మందసౌర్ నియోజకవర్గానికి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముగ్గురు(సుందర్‌లాల్ పట్వా, వీకే సక్లేచ, కైలాస్‌నాధ్ కట్జూ) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్ అభ్యర్ధి సుందర్‌లాల్ గెలుపొందారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ అడపాదడపా విజయం సాధించినా ఎక్కువగా జన్‌సంఘ్, బీజేపీకి ఈ నియోజకవర్గం అనుకూలంగా ఉంది. 2003 అనంతరం ఈ నియోజకవర్గం పూర్తిగా బీజేపీ పట్టులోకి వెళ్లింది. గత మూడు దఫాలు బీజేపీ అభ్యర్ధి ఇక్కడ గెలుపొందాడు. ఈ దఫా మారిన పరిస్థితులను అనుకూలంగా మలచుకొని గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2013లో బీజేపీ అభ్యర్ధి యశ్‌పాల్ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. 2008లో బీజేపీ అభ్యర్ధి యశ్‌పాల్ దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎనిమిదిమంది పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి యశ్‌పాల్ సింగ్ సిసోడియా, కాంగ్రెస్‌నుంచి నరేంద్ర నహతా, బీఎస్‌పీ నుంచి ఈశ్వర్ మక్వానా పోటీ పడుతుండగా, ఛెన్‌సింగ్ నాంద్వెల్(ఆమ్‌ఆద్మీ పార్టీ), సునీల్ బన్సాల్(సపాక్స్), అనీల్‌సోనీ, అబ్దుల్ హబీబ్, సురేశ్‌పండిట్(ఇండిపెండెంట్లు) కూడా పోటీలో ఉన్నారు.
ఓపియం సాగు..
ప్రపంచంలో ఔషధ అవసరాల కోసం ఓపియం పండించే దేశాల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. భారత్‌లో మాళ్వా ప్రాంతంలోనే ఓపియం సాగు ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వ ఓపియం పాలసీ కింద లైసెన్సులు పొందిన రైతులు మందసౌర్ తదితర జిల్లాలో ఓపియంను పండిస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో ఈ లైసెన్సుల జారీ, పంట సాగు పర్యవేక్షణ జరుగుతుంది. అక్టోబర్ నుంచి సాగు ఆరంభమవుతుంది. మార్చి కల్లా పంట చేతికొస్తుంది. మంచి లాభాలు తెచ్చే పంట కావడంతో లైసెన్సుల కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ప్రభుత్వానికి శరాఘాతంగా మారనున్నాయి.
మండోదరి పుట్టినూరు..
పురాణాల్లో మందసౌర్‌ను దశపుర అనేవారు. రామాయణం ప్రకారం ఈ ప్రాంతం రావణ పత్ని మండోదరి జన్మస్థలం. అందుకే ఇక్కడ రావణబ్రహ్మ ఆరాధన కనిపిస్తుంది. రావణుడిని తమ అల్లుడిగా వీరు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతీయులు దసరా రోజున రావణ దహనం జరుపుకోరు. నగరంలోని ఖాన్‌పురా ప్రాంతంలో 35 అడుగుల ఎత్తైన దశకంఠుడి విగ్రహం ఉంది. ప్రస్తుత నగరానికి పూర్వం ఇక్కడ మర్, సౌర్ అనే రెండు గ్రామాలుండేవని, ఇవి రెండూ కలిసి మందసౌర్ ఏర్పడిందని మరో కథనం. భౌగోళికంగా ఈ ప్రాంతం మాల్వా, మేవార్ సరిహద్దులో ఉంది. అందుకే మాళ్వా పాలకుడు హుషాంగ్ షా ఘోరీ మందసౌర్‌లో బ్రహ్మాండమైన కోటను కట్టించాడు. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతం గ్వాలియర్ రాజ్యం కింద ఉండేది. పశుపతినాధ ఆలయం, యశోధర్ముడి సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధం.
ప్రధాని వస్తే అంతే...
మధ్యప్రదేశ్‌లో బీజేపీ కంచుకోటల్లో ఒకటైన మందసౌర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పుకారు షికారు చేస్తుంది. ఏదైనా పార్టీ తరఫున ప్రచారానికి ప్రధాని వస్తే అంతే సంగతులని, నియోజకవర్గంలో విపక్షం గెలుస్తుందని చాలామంది నమ్ముతారు. 1989లో రాజీవ్ ప్రచారానికి వచ్చాక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించాడు. 1998లో బీజేపీ అభ్యర్ధి తరఫున వాజ్‌పాయ్ ప్రచారానికి వచ్చారు. ఇంకేముంది.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయభేరి మోగించాడు. దీంతో ప్రజల్లో ఈ నమ్మకం బాగా బలపడింది. 2013లో అప్పటికి ఇంకా ప్రధాని కాని నరేంద్రమోదీ బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చారు. కానీ ఈ సారి అదే మోదీ ప్రధాని హోదాలో ఈ నెల 24న మందసౌర్ వస్తున్నారు. దీంతో పాత సెంటిమెంట్ తలచుకుని కార్యకర్తలు భయపడుతున్నారు.
ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు రైతుల ఆందోళన
గతేడాది జూన్‌లో గిట్టుబాటు ధరలు కోరుతూ ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసు కాల్పులు జరగడం, ఆరుగురు ఆందోళనకారులు మరణించడం జరిగాయి. దీంతో ఆందోళనలు మరింత ముదిరి సరిహద్దు జిల్లాలకు కూడా పాకాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలింది. బీజేపీ రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. బీబీవై పేరిట రైతు సంక్షేమానికి కొత్త పథకం ప్రకటించింది. కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఈ ఆందోళన వెనుక ఓపియం మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వెల్లుల్లి ధర
ఓపియంతో పాటు ఈ ప్రాంతంలో వెల్లుల్లి సాగు కూడా ఎక్కువ. అయితే 2017 మార్చి నుంచి మందసౌర్ మార్కెట్లో వెల్లుల్లి ధర దారుణంగా పడిపోయింది. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అలాంటిది ఇప్పుడు రూపాయి, రెండ్రూపాయలకు వెల్లుల్లిని అమ్ముకోవడంపై ఈ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బాలికపై అత్యాచారం
ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇరువురు అత్యాచారం చేసి చంపేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం ఈ కేసులో వేగంగా స్పందించి ఇరువురు నిందితులను అరెస్టు చేసింది.
మతాలు, కులాల ఈక్వేషన్లు
మందసౌర్‌లో మతాల వారీగా హిందువులు, ముస్లింలు, జైనులు ఎక్కువగా ఉన్నారు. కులాల పరంగా సింధియా రాజ్‌పుట్స్, పటీదార్లు, చమార్లు ఎక్కువగా కనిపిస్తారు. హిందు ఓట్లు సమీకృతం చేయడంలో ఇంతవరకు బీజేపీ సఫలమవుతూ వస్తోంది. ఈ దఫా బీజేపీని ఎదుర్కొనేందుకు ముస్లిం–జైన్ ఫార్ములా అవలంబించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా జైన్ కులస్తుడికి టికెట్ ఇచ్చింది. మరోవైపు రైతు ఆందోళనలో మరణించినవారంతా పటేల్ కులానికి చెందిన వారే.
ఎస్‌సీ ఎస్‌టీ చట్ట సవరణ
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథాతధంగా కొనసాగించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై నియోజకవర్గంలోని ఓబీసీ, ఓసీ ఓటర్లు మండిపడుతున్నారు. తమ తమ ఊర్లలో ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ బ్యానెర్లు ప్రదర్శిస్తున్నారు. తమ ఆందోళను వ్యక్త పరిచేందుకు రాజ్‌పుత్‌లు, పటీదార్లు సపాక్స్ పార్టీ పేరతో పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment