ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయనేది సుస్పష్టం. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి అడుగు దూరంలో ఆగిపోవడం.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి ఎదురుదెబ్బలు తగలడంతో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు మోదీని ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? అన్నది తేలిపోతుందని విశ్లేషణలు చెబుతున్నాయి. రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలు ఎలాగున్నా బీజేపీపై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ మధ్యప్రదేశ్ మాత్రం అధికార పీఠాన్ని నిర్ణయించేదిగా ఉండనుంది.
వేళ్లూనుకున్న బీజేపీ
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ కమలానికే ఓటర్లు పట్టం కట్టారు. ఆ పార్టీకి రాష్ట్రంలో అన్ని వర్గాల్లో మంచి పట్టుంది. ఒక్కో ఎన్నికకు.. ఒక్కో రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు విస్తరిస్తూ వస్తోంది. అయితే.. ఇటీవలి రైతుల ఆందోళన, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాలతో పాటు పలు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే (నాలుగోసారి) జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ తగ్గలేదని, మోదీకి ఆదరణ కొనసాగుతోందని అర్థం చేసుకోవచ్చు. అదే కాంగ్రెస్ విజయం సాధిస్తే అది ఎర్రకోటలో పాగా వేసేందుకు గాలులు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు అందుతాయి. మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఓట్లు, సీట్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 2008 ఎన్నికల్లో 230 సీట్లకుగాను బీజేపీ 143 సీట్లు గెలుచుకుంటే, 2013 ఎన్నికల నాటికవి 165కు పెరిగాయి. అలాగే, 2008 ఎన్నికల్లో 37.64% ఓట్లు రాగా, గత ఎన్నికల్లో 44.87% వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అయితే మధ్య ప్రదేశ్‌లో బీజేపీ రికార్డు స్థాయిలో 54.03% ఓట్లు రాబట్టుకుంది.
పుంజుకున్న బీజేపీ
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పతనం మొదలయిన తర్వాత చాలా రాష్ట్రాల్లో కనీసం రెండు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్‌లో మాత్రం వరసగా కాంగ్రెస్ అధికారానికి దూరమవడం, బీజేపీ ఆధిపత్యం కొనసాగడం జరుగుతోంది. తద్వారా ఇక్కడ బీజేపీ ఎన్నికల రాజకీయాలకు అతీతంగా బీజేపీ తన పట్టు నిలుపుకుందని రుజువవుతోంది. ‘రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల్లోనూ బీజేపీ తన బలం పెంచుకుంటోంది. ప్రత్యర్థుల కంటే బాగా పని చేయగలదన్న అభిప్రాయం ప్రజల్లో కలిగించింది. దాని ఫలితమే వరస ఎన్నికల్లో గెలుపు’ అంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ 15 ఏళ్లుగా అధికారాన్ని కాపాడుకోవడమే కాక కాంగ్రెస్‌ను తనకు చాలా దూరంలో నిలబెట్టగలిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.38% ఓట్లు వచ్చాయి. ఇది బీజేపీ ఓట్ల శాతం కంటే 9%తక్కువ.
ఢిల్లీ పీఠానికి..సోపానమిదే!
Published Wed, Nov 28 2018 6:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment