బీజేపీ ఓట్ల శాతం తగ్గింది! | bjp vote bank slow down on five states election results | Sakshi
Sakshi News home page

బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!

Published Wed, Dec 12 2018 3:52 AM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

bjp vote bank slow down on five states election results - Sakshi

న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్‌ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి.



ఛత్తీస్‌గఢ్‌లో దిగజారిన బీజేపీ..  
ఛత్తీస్‌గఢ్‌ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్‌ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు.

రాజస్తాన్‌లోనూ అదే పరిస్థితి..
రాజస్తాన్‌లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్‌ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్‌ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది.

మిజోలో కాంగ్రెస్‌ చతికిల..
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్‌ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్‌ఎఫ్‌ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది.

హోరాహోరీగా మధ్యప్రదేశ్‌..
కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్‌ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement