జీవితాన్నంతా తాము నమ్మిన సిద్ధాంతానికే అర్పించారు. పార్టీకి కష్టం వచ్చిన ప్రతిసారీ మేమున్నామంటూ స్థైర్యాన్నిచ్చారు. కానీ తమ వంతు వచ్చేసరికి.. పార్టీ ‘పక్క’రాగం అందుకోవడంతో నిశ్చేష్టులయ్యారు. నిరాశ, ఆవేదనతో ఆత్మహత్యాయత్నం చేశారు. ఇది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దీనస్థితికి నిదర్శనమిది. అటు ఓ బీజేపీ టికెట్ ఆశించిన నేతకూ చివరి నిమిషంలో ఆ పార్టీ షాకిచ్చింది.
కాంగ్రెస్‌లోనూ టికెట్ రాలేదన్న నిరాశతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌సింగ్ కుశ్వాహ ఆత్మహత్యాయత్నం చేశారు. గ్వాలియర్ నుంచి ప్రేమ్‌సింగ్ టికెట్ ఆశించగా.. కాంగ్రెస్ అధిష్టానం కూడా చివరి నిమిషంలో స్థానికేతరుడైన మదన్‌సింగ్ కుశ్వాహకు టికెట్ ఇచ్చింది. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ్‌సింగ్ గ్వాలియర్‌లోని మాధవ్‌రావ్ సింధియా విగ్రహం ముందు నిలబడి నిరసన వ్యక్తం చేస్తూనే.. వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రేమ్‌సింగ్ జేబులో సూసైడ్ నోట్ దొరికింది. ‘పార్టీలో కొందరు నేను బీజేపీలో చేరుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారం. 46 ఏళ్లుగా కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేశాను.
నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటాను. మాధవ్‌రావ్ సింధియాతో కలిసి 35 ఏళ్లు పనిచేశాను. కాంగ్రెస్ నాయకత్వం అహంకార పూరితంగా, చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తోంది. బహిరంగంగానే ఇందిర, రాజీవ్‌లను తిట్టిన వారికి టికెట్లు ఇవ్వడం దారుణం’ అని లేఖలో పేర్కొన్నారు.
బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అత్వార్ సింగ్ అనే సీనియర్ బీజేపీ కార్యకర్త జబల్‌పూర్ (పశ్చిమ) టికెట్‌ను ఆశించారు. తనకు పార్టీలో పోటీ ఎవరూ లేకపోవడంతో అదే ధీమాతో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం చివరి నిమిషంలో హరేంద్రజీత్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆవేదన చెందిన అత్వార్ జబల్‌పూర్‌లోని బీజేపీ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోతుండగానే.. అక్కడున్న కార్యకర్తలు అడ్డుకున్నారు.
ముస్లింలకు నిరాశేనా!
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న ముస్లింలకు ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. నవంబర్ 28న జరగనున్న ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక ముస్లిం అభ్యర్థినే బరిలో దించగా.. కాంగ్రెస్ ముగ్గురికి అవకాశం కల్పించింది. బీజేపీ తరఫున ఫాతిమా సిద్దిఖీ భోపాల్ (ఉత్తరం) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈమె మాజీ మంత్రి రసూల్ అహ్మద్ సిద్దిఖీ కూతురు. కాంగ్రెస్ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరిఫ్ అకీల్ బరిలో ఉన్నారు. బుర్హాన్‌పూర్ నుంచి హమీద్, భోపాల్ (సెంట్రల్) నుంచి ఆరిఫ్ మసూద్‌లు పోటీ చేస్తున్నారు.
‘బీజేపీ నుంచి మేం సీట్లను ఆశించడం లేదు. మా రాష్ట్రం ముస్లిం నేతలు జాతీయ రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నాం. అందుకే మేం కాంగ్రెస్‌పైనే ఆశలు పెట్టుకున్నాం. మొదట్నుంచీ మా మద్దతు కాంగ్రెస్‌కే’ అని మధ్యప్రదేశ్ ముస్లిం వికాస్ పరిషత్ కన్వీనర్ మహ్మద్ మాహిర్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో ముస్లింలు 8–9%. అయితే తమ జనాభాకు తగ్గట్టుగా ప్రజాప్రాతినిధ్యం లేదని ముస్లిం మేధావులంటున్నారు. అయితే.. కాంగ్రెస్‌లో మాత్రం గెలిచే అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేయడం ద్వారానే టికెట్ల ఎంపిక జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment