న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీ, వర్సెస్ నరేంద్ర మోడీ మధ్య పోటీ అన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ రాష్ట్రాల్లో తమ పార్టీ కమిటీలు, ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వంలో నెలకొన్న తీవ్ర సమస్యలే ఓటమికి దారితీశాయని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ అన్నారు. కేంద్రంలోని కొందరు మంత్రుల వ్యాఖ్యల వల్ల తమ పథకాల ఘనత యూపీఏ, కాంగ్రెస్‌లకు కాకుండా వారికే దక్కిందని విమర్శించారు. తమ పార్టీ ఆత్మవిమర్శ చేసుకుని పనితీరు మార్చుకోవాలన్నారు. ఈ ఎన్నికలు రాహుల్, మోడీల మధ్య పోటీ అన్న వ్యాఖ్యానాలపై స్పందిస్తూ.. ఎన్నికలు జరిగేది వ్యక్తుల మధ్య కాదని, పార్టీల మధ్య అన్నారు. రాజస్థాన్‌లోని తమ ప్రభుత్వం, పార్టీ నాలుగున్నరేళ్లుగా ఏకతాటిపై నడవలేదని, మధ్యప్రదేశ్‌లోనూ పరిస్థితి భిన్నంగా లేదన్నారు.