four state elections
-
ఏ పార్టీది విజయమో చెప్పేది ‘మెవధ్’
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్ దక్షణ మధ్య ప్రాంతమైన మెవర్ లేదా మెవధ్‌లో శుక్రవారం ఉదయం నుంచే పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతం విజయానికి రహదారి అని, ఏ పార్టీ విజయం సాధించి ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందో నిర్ణయించేది ఈ ప్రాంతం ఓటర్లేనన్నది రాజకీయ విశ్లేషకులు విశ్వాసం. ఇక్కడి ఓటర్లకు ఓ విచిత్రమైన ఆనవాయితీ ఉంది. 1998 నుంచి ఈ మెవధ్ ప్రాంతం ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు తప్ప, ఏనాడు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన దాఖలాలే లేవు. అందుకనే 1998 నుంచి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతూ వస్తోందని రాజకీయ పరిశీలకుల అవగాహన. మెవధ్ పరిధిలోకి రాజస్థాన్‌లోని భిల్వారా, చిత్తోర్‌గఢ్, ప్రతాప్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ఉదయ్‌పూర్ జిల్లాలు, ఝలావర్ జిల్లాలోని పిరవ తెహసిల్‌తోపాటు మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి. రాజస్థాన్‌లోని 200 సీట్లకుగాను రాజస్థాన్‌లోని మెవ«ద్ ప్రాంతంలో 28 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి ఏకంగా 25 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకోగా, మరో సీటులో స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు. అంతకుముందు ఐదేళ్ల క్రితం, అంటే 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెవద్‌లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ ప్రాంతం ఓటర్లు ఈ రోజు కూడా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడం ఆనవాయితీగా మారిందిగదా అని ఓటేస్తున్నారా లేదా నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా? అంటూ ఈ ప్రాంతం ఓటర్లను మీడియా కదిలించగా, తామేమి గుడ్డిగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రావడం లేదని, ఈసారి వ్యతిరేకించడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని వారన్నారు. ‘రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. నిరుద్యోగం బాగా పెరిగింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల వ్యాపారులే కాకుండా సామాన్య ప్రజలు కూడా బాగా నష్టపోయారు. ముఖ్యంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. విత్తనాలు, ఎరువులు, డీజిల్, కరెంట్ ధరలు బాగా పెరిగిపోయాయి’ అని వారన్నారు. ‘మా నాన్నది ఇంట్లో ఉన్నదంతా ఊడ్చి వ్యవసాయంపై పెట్టారు. కనీసం పెట్టుబడి కూడా లేదు. అందుకనే నేను పొరపాటున కూడా వ్యవసాయం జోలికి వెళ్లదల్చుకోలేదు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాను. ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏనాడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంది. నేను చదువుకోవాలనుకోవడానికి ఒక కారణం మోదీ ఇచ్చిన హామీనే. అయితే ఆయన ప్రభుత్వం ఏం చేయలేకపోయింది’ చిత్తోర్‌గఢ్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు మాన్సింగ్ తెలిపారు. ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బీజేపీ హనుమంతుడి కులం గురించి చర్చిస్తోందని బేగు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బాబూ రామ్ విమర్శించారు. ‘2013 అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీకే ఓటేశాను. ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించాను. ఏం జరిగిందీ? పాలకులు కుల గోత్రాల గురించి, జాతి, మతాల గురించి, పటేల్, రాముడి విగ్రహాలు గురించి మాట్లాడుతున్నారు. విగ్రహాలేమైనా ప్రజలకు తిండి పెడతాయా?’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓపియం పంటకు కొత్త లైసెన్సులూ కారణమే! గంజాయి (ఓపియం) పంటకు 2017లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లైసెన్స్ నిబంధనలను మార్చిందని, ఫలితంగా ఇక్కడ ఎంతో మంది రైతులు లైసెన్సులు కోల్పోయారని, అది కూడా తమ ఆగ్రహానికి కారణమని ఓటర్లు చెబుతున్నారు. దేశంలో లైసెన్స్‌లతో ఉత్పత్తవుతున్న గంజాయితో 60 శాతం మెవధ్‌లోనే పండిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న రాజ్‌పుత్‌లు కూడా ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2017లో దీపికా పదుకోన్ నటించిన ‘పద్మావత్’ సినిమాను నిషేధించాల్సిందిగా తాము దేశవ్యాప్తంగా ఆందోళన చేసినా వసుంధర రాజె ప్రభుత్వం తమకు న్యాయం చేయలేక పోయిందని, దాంతో తమ ప్రతిష్ట దెబ్బతిన్నదని ‘మెవర్ క్షత్రియ మహాసభ సంస్థాన్’ అధ్యక్షుడు తన్వీర్ సింగ్ కృష్ణావత్ తెలిపారు. మేవధ్ ప్రాంతంలోని 16 అసెంబ్లీ సీట్లలో ఆదివాసీలు 73 శాతం ఉన్నారు. వారంతా కూడా పాలకపక్షాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 11 సీట్లలో కొత్తగా ఆవిర్భవించిన ‘భారతీయ ట్రైబల్ పార్టీ’ పోటీ చేస్తోంది. ఈ అభ్యర్థుల వల్ల పాలకపక్ష ఓట్లే చీలుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
రాజస్తాన్‌లో నేడే పోలింగ్
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీలోని 200 స్థానాలకు గాను 199 సీట్లకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ.. అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్.. ఈ రెండింటిలో గెలుపెవరిదనేది నేటి ఎన్నికతో తేలిపోనుంది. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 130 సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ జరగనుంది. ఆల్వార్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి మృతితో అక్కడ ఎన్నిక ఆగిపోయింది. బీజేపీ నుంచి వసుంధరా రాజే తిరిగి అధికార పగ్గాలు చేపడతామని ధీమాతో ఉండగా కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఓటరు ఎటువైపు?!
దాదాపు రెండు నెలలుగా హోరెత్తుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. శుక్రవారం జరగబోయే పోలింగ్‌కు ఎన్నికల యంత్రాంగం సర్వ సన్నద్ధమైంది. తెలంగాణతోపాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రాష్ట్రం రాజస్తాన్ పోలింగ్ తెలంగాణతోపాటే జరగబోతోంది. ఇతర రాష్ట్రాల మాటెలా ఉన్నా తెలంగాణలో తొలిసారి జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షం అంతిమ విజేతగా నిలుస్తుందన్న అంశంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల సంఘం నవంబర్ 11న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసినా అంతకు నెల రోజుల ముందే టీఆర్ఎస్ తన అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను చావో రేవో అన్నట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు రాష్ట్రా నికొచ్చి సభలూ, సమావేశాల్లో మాట్లాడారు. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మొదలుకొని కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నాయ కులు వివిధ జిల్లాల్లో జరిగిన సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ముఖ్య మంత్రి కె. చంద్రశేఖరరావు అన్నీ తానే అయి దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహానికి పదునుపెడుతూ పార్టీ శ్రేణులను ఉరికించారు. పార్టీ కీలక నేతలు తారకరామారావు, హరీశ్‌రావులు సైతం పలు నియోజక వర్గాల బాధ్యతలను తీసుకుని ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని సంకల్పించుకున్న కాంగ్రెస్...అందుకోసం తన చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పొత్తుకు సైతం సిద్ధపడి సీపీఐని, తెలంగాణ జన సమితి(టీజేఎస్) లను కూడా కలుపుకొని ప్రజా కూటమి పేరుతో ఎన్నికల బరిలో నిల్చుంది. ఏం చేసైనా అధికారం అందుకుని తీరాలని తహతహలాడిన కాంగ్రెస్ పార్టీ అందుకు తగినట్టుగా సకాలంలో అభ్యర్థుల్ని మాత్రం ఖరారు చేసుకోలేకపోయింది. తమ పార్టీలోనూ, కూటమిలోనూ కూడా చివరి నిమిషం వరకూ గందరగోళాన్ని మిగిల్చింది. మిత్రపక్షాలకు కేటాయించిన కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులకు బీ ఫారాలిచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీ అయిన నవంబర్ 22కు కూడా తేల్చ కపోవడంతో నాలుగైదుచోట్ల కూటమిలోని పక్షాలే పరస్పరం తలపడే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో నాలుగున్నరేళ్లుగా వివిధ అంశాలపై ఒంటరిగా పోరాడుతున్న కాంగ్రెస్ చివరి నిమి షంలో స్వీయ సామర్థ్యంపై నమ్మకం లేకనో, మీడియాలో కథనాలొస్తున్నట్టు భారీగా డబ్బు సమ కూరుస్తానన్న చంద్రబాబు ప్రలోభానికి లొంగిపోవడం వల్లనో... పొత్తుకు సిద్ధపడి రాజకీయంగా తప్పు చేసిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఆత్మ విశ్వాసంతో పనిచేసిందో ఎవరూ మరిచిపోరు. 2004లో కేవలం అధిష్టానం ఒత్తిడి వల్ల ఆయన టీఆర్ఎస్తో పొత్తుకు అంగీకరించారు. 2009లో ఒంటరిగా పోటీకి దిగినా విజయం ఖాయమని అధిష్టానానికి నచ్చజెప్పి ఒప్పించి దాన్ని నిజం చేసి చూపారు. కానీ రాహుల్‌గాంధీ మొదలుకొని స్థానిక నాయకత్వం వరకూ కాంగ్రెస్‌లో ఎవరూ ఇప్పుడు ఆ స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించలేక ‘పూలమ్మినచోటే కట్టెలమ్మిన’ తరహాలో చంద్రబాబు ప్రతిపాదించిందే తడవుగా దాన్ని శిరసావ హించారు. పోనీ సిద్ధపడితే పడ్డారు...కాంగ్రెస్ సగర్వంగా చెప్పుకోవడానికి అవకాశమున్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాలను తమ సమక్షంలోనే చంద్రబాబు సొంత ఖాతాలో వేసుకుంటుంటే అచేతనులుగా గుడ్లప్పగించి చూశారు. ఐటీ అంకురార్పణ, శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు వంటివన్నీ ఆయన తన ఘనతగా చెప్పుకుంటుంటే ‘కాద’ని చెప్పడానికి వారికి నోరు పెగల్లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రతిష్ట మిగిలిందంటే అది వైఎస్ పుణ్యమే. కానీ ఆయన్ను స్మరించుకోలేని దుస్థితికి కాంగ్రెస్ నాయకులు దిగజారారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలొచ్చినా అది తనవల్లే సాధ్యమైందని ముందూ మునుపూ దబాయించడా నికి చంద్రబాబుకు చేజేతులా అవకాశమిచ్చారు. నిజానికి తెలంగాణలో తెలుగుదేశం ప్రాభవం ముగిసి చాన్నాళ్లయింది. ఆ పార్టీలో పలుకుబడి ఉన్న నేతలు, కార్యకర్తల్లో అత్యధికులు టీఆర్ఎస్కు వలసపోయారు. ఇప్పుడున్నది నామ మాత్రావశిష్టమైన టీడీపీ మాత్రమే. చంద్రబాబు తన బ్రాండ్ మకిలిని కూటమిలోని ఇతర పక్షాలకు కూడా అంటించారు. మరి 48 గంటల్లో పోలింగ్ జరగబోతున్నదనగా తెలంగాణలోని వివిధ జిల్లాలు మొదలుకొని రాజధానిలోని కూకట్పల్లి వరకూ పట్టుబడుతున్న కరెన్సీ మూటలు, బంగారం నిల్వలు తెలంగాణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఇందులో కరెన్సీ విలువ రూ. 129 కోట్లుకాగా, బంగారం విలువ రూ. 8 కోట్లని వార్తలొస్తున్నాయి. ఇవిగాక లక్షలాది రూపాయల మద్యం ఏరులై పారుతోంది. పట్టుబడిన డబ్బు, బంగారం నిల్వల్లో అధిక భాగం కూటమి అభ్యర్థులదే కావడం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ నుంచే తరలి వచ్చిందని కథనాలు రావడం తెలంగాణ ప్రజల్ని మాత్రమే కాదు...అక్కడివారిని సైతం కలవరపరుస్తాయి. ఇంతవరకూ రూ. 129 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నామని బుధ వారం రాత్రి పోలీసులు చేసిన ప్రకటన వెల్లడించిందంటే నాయకులు ఎంతకు దిగజారారో అర్ధమ వుతుంది. తెలంగాణ ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్నవారు. వివేకమూ, విజ్ఞతా గల వారు. ధన, కనక, మద్య ప్రవాహాలతో ఏమార్చాలని చూసిన పార్టీలకూ, నేతలకూ తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్పగలరని గత చరిత్ర చెబుతోంది. ఈ నెల 11న వెలువడే ఫలితాల్లో మరో సారి అదే ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తుందని ఆశిద్దాం. -
పదిసార్లు ‘భారత్ మాతాకీ జై’ అంటా
జైపూర్/హనుమాన్‌గఢ్: ‘భారత్ మాతాకీ జై’ అనొద్దంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను ఆదేశిస్తున్నారనీ, ఇక నుంచి ప్రతిచోటా 10 సార్లు తాను ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నినాదాన్ని పలకొద్దని చెప్పడం ద్వారా రాహుల్ భరత మాతను అవమానించారని మోదీ ఆరోపించారు. రాజస్తాన్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ.. ‘ఎన్నికల ర్యాలీలో భారత్ మాతాకీ జై అని మోదీ అంటున్నారు. కానీ ఆయన దేశం కోసం కాకుండా కొద్దిమంది పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారు. ఇక నుంచి ఆయన అనిల్ అంబానీకీ జై, నీరవ్ మోదీకీ జై, మెహుల్ చోక్సీకీ జై, లలిత్ మోదీకీ జై అని నినాదాలివ్వాలి’ అని అన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ ‘కాంగ్రెస్‌కు ఓ రాజవంశీకుడు ఉన్నాడు. భారత్ మాతాకీ జై అని మోదీ అనకూడదంటూ ఆ రాజవంశీకుడు ఈ రోజు ఆదేశించాడు. ఆ ఆదేశాన్ని నేను ధిక్కరిస్తూ ఇక నుంచి లక్షల మంది సాక్షిగా ప్రతిచోటా నేను పదిసార్లు భారత్ మాతాకీ జై అని నినదిస్తాను’ అని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు భారత్ మాతాకీ జై అని అరుస్తూ వీరమరణం పొందారనీ, కానీ రాహుల్ భరత మాతను అవమానిస్తున్నారని మోదీ ఆరోపించారు. అత్యాచారం కేసుల్లో దోషులుగా ఉన్న వారి కుటుంబీకులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందనీ, మహిళలెవరూ ఆ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన కోరారు. ఎర్ర, పచ్చి మిరపకు తేడా తెలీదు.. రాహుల్‌కు ఎర్ర మిరపకాయలు, పచ్చి మిరపకాయలకు మధ్య తేడా కూడా తెలీదని మోదీ ఎద్దేవా చేశారు. ‘పచ్చి మిరప కన్నా ఎర్ర మిరపకు ధర ఎక్కువ ఉంటుందని మీరు చెబితే.. అయితే రైతులంతా ఎర్ర మిరపనే సాగు చేయాలని ఆయన అంటాడు. ‘ఈ దేశానికి తొలి ప్రధాన మంత్రి ఒక రైతు బిడ్డ అయ్యుంటే, సర్దార్ పటేల్ తొలి ప్రధాని అయ్యుంటే ఇప్పుడు రైతులకు ఇన్ని సమస్యలు ఉండేవే కావని నేను గట్టిగా చెప్పగలను. ఒక్క కుటుంబంలోని నాలుగు తరాల వారు 70 సంవత్సరాలు చేసిన పాపాల ఫలితం ఇది. వారి తప్పులను నేను సరిచేస్తున్నాను. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి, దూరదృష్టి, సిక్కుల మనోభావాలపై గౌరవం ఉండి ఉంటే నేడు కర్తార్‌పూర్ గురుద్వారా పాకిస్తాన్ అధీనంలోకి వెళ్లేది కానేకాదు. భారత్‌లోనే ఉండేది. ఇన్నాళ్లూ భారతీయ సిక్కులు గురుద్వారాను సందర్శించేందుకు ఎన్నో తిప్పలు పడేవారు. ఆ తప్పును ఇప్పుడు మేం సరిచేస్తున్నాం’ అని మోదీ చెప్పారు. -
124 స్థానాల్లో కొత్త ముఖాలు
భారత్‌లో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సిట్టింగ్‌లకు లేదంటే గత ఎన్నికల్లో ఓడిన వారికే పార్టీలు టికెట్లు ఇస్తుంటాయి. సిట్టింగ్‌ల విషయంలోనైతే రిస్క్ తీసుకోకుండా కొనసాగిస్తాయి. కొత్తవారికి తీసుకుని మళ్లీ మొదట్నుంచీ ప్రారంభించడం ఎందుకని ఆలోచిస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంటే తప్ప అభ్యర్థిని మార్చరు. కానీ రాజస్తాన్‌లో మాత్రం సీన్ పూర్తి భిన్నంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి సిట్టింగ్‌లను ఏకపక్షంగా విశ్రాంతినిచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మొత్తం 200 నియోజకవర్గాల్లో.. కేవలం 33 చోట్ల మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 29 సీట్లలో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తోంటే, 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బరిలో ఉన్నారు. వీరిలో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఒకరు. బీజేపీ అభ్యర్ధులకు పోటీగా గత ఎన్నికల్లో వారి చేతిలో ఓడిపోయిన వారినే కాంగ్రెస్ మళ్లీ నిలబెట్టడం విశేషం. రెండు పార్టీలు 43 నియోజకవర్గాల్లో గత ఎన్నికల అభ్యర్ధులను మార్చాయి, 124 చోట్ల కొత్త ముఖాలకు అవకాశం కల్పించాయి. -
సమస్యలకు కొరతే లేని చోట ఆ మాజీ సీఎం మళ్లీ గెలుస్తారా?
రాజస్తాన్ సర్దార్‌పుర నియోజకవర్గ పరిశీలన అదే నియోజకవర్గం, అవే సమస్యలు, అభ్యర్థులూ పాత వాళ్లే.. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారైనా ఫలితాలు కొత్తగా వస్తాయా? ఇది రాజస్తాన్‌లోని సర్దార్‌పుర నియోజకవర్గం గురించి. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నాలుగు సార్లు సర్దార్‌పుర నుంచే ఎన్నికయ్యారు. రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013 ఎన్నికల్లో గెహ్లాట్‌పై పోటీ చేసి ఓడిపోయిన శంభు సింగ్ ఖేతాసర్కే బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో గెహ్లాట్‌పై ఖేతాసర్ 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ వేవ్‌లో కూడా తట్టుకొని నిలబడ్డ అతి కొద్ది మంది కాంగ్రెస్ నాయకుల్లో గెహ్లాట్ ఒకరు. ఈ సారి కూడా తనదే గెలుపన్న ధీమాలో ఉన్నారు. కుల సమీకరణలే కీలకం సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి గెహ్లాట్ ఇప్పటివరకు 4సార్లు గెలిచారు. అన్నిసార్లు ఆయనను కులసమీకరణలే గెలిపించాయి. సర్దార్‌పురలో మెజార్టీ ఓటర్లు మాలీలు. ఆ తర్వాత స్థానాల్లో ముస్లింలు, రాజ్పుత్లున్నారు. ఇక జాట్లు, ఇతర వెనుకబడిన కులాల ప్రాబల్యం కూడా ఎక్కువే. 40 వేల వరకు ఉన్న మాలీలు, 30 వేల ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని శాసించగలరు. గెహ్లాట్ మాలీ సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో వారి అండతోనే ఆయన నెగ్గుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో గెహ్లాట్‌కి వ్యక్తిగత కరిజ్మా కూడా ఎక్కువే. అందుకే ఆయన్ని ఓడించడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేసి బీజేపీ భంగపడింది. ఖేతాసర్ పోటీ ఇవ్వగలరా? 2013 ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ కనీవినీ మెజార్టీ సాధించింది. అప్పటికే ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో ఆయన హవా బాగా కనిపించింది. అంతటి మోదీ వేవ్‌లో నెగ్గలేకపోయిన శంభు సింగ్ ఖేతాసర్ ఈసారి గెహ్లాట్‌కు పోటీ ఇవ్వగలరా అన్నదే ప్రశ్న. అందులోనూ ఖేతాసర్కు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లూ ఓడిపోయారు. 2008లో ఓషియన్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంతో సంతృప్తి చెందారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్‌పై పాలీ నియోజకవర్గం నుంచి ఘోరంగా ఓటమిపాలయ్యారు. అశోక్ గెహ్లాట్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందిన ఖేతాసర్ ఈ సారి ఓషియన్ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ బీజేపీ అధిష్టానం మళ్లీ గెహ్లాట్‌పైనే పోటీకి దింపింది. ఎవరినో ఒకరిని పోటీకి నిలిపాలన్న ఉద్దేశంతో ఖేతాసర్కు టిక్కెట్ ఇచ్చి రాజే చేతులు దులుపుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సర్దార్‌పుర నియోజకవర్గంలో మాలీ, ముస్లింల తర్వాత రాజ్‌పుత్‌లు కూడా గణనీయంగానే ఉన్నారు. వారంతా బీజేపీపై ఆగ్రహంతో ఉండడంతో రాజ్‌పుత్ అయిన శంభు సింగ్‌కు వారి మద్దతు కూడా లభించే అవకాశం లేదు. ఇలా అన్నివైపుల నుంచి ఖేతాసర్ ఏ మాత్రం బలమైన అభ్యర్థి కాలేరన్న అంచనాలున్నాయి. అయితే ఈ సారి గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు శంభు సింగ్ ఖేతాసర్. ‘గత ఎన్నికల్లో గెహ్లాట్ గెలిచారంటే అధికారం వాళ్ల చేతుల్లో ఉంది. ఒక సీఎంను ఓడించడం అంత సులభం కాదు. అందుకే ఆయన నెగ్గారు. ఈసారి అలాకాదు. గెహ్లాట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అంతే. అందుకే ఈ సారి గెలుపు నాదే’ అని ధీమాగా చెబుతున్నారు. అయినా వసుంధరే టార్గెట్.. జోధ్‌పూర్ నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్దార్‌పుర ఒకటి. ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొరతే లేదు. మౌలిక సదుపాయాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎక్కడా సరైన రోడ్లుండవు. పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాగునీటి సరఫరా అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో పైపు లైన్లే గల్లంతయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో మురుగునీటి పైపులు పగిలిపోయి.. తాగునీటి పైపుల్లో కలిసిపోయాయి. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలకు కలుషిత నీరే దిక్కుగా మారింది. ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు.. గెహ్లాట్ చొరవతీసుకున్న సందర్భమే లేదు. సర్దార్‌పుర సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో సమస్యలపై గెహ్లాట్ సీఎం వసుంధరా రాజేనే టార్గెట్ చేశారు. జోధ్‌పూర్ నగరంలో ఉన్న సర్దార్‌పుర అభివృద్ధి చేయడంలో రాజే నిర్లక్ష్యం వహించారంటూ ఎన్నికల ప్రచారంలో గెహ్లాట్ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నా సొంత నియోజకవర్గం కాబట్టే.. రాజే జోధ్‌పూర్‌ను నిర్లక్ష్యం చేశారు. నియోజకవర్గంలో సమస్యలు ∙సరైన రహదారులు లేవు ∙నాసిరకమైన పారిశుద్ధ్య వ్యవస్థ ∙నీటి సరఫరా లోటుపాట్లు ∙మౌలిక సదుపాయాలు కరువు మొత్తం ఓటర్లు 2.10 లక్షలు మాలీలు 40 వేలు ముస్లింలు 30 వేలు రాజ్ పుత్‌లు 25 వేలు ఎస్సీ, ఎస్టీ 35 వేలు -
మాకూ ఉన్నారు
ఎన్నికల్లో గెలుపునకు ప్రచార తంత్రమే కీలకం. దానికి ఆకర్షణ మంత్రమూ తోడవ్వాలి. అలా కావాలంటే స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాలి. ప్రధాన పార్టీలన్నిటికీ ఎలాగూ ‘ప్రచార తారలు’ ఉన్నారు. టీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ‘స్పెషల్’ అయితే, కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్‌గాంధీతో పాటు సినీ తారలూ ప్రత్యేకాకర్షణ.. బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. ఇప్పుడు ఆయా ప్రధాన పార్టీలకు దీటుగా.. ఎన్నికల బరిలో ఉన్న చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు సైతం.. తమ పార్టీల జాతీయ స్థాయి నేతలను ప్రచారానికి దించుతున్నారు. కొద్ది రోజుల్లో వారంతా హైదరాబాద్‌లో, తెలంగాణ జిల్లాల్లో ప్రచారం హోరెత్తించనున్నారు. పోటీకి కావాలో పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహా పలు జాతీయ పార్టీలు ఈ దఫా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. ఇవికాక ఉత్తర భారతం కేంద్రంగా గల పలు పార్టీలూ తెలంగాణలో రెండు, మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన దాఖలాలు ఒకటి రెండు ఉన్నాయి. గతంలో వివిధ పార్టీల నాయకులు టికెట్ దక్కకపోతే.. రెబల్ లేదా స్వతంత్రంగా పోటీచేసేవారు. కానీ, 2004 నుంచి పరిస్థితి మారింది. వీలుంటే ఏదో జాతీయ లేదా చిన్న పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉత్తర భారతానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్ (యునైటెడ్) బరిలో నిలిచాయి. టికెట్ రాక భంగపడ్డ నేతలంతా ఈ పార్టీల నుంచి పోటీకి దిగారు. వీరంతా ఆయా పార్టీల ప్రముఖులను ప్రచారానికి రప్పించి.. తమ ప్రభావాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. అధినేతలు దిగివచ్చే వేళ.. గతంలో తెలంగాణపై బీఎస్పీ మినహా మిగిలిన పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో మాయావతి నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసారి అన్ని పార్టీల అధినేతలు తెలంగాణపై నజర్ పెట్టారు. త్వరలోనే వీరంతా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బీఎస్పీ నుంచి మాయావతితో కలిపి 40 మంది, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తోపాటు 11 మంది జాతీయ నాయకులు, జనతాదల్ (యునైటెడ్) కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్, కేసీ త్యాగితో పాటు 20 మంది అగ్రనేతలు, ఆప్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో ఐదుగురు ఢిల్లీ మంత్రులు ప్రచారం చేయనున్నారు. ఇక సీపీఎం ప్రచారానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రానున్నారు. బృందాకారత్ ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడే ఎందుకు? మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో మరాఠీ, కన్నడ, హిందీ మాట్లాడేవారు అధికం. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై మరాఠా ప్రభావం ఉంది. అందుకే, బోధన్ నుంచి గోపీకిషన్, నిజామాబాద్ అర్బన్ నుంచి సూర్యనారాయణుగుప్తా శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. వారి నామినేషన్‌కు మహారాష్ట్ర నుంచి శివసేన నేతలు వచ్చారు. బెల్లంపల్లి నుంచి వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప గెలిచి సంచలనం సృష్టించారు. కాగా, సింగరేణి బొగ్గు గనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సీపీఎంకూ మంచిపట్టే ఉంది. ఈ ప్రాంతాల్లో మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీతారాం ఏచూరి, బృందా కారత్ తదితర ప్రముఖులు నగరంలో, తెలంగాణ జిల్లాలలో పర్యటించనున్నారు. హోరెత్తనున్న పబ్లి‘సిటీ’.. నగరంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉత్తరాది ప్రజలు స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ నుంచి కొందరు పోటీ చేస్తున్నారు. నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసింది. కొన్ని ఓట్లు సాధించడం ద్వారా కాస్త గుర్తింపు పొందగలిగింది. విద్యావంతులు ఎక్కువుండే కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, ఉప్పల్, మలక్‌పేట, ఎల్బీనగర్ స్థానాల్లో ఈసారి ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. కేజ్రీవాల్, నితీశ్‌కుమార్ కాస్త ఆలస్యంగా ప్రచారానికి రావొచ్చని సమాచారం. - అనిల్‌కుమార్ భాషబోయిన -
మందసౌర్ మొనగాడెవరో?
మందసౌర్ నియోజకవర్గానికి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రాముఖ్యం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముగ్గురు(సుందర్‌లాల్ పట్వా, వీకే సక్లేచ, కైలాస్‌నాధ్ కట్జూ) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 1957లో జరిగిన తొలి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జన్‌సంఘ్ అభ్యర్ధి సుందర్‌లాల్ గెలుపొందారు. తర్వాత కాలంలో కాంగ్రెస్ అడపాదడపా విజయం సాధించినా ఎక్కువగా జన్‌సంఘ్, బీజేపీకి ఈ నియోజకవర్గం అనుకూలంగా ఉంది. 2003 అనంతరం ఈ నియోజకవర్గం పూర్తిగా బీజేపీ పట్టులోకి వెళ్లింది. గత మూడు దఫాలు బీజేపీ అభ్యర్ధి ఇక్కడ గెలుపొందాడు. ఈ దఫా మారిన పరిస్థితులను అనుకూలంగా మలచుకొని గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2013లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. 2008లో బీజేపీ అభ్యర్ధి యశ్పాల్ దాదాపు 18,000 ఓట్ల మెజార్టీతో సమీప కాంగ్రెస్ అభ్యర్ధి మహేంద్ర సింగ్ గుర్జార్‌పై గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎనిమిదిమంది పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి యశ్పాల్ సింగ్ సిసోడియా, కాంగ్రెస్‌నుంచి నరేంద్ర నహతా, బీఎస్పీ నుంచి ఈశ్వర్ మక్వానా పోటీ పడుతుండగా, ఛెన్సింగ్ నాంద్వెల్(ఆమ్ఆద్మీ పార్టీ), సునీల్ బన్సాల్(సపాక్స్), అనీల్సోనీ, అబ్దుల్ హబీబ్, సురేశ్పండిట్(ఇండిపెండెంట్లు) కూడా పోటీలో ఉన్నారు. ఓపియం సాగు.. ప్రపంచంలో ఔషధ అవసరాల కోసం ఓపియం పండించే దేశాల్లో భారత్ మొదటి స్ధానంలో ఉంది. భారత్‌లో మాళ్వా ప్రాంతంలోనే ఓపియం సాగు ఎక్కువగా చేస్తారు. ప్రభుత్వ ఓపియం పాలసీ కింద లైసెన్సులు పొందిన రైతులు మందసౌర్ తదితర జిల్లాలో ఓపియంను పండిస్తారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆధ్వర్యంలో ఈ లైసెన్సుల జారీ, పంట సాగు పర్యవేక్షణ జరుగుతుంది. అక్టోబర్ నుంచి సాగు ఆరంభమవుతుంది. మార్చి కల్లా పంట చేతికొస్తుంది. మంచి లాభాలు తెచ్చే పంట కావడంతో లైసెన్సుల కోసం గొడవలు జరుగుతుంటాయి. ఈ గొడవలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ప్రభుత్వానికి శరాఘాతంగా మారనున్నాయి. మండోదరి పుట్టినూరు.. పురాణాల్లో మందసౌర్ను దశపుర అనేవారు. రామాయణం ప్రకారం ఈ ప్రాంతం రావణ పత్ని మండోదరి జన్మస్థలం. అందుకే ఇక్కడ రావణబ్రహ్మ ఆరాధన కనిపిస్తుంది. రావణుడిని తమ అల్లుడిగా వీరు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతీయులు దసరా రోజున రావణ దహనం జరుపుకోరు. నగరంలోని ఖాన్‌పురా ప్రాంతంలో 35 అడుగుల ఎత్తైన దశకంఠుడి విగ్రహం ఉంది. ప్రస్తుత నగరానికి పూర్వం ఇక్కడ మర్, సౌర్ అనే రెండు గ్రామాలుండేవని, ఇవి రెండూ కలిసి మందసౌర్ ఏర్పడిందని మరో కథనం. భౌగోళికంగా ఈ ప్రాంతం మాల్వా, మేవార్ సరిహద్దులో ఉంది. అందుకే మాళ్వా పాలకుడు హుషాంగ్ షా ఘోరీ మందసౌర్‌లో బ్రహ్మాండమైన కోటను కట్టించాడు. బ్రిటీష్ పాలనలో ఈ ప్రాంతం గ్వాలియర్ రాజ్యం కింద ఉండేది. పశుపతినాధ ఆలయం, యశోధర్ముడి సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధం. ప్రధాని వస్తే అంతే... మధ్యప్రదేశ్‌లో బీజేపీ కంచుకోటల్లో ఒకటైన మందసౌర్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పుకారు షికారు చేస్తుంది. ఏదైనా పార్టీ తరఫున ప్రచారానికి ప్రధాని వస్తే అంతే సంగతులని, నియోజకవర్గంలో విపక్షం గెలుస్తుందని చాలామంది నమ్ముతారు. 1989లో రాజీవ్ ప్రచారానికి వచ్చాక ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించాడు. 1998లో బీజేపీ అభ్యర్ధి తరఫున వాజ్పాయ్ ప్రచారానికి వచ్చారు. ఇంకేముంది.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి విజయభేరి మోగించాడు. దీంతో ప్రజల్లో ఈ నమ్మకం బాగా బలపడింది. 2013లో అప్పటికి ఇంకా ప్రధాని కాని నరేంద్రమోదీ బీజేపీ తరఫున ప్రచారానికి వచ్చారు. కానీ ఈ సారి అదే మోదీ ప్రధాని హోదాలో ఈ నెల 24న మందసౌర్ వస్తున్నారు. దీంతో పాత సెంటిమెంట్ తలచుకుని కార్యకర్తలు భయపడుతున్నారు. ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు రైతుల ఆందోళన గతేడాది జూన్‌లో గిట్టుబాటు ధరలు కోరుతూ ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన హింసాత్మకంగా మారడం, పోలీసు కాల్పులు జరగడం, ఆరుగురు ఆందోళనకారులు మరణించడం జరిగాయి. దీంతో ఆందోళనలు మరింత ముదిరి సరిహద్దు జిల్లాలకు కూడా పాకాయి. దీంతో ఈ ప్రాంతంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రబలింది. బీజేపీ రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. బీబీవై పేరిట రైతు సంక్షేమానికి కొత్త పథకం ప్రకటించింది. కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఈ ఆందోళన వెనుక ఓపియం మాఫియా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెల్లుల్లి ధర ఓపియంతో పాటు ఈ ప్రాంతంలో వెల్లుల్లి సాగు కూడా ఎక్కువ. అయితే 2017 మార్చి నుంచి మందసౌర్ మార్కెట్లో వెల్లుల్లి ధర దారుణంగా పడిపోయింది. 2016లో రూ.10వేలకు క్వింటాల్ కొనుగోలు జరిగింది. అలాంటిది ఇప్పుడు రూపాయి, రెండ్రూపాయలకు వెల్లుల్లిని అమ్ముకోవడంపై ఈ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికపై అత్యాచారం ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇరువురు అత్యాచారం చేసి చంపేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ప్రభుత్వం ఈ కేసులో వేగంగా స్పందించి ఇరువురు నిందితులను అరెస్టు చేసింది. మతాలు, కులాల ఈక్వేషన్లు మందసౌర్‌లో మతాల వారీగా హిందువులు, ముస్లింలు, జైనులు ఎక్కువగా ఉన్నారు. కులాల పరంగా సింధియా రాజ్పుట్స్, పటీదార్లు, చమార్లు ఎక్కువగా కనిపిస్తారు. హిందు ఓట్లు సమీకృతం చేయడంలో ఇంతవరకు బీజేపీ సఫలమవుతూ వస్తోంది. ఈ దఫా బీజేపీని ఎదుర్కొనేందుకు ముస్లిం–జైన్ ఫార్ములా అవలంబించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా జైన్ కులస్తుడికి టికెట్ ఇచ్చింది. మరోవైపు రైతు ఆందోళనలో మరణించినవారంతా పటేల్ కులానికి చెందిన వారే. ఎస్సీ ఎస్టీ చట్ట సవరణ సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథాతధంగా కొనసాగించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌పై నియోజకవర్గంలోని ఓబీసీ, ఓసీ ఓటర్లు మండిపడుతున్నారు. తమ తమ ఊర్లలో ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ బ్యానెర్లు ప్రదర్శిస్తున్నారు. తమ ఆందోళను వ్యక్త పరిచేందుకు రాజ్‌పుత్‌లు, పటీదార్లు సపాక్స్ పార్టీ పేరతో పోటీ చేస్తున్నారు. -
తొలిదశలో 60.5% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేం దుకు మావోయిస్టులు చేసిన చర్యలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. మొత్తం 90 స్థానాలకుగాను సోమవారం 18 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. 60.5 శాతం పోలింగ్ నమోదైందని ఛత్తీస్‌గఢ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుబ్రత్ సాహూ రాయ్‌పూర్‌లో చెప్పారు. తుది నివేదికలు అందాక పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశముంది. ఢిల్లీలో ఎన్నికల అధికారులు మాట్లాడుతూ 60–70 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2013 ఎన్నికల్లో 75.06 శాతం పోలింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు, మిగిలిన 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు ప్రజలకు అవకాశమిచ్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే దంతెవాడలో 49%, బస్తర్‌లో 58 శాతం, కొండగావ్‌లో 61.47 శాతం, ఖైరాగఢ్‌లో 70.14%, డోంగర్‌గఢ్‌లో 71 శాతం, డోంగర్‌గావ్‌లో 71 శాతం, ఖుజ్జీలో 72 శాతం పోలింగ్ నమోదైంది. మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, వచ్చే నెల 11న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల రోజూ ఎన్కౌంటర్లు చర్ల: ఎన్నికల రోజున కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమవ్వగా మరో ఇద్దరు పట్టుబడ్డారని అధికారులు చెప్పారు. బస్తర్ జిల్లాలో మారుమూలన ఉన్న ఓ పోలింగ్ బూత్‌ను ముట్టడించేందుకు పది మందికి పైగా నక్సల్స్ యత్నించారనీ, మూడు గంటలకు పైగా వారితో పోరాడి ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని భద్రతా దళాలు చెప్పారు. అటు బీజాపూర్ జిల్లాలో పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తంగా ఐదుగురు కోబ్రా సిబ్బంది గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని కాటేకళ్యాణ్లో నక్సలైట్లు మందుపాతర పేల్చినప్పటికీ ఎవ్వరికీ హాని జరగలేదని అధికారులు చెప్పారు. సుక్మా జిల్లాలో చెట్టు కిందే పోలింగ్ బూత్ -
స్టాంపు పేపర్‌పై మేనిఫెస్టో
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పార్టీ అధినేత అజిత్ జోగీ ఎన్నికల మేనిఫెస్టోను వినూత్నరీతిలో తెచ్చారు. రూ.100 స్టాంపు పేపర్‌పై పార్టీ హామీలను ముద్రించారు. ఇది తన ప్రమాణ పత్రమనీ, గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాననీ, ఓడితే జైలుకైనా వెళ్తానని జోగీ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదనీ, ఆ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలన్నారు. బాండు పేపర్‌పై మొత్తం 14 హామీలను జోగీ ముద్రించారు. రాష్ట్రంలో జన్మించే ప్రతీ ఆడబిడ్డ పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం, ఇళ్లు, స్థలాల అసలైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం, జీఎస్టీతోపాటు ఇంధనంపై పన్నులనూ సగానికి తగ్గించడం, ఒక్కొక్కరికి రూ.7 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా, రిజర్వేషన్లను ప్రభుత్వ రంగంలో వంద శాతానికి, ప్రయివేటు రంగంలో 90 శాతానికి పెంపు తదితర హామీలు వాటిలో ఉన్నాయి. -
టీడీపీతో పొత్తు కమలనాథుల్లో గుబులు
సాక్షిప్రతినిధి, వరంగల్ : నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పడుతున్న తాపత్రయం... జిల్లాలోని కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు లేని టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, మోడీ హవాతో కమలానికి వస్తున్న అనుకూలత కాస్త.. తెలంగాణపై అస్పష్ట వైఖరితో ఉన్న టీడీపీతో కలవడం వల్ల పోతుందనే ఉద్దేశంతో బీజేపీ జిల్లా నాయకత్వం పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు.. టీడీపీతో పొత్తుతో దశాబ్ద కాలం క్రితం కోలుకోలేనంతగా దెబ్బతిన్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారుు. తమ బలంతో అధికారపీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు కృతజ్ఞత లేకుండా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో టీడీపీతో దోస్తీ వల్ల ఎటుచూసినా నష్టమే ఎక్కువని... తెలంగాణ కోసం చేసిన పోరాటంతో వచ్చిన మంచి పేరు అంతా పోతుందని వాపోతున్నారుు. టీడీపీతో జత కట్టే విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోకముందే తమ వాదనను వినిపించాలని అనుకుంటున్నారుు. తామే జీవం పోయూలా... తెలంగాణకు సంబంధించి బీజేపీ బలంగా ఉన్న జిల్లాలో వరంగల్ ఒకటి. జిల్లా నుంచి పార్టీలో ముఖ్య నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో టీడీపీ ప్రభావం తగ్గింది. నరేంద్రమోడీ హైదరాబాద్‌లో నిర్వహించిన నవభారత యువభేరి సభ నుంచే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సభలో ఎన్టీఆర్‌ను మోడీ ఆకాశానికెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందే మిత్రులను పెంచుకోవాలని మోడీ భావించడం వల్ల స్నేహహస్తం అందించారన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచే తెలంగాణ ప్రాంత నాయకులు పొత్తు వల్ల వచ్చే లాభనష్టాల గురించి అంచనా వేయడం ప్రారంభించారు. ఏ రకంగా చూసినా పొత్తు కమలానికి మేలు చేయదని, రోజురోజుకూ విశ్వసనీయతను కోల్పోతున్న టీడీపీకి తామే కొత్తగా జీవం పోసినట్లవుతుందని బీజేపీకి చెందిన జిల్లా ముఖ్య నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ బాగా దెబ్బ తిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ అస్పష్ట వైఖరితో ఉన్న టీడీపీతో ఎన్నికలకు వెళ్తే... ఓటర్లు తమను దెబ్బతీస్తారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం టీడీపీ, బీజేపీ బలాల్లో పెద్దగా తేడా లేదని కమలనాథులు ధీమాతో ఉన్నారు. బీజేపీని గతంలో దెబ్బతీసిన పొత్తు దశాబ్ద కాలం క్రితం వరకు బీజేపీ జిల్లాలో బలం ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచే వారు. జిల్లావ్యాప్తంగా నిబద్ధత గల కేడర్ ఉండేది. టీడీపీతో పొత్తు కారణంగా 1999 నుంచి క్రమంగా కమలం వాడిపోతూ వచ్చింది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కువగా ఉన్నా... శ్రేణులను ఏకతాటిపై నడపలేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అభ్యర్థిత్వం ఖరారవడంతో బీజేపీకి ఊపు వచ్చింది. ఇతర పార్టీలకు చెందిన పలువురు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు అంశం తెరపైకి రావడం కమలనాథులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
అంతర్గత పోరు వల్లే ఓటమి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీ, వర్సెస్ నరేంద్ర మోడీ మధ్య పోటీ అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ రాష్ట్రాల్లో తమ పార్టీ కమిటీలు, ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వంలో నెలకొన్న తీవ్ర సమస్యలే ఓటమికి దారితీశాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ అన్నారు. కేంద్రంలోని కొందరు మంత్రుల వ్యాఖ్యల వల్ల తమ పథకాల ఘనత యూపీఏ, కాంగ్రెస్‌లకు కాకుండా వారికే దక్కిందని విమర్శించారు. తమ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు రాహుల్, మోడీల మధ్య పోటీ అన్న వ్యాఖ్యానాలపై స్పందిస్తూ.. ఎన్నికలు జరిగేది వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య అన్నారు. రాజస్థాన్‌లోని తమ ప్రభుత్వం, పార్టీ నాలుగున్నరేళ్లుగా ఏకతాటిపై నడవలేదని, మధ్యప్రదేశ్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదన్నారు.