరుద్యోగ సమస్య ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 55 శాతం ఉండగా, 2013 నుంచి వసుంధర రాజె ప్రభుత్వం ఏటా 15 లక్షలకు మించి ఉద్యోగాలను కల్పించలేక పోయింది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు కూడా పుట్టి ముంచాయి. మెవ«ద్‌ ప్రాంతంలో 28 అసెంబ్లీ సీట్లు ఉండగా, అక్కడి ప్రజలంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం 1998 సంవత్సరం నుంచి అలవాటు. వారు గతంలో బీజేపీకి ఓటు వేయగా, ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారు.

మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్సే
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 సీట్లు ఉండగా, 2013 ఎన్నికల్లో బీజేపీకి 44.88 శాతం ఓట్లతో 165 సీట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీకి 36.38 శాతంతో 58 సీట్లు వచ్చాయి. స్వయంగా వంద సీట్లను దాటిన కాంగ్రెస్‌ పార్టీ మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ మద్దతుతో సుస్తిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పదవిలో శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కొనసాగినప్పటికీ ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత లేదు. తమ పంటలకు తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని,  రుణాలు మాఫీ చేయడం లేదని ప్రభుత్వం పట్ల రైతుల్లో వ్యతిరేకత ఉంది.

దేశవ్యాప్త సమ్మెలో భాగంగా 2017లో మంద్‌సార్‌లో రైతులు నర్విహించిన ర్యాలీపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆరుగురు రైతులు మరణించారు. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల రైతుల ఆగ్రహం మరింత పెరిగింది. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం గత 14 ఏళ్లలో ఏటా 17,600 ఉద్యోగాలను మాత్రమే కల్పించకలిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పరిమితి వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడం కూడా నిరుద్యోగులకు కోపం తెప్పించింది. జ్యోతిరాధిత్య సింధియా, కమల్‌ నాథ్‌లో ఎవరు ప్రభుత్వ సారథులో నిర్ణయించక పోవడం కూడా కాంగ్రెసకు కలిసి వచ్చింది.

చత్తీస్‌గఢ్‌లోనూ..
మొత్తం సీట్లు 90. బీజేపీ పాలనలో 15 సంవత్సరాల నుంచి రమణ్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా ఆయన పట్ల ప్రజల్లో అంతగా వ్యతిరేకత లేదు. కాకపోతే నిరుద్యోగం, దారిద్య్రం, నక్సలిజం సమస్యలు ఈ ప్రాంతాన్ని పీడిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల పరిధిలోని 18 అసెంబ్లీల పరిధిలో నక్సల్స్‌ సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలోని 40 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువున నివసిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం కూడా తీవ్రంగానే ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని, వరికి కనీస మద్దతు ధరను 2,500 రూపాయలు చేస్తామని, పేద కుటుంబానికి నెలకు 35 కిలోల బియ్యాన్ని ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన ఎన్నికల హామీలు ప్రజలకు ఎంతో ఆకర్షించాయి. ఫలితంగా అక్కడి రైతులు తమ చేతికి వచ్చిన వరి పంటలను ఇంకా కోయలేదు. ఇక మిజోరం ఫలితాలు మామూలే. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement