ఎన్నికల్లో గెలుపునకు ప్రచార తంత్రమే కీలకం. దానికి ఆకర్షణ మంత్రమూ తోడవ్వాలి. అలా కావాలంటే స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాలి. ప్రధాన పార్టీలన్నిటికీ ఎలాగూ ‘ప్రచార తారలు’ ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ‘స్పెషల్’ అయితే, కాంగ్రెస్‌కు సోనియా, రాహుల్‌గాంధీతో పాటు సినీ తారలూ ప్రత్యేకాకర్షణ.. బీజేపీ కూడా ఈ విషయంలో తక్కువేం కాదు. ఇప్పుడు ఆయా ప్రధాన పార్టీలకు దీటుగా.. ఎన్నికల బరిలో ఉన్న చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు సైతం.. తమ పార్టీల జాతీయ స్థాయి నేతలను ప్రచారానికి దించుతున్నారు. కొద్ది రోజుల్లో వారంతా హైదరాబాద్‌లో, తెలంగాణ జిల్లాల్లో ప్రచారం హోరెత్తించనున్నారు.
పోటీకి కావాలో పార్టీ..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఎంఐఎం, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి (టీజేఎస్) సహా పలు జాతీయ పార్టీలు ఈ దఫా తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచాయి. తృణమూల్ కాంగ్రెస్ మాత్రం పోటీకి దూరంగా ఉంది. ఇవికాక ఉత్తర భారతం కేంద్రంగా గల పలు పార్టీలూ తెలంగాణలో రెండు, మూడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్నాయి. ఈ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలిచిన దాఖలాలు ఒకటి రెండు ఉన్నాయి. గతంలో వివిధ పార్టీల నాయకులు టికెట్ దక్కకపోతే.. రెబల్ లేదా స్వతంత్రంగా పోటీచేసేవారు. కానీ, 2004 నుంచి పరిస్థితి మారింది. వీలుంటే ఏదో జాతీయ లేదా చిన్న పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉత్తర భారతానికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్), శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్ (యునైటెడ్) బరిలో నిలిచాయి. టికెట్ రాక భంగపడ్డ నేతలంతా ఈ పార్టీల నుంచి పోటీకి దిగారు. వీరంతా ఆయా పార్టీల ప్రముఖులను ప్రచారానికి రప్పించి.. తమ ప్రభావాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు.
అధినేతలు దిగివచ్చే వేళ..
గతంలో తెలంగాణపై బీఎస్పీ మినహా మిగిలిన పార్టీలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో మాయావతి నగరంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈసారి అన్ని పార్టీల అధినేతలు తెలంగాణపై నజర్ పెట్టారు. త్వరలోనే వీరంతా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. బీఎస్పీ నుంచి మాయావతితో కలిపి 40 మంది, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, ఎస్‌పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తోపాటు 11 మంది జాతీయ నాయకులు, జనతాదల్ (యునైటెడ్) కోసం బిహార్ సీఎం నితీశ్‌కుమార్, కేసీ త్యాగితో పాటు 20 మంది అగ్రనేతలు, ఆప్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో ఐదుగురు ఢిల్లీ మంత్రులు ప్రచారం చేయనున్నారు. ఇక సీపీఎం ప్రచారానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ రానున్నారు. బృందాకారత్ ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇక్కడే ఎందుకు?
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లలో మరాఠీ, కన్నడ, హిందీ మాట్లాడేవారు అధికం. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై మరాఠా ప్రభావం ఉంది. అందుకే, బోధన్ నుంచి గోపీకిషన్, నిజామాబాద్ అర్బన్ నుంచి సూర్యనారాయణుగుప్తా శివసేన నుంచి పోటీ చేస్తున్నారు. వారి నామినేషన్‌కు మహారాష్ట్ర నుంచి శివసేన నేతలు వచ్చారు. బెల్లంపల్లి నుంచి వినోద్ బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, కోనప్ప గెలిచి సంచలనం సృష్టించారు. కాగా, సింగరేణి బొగ్గు గనులు అధికంగా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సీపీఎంకూ మంచిపట్టే ఉంది. ఈ ప్రాంతాల్లో మాజీ సీఎం మాణిక్ సర్కార్, సీతారాం ఏచూరి, బృందా కారత్ తదితర ప్రముఖులు నగరంలో, తెలంగాణ జిల్లాలలో పర్యటించనున్నారు.
హోరెత్తనున్న పబ్లి‘సిటీ’..
నగరంలో సికింద్రాబాద్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉత్తరాది ప్రజలు స్థిరపడ్డారు. అందుకే ఇక్కడ బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ నుంచి కొందరు పోటీ చేస్తున్నారు. నగరంలో ఆమ్ ఆద్మీ పార్టీ 2014 ఎన్నికల్లో పోటీ చేసింది. కొన్ని ఓట్లు సాధించడం ద్వారా కాస్త గుర్తింపు పొందగలిగింది. విద్యావంతులు ఎక్కువుండే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, ఉప్పల్, మలక్‌పేట, ఎల్బీనగర్ స్థానాల్లో ఈసారి ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. కేజ్రీవాల్, నితీశ్‌కుమార్ కాస్త ఆలస్యంగా ప్రచారానికి రావొచ్చని సమాచారం.
- అనిల్‌కుమార్ భాషబోయిన
మాకూ ఉన్నారు
Published Fri, Nov 23 2018 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment