సాక్షిప్రతినిధి, వరంగల్ : నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తెలుగుదేశం పడుతున్న తాపత్రయం... జిల్లాలోని కమలనాథుల్లో ఆందోళన కలిగిస్తోంది. సాధారణ ఎన్నికల్లో
గెలుపు అవకాశాలు లేని టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ అని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారుు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత, మోడీ హవాతో కమలానికి వస్తున్న అనుకూలత కాస్త.. తెలంగాణపై అస్పష్ట వైఖరితో ఉన్న టీడీపీతో కలవడం వల్ల పోతుందనే ఉద్దేశంతో బీజేపీ జిల్లా నాయకత్వం పొత్తు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాదు.. టీడీపీతో పొత్తుతో దశాబ్ద కాలం క్రితం కోలుకోలేనంతగా దెబ్బతిన్న విషయాన్ని ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారుు.
తమ బలంతో అధికారపీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు కృతజ్ఞత లేకుండా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారుు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో టీడీపీతో దోస్తీ వల్ల ఎటుచూసినా నష్టమే ఎక్కువని... తెలంగాణ కోసం చేసిన పోరాటంతో వచ్చిన మంచి పేరు అంతా పోతుందని వాపోతున్నారుు. టీడీపీతో జత కట్టే విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోకముందే తమ వాదనను వినిపించాలని అనుకుంటున్నారుు.
తామే జీవం పోయూలా...
తెలంగాణకు సంబంధించి బీజేపీ బలంగా ఉన్న జిల్లాలో వరంగల్ ఒకటి. జిల్లా నుంచి పార్టీలో ముఖ్య నాయకులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో జిల్లాలో టీడీపీ ప్రభావం తగ్గింది. నరేంద్రమోడీ హైదరాబాద్‌లో నిర్వహించిన నవభారత యువభేరి సభ నుంచే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సభలో ఎన్టీఆర్‌ను మోడీ ఆకాశానికెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు ముందే మిత్రులను పెంచుకోవాలని మోడీ భావించడం వల్ల స్నేహహస్తం అందించారన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచే తెలంగాణ ప్రాంత నాయకులు పొత్తు వల్ల వచ్చే లాభనష్టాల గురించి అంచనా వేయడం ప్రారంభించారు. ఏ రకంగా చూసినా పొత్తు కమలానికి మేలు చేయదని, రోజురోజుకూ విశ్వసనీయతను కోల్పోతున్న టీడీపీకి తామే కొత్తగా జీవం పోసినట్లవుతుందని బీజేపీకి చెందిన జిల్లా ముఖ్య నేతలు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ బాగా దెబ్బ తిన్నదనీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ అస్పష్ట వైఖరితో ఉన్న టీడీపీతో ఎన్నికలకు వెళ్తే... ఓటర్లు తమను దెబ్బతీస్తారని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం టీడీపీ, బీజేపీ బలాల్లో పెద్దగా తేడా లేదని కమలనాథులు ధీమాతో ఉన్నారు.
బీజేపీని గతంలో దెబ్బతీసిన పొత్తు
దశాబ్ద కాలం క్రితం వరకు బీజేపీ జిల్లాలో బలం ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు గెలిచే వారు. జిల్లావ్యాప్తంగా నిబద్ధత గల కేడర్ ఉండేది. టీడీపీతో పొత్తు కారణంగా 1999 నుంచి క్రమంగా కమలం వాడిపోతూ వచ్చింది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు ఎక్కువగా ఉన్నా... శ్రేణులను ఏకతాటిపై నడపలేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించడం, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అభ్యర్థిత్వం ఖరారవడంతో బీజేపీకి ఊపు వచ్చింది.
ఇతర పార్టీలకు చెందిన పలువురు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గ స్థాయి నేతలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు అంశం తెరపైకి రావడం కమలనాథులకు ఇబ్బందికరంగా మారుతోంది.
టీడీపీతో పొత్తు కమలనాథుల్లో గుబులు
Published Mon, Dec 16 2013 3:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement