రాజస్తాన్ సర్దార్‌పుర నియోజకవర్గ పరిశీలన
అదే నియోజకవర్గం, అవే సమస్యలు, అభ్యర్థులూ పాత వాళ్లే.. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారైనా ఫలితాలు కొత్తగా వస్తాయా? ఇది రాజస్తాన్‌లోని సర్దార్‌పుర నియోజకవర్గం గురించి. ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నాలుగు సార్లు సర్దార్‌పుర నుంచే ఎన్నికయ్యారు. రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013 ఎన్నికల్లో గెహ్లాట్‌పై పోటీ చేసి ఓడిపోయిన శంభు సింగ్ ఖేతాసర్‌కే బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. గత ఎన్నికల్లో గెహ్లాట్‌పై ఖేతాసర్ 18 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ వేవ్‌లో కూడా తట్టుకొని నిలబడ్డ అతి కొద్ది మంది కాంగ్రెస్ నాయకుల్లో గెహ్లాట్ ఒకరు. ఈ సారి కూడా తనదే గెలుపన్న ధీమాలో ఉన్నారు.
కుల సమీకరణలే కీలకం
సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి గెహ్లాట్ ఇప్పటివరకు 4సార్లు గెలిచారు. అన్నిసార్లు ఆయనను కులసమీకరణలే గెలిపించాయి. సర్దార్‌పురలో మెజార్టీ ఓటర్లు మాలీలు. ఆ తర్వాత స్థానాల్లో ముస్లింలు, రాజ్‌పుత్‌లున్నారు. ఇక జాట్లు, ఇతర వెనుకబడిన కులాల ప్రాబల్యం కూడా ఎక్కువే. 40 వేల వరకు ఉన్న మాలీలు, 30 వేల ముస్లిం ఓటర్లు గెలుపోటముల్ని శాసించగలరు. గెహ్లాట్ మాలీ సామాజికవర్గానికి చెందినవాడు కావడంతో వారి అండతోనే ఆయన నెగ్గుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో గెహ్లాట్‌కి వ్యక్తిగత కరిజ్మా కూడా ఎక్కువే. అందుకే ఆయన్ని ఓడించడానికి చాలా సార్లు ప్రయత్నాలు చేసి బీజేపీ భంగపడింది.
ఖేతాసర్ పోటీ ఇవ్వగలరా?
2013 ఎన్నికల్లో రాజస్థాన్‌లో బీజేపీ కనీవినీ మెజార్టీ సాధించింది. అప్పటికే ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ప్రకటించడంతో ఆయన హవా బాగా కనిపించింది. అంతటి మోదీ వేవ్‌లో నెగ్గలేకపోయిన శంభు సింగ్ ఖేతాసర్ ఈసారి గెహ్లాట్‌కు పోటీ ఇవ్వగలరా అన్నదే ప్రశ్న. అందులోనూ ఖేతాసర్‌కు ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. మూడు సార్లూ ఓడిపోయారు. 2008లో ఓషియన్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంతో సంతృప్తి చెందారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్‌పై పాలీ నియోజకవర్గం నుంచి ఘోరంగా ఓటమిపాలయ్యారు. అశోక్ గెహ్లాట్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా నెగ్గారు. రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందిన ఖేతాసర్ ఈ సారి ఓషియన్ నుంచి టిక్కెట్ ఆశించారు. కానీ బీజేపీ అధిష్టానం మళ్లీ గెహ్లాట్‌పైనే పోటీకి దింపింది. ఎవరినో ఒకరిని పోటీకి నిలిపాలన్న ఉద్దేశంతో ఖేతాసర్‌కు టిక్కెట్ ఇచ్చి రాజే చేతులు దులుపుకున్నారన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. సర్దార్‌పుర నియోజకవర్గంలో మాలీ, ముస్లింల తర్వాత రాజ్‌పుత్‌లు కూడా గణనీయంగానే ఉన్నారు. వారంతా బీజేపీపై ఆగ్రహంతో ఉండడంతో రాజ్‌పుత్ అయిన శంభు సింగ్‌కు వారి మద్దతు కూడా లభించే అవకాశం లేదు. ఇలా అన్నివైపుల నుంచి ఖేతాసర్ ఏ మాత్రం బలమైన అభ్యర్థి కాలేరన్న అంచనాలున్నాయి. అయితే ఈ సారి గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు శంభు సింగ్ ఖేతాసర్. ‘గత ఎన్నికల్లో గెహ్లాట్ గెలిచారంటే అధికారం వాళ్ల చేతుల్లో ఉంది. ఒక సీఎంను ఓడించడం అంత సులభం కాదు. అందుకే ఆయన నెగ్గారు. ఈసారి అలాకాదు. గెహ్లాట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అంతే. అందుకే ఈ సారి గెలుపు నాదే’ అని ధీమాగా చెబుతున్నారు.
అయినా వసుంధరే టార్గెట్..
జోధ్‌పూర్ నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సర్దార్‌పుర ఒకటి. ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొరతే లేదు. మౌలిక సదుపాయాల పరిస్థితి ఘోరంగా ఉంది. ఎక్కడా సరైన రోడ్లుండవు. పారిశుద్ధ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తాగునీటి సరఫరా అధ్వాన్నంగా ఉంది. చాలా ప్రాంతాల్లో పైపు లైన్లే గల్లంతయ్యాయి. అత్యధిక ప్రాంతాల్లో మురుగునీటి పైపులు పగిలిపోయి.. తాగునీటి పైపుల్లో కలిసిపోయాయి. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలకు కలుషిత నీరే దిక్కుగా మారింది. ఈ సమస్యలు పరిష్కారం చేసేందుకు.. గెహ్లాట్ చొరవతీసుకున్న సందర్భమే లేదు. సర్దార్‌పుర సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో సమస్యలపై గెహ్లాట్ సీఎం వసుంధరా రాజేనే టార్గెట్ చేశారు. జోధ్‌పూర్ నగరంలో ఉన్న సర్దార్‌పుర అభివృద్ధి చేయడంలో రాజే నిర్లక్ష్యం వహించారంటూ ఎన్నికల ప్రచారంలో గెహ్లాట్ దుమ్మెత్తిపోస్తున్నారు. ‘నా సొంత నియోజకవర్గం కాబట్టే.. రాజే జోధ్‌పూర్‌ను నిర్లక్ష్యం చేశారు.
నియోజకవర్గంలో సమస్యలు
∙సరైన రహదారులు లేవు
∙నాసిరకమైన పారిశుద్ధ్య వ్యవస్థ
∙నీటి సరఫరా లోటుపాట్లు
∙మౌలిక సదుపాయాలు కరువు
మొత్తం ఓటర్లు
2.10 లక్షలు
మాలీలు 40 వేలు
ముస్లింలు 30 వేలు
రాజ్ పుత్‌లు 25 వేలు
ఎస్సీ, ఎస్టీ 35 వేలు
Comments
Please login to add a commentAdd a comment