అసలేం జరుగుతోంది?
'ఈ నగరానికి ఏమైంది....' సినిమా ధియేటర్ లోకి అడుగు పెట్టగానే ప్రేక్షకుడిని పలకరించే సర్కారువారి ప్రకటన ఇది. ఇప్పుడీ మాటను బీజేపీ ముఖ్యమంత్రులకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాషాయ సీఎంలు వివాదాల్లో చిక్కుకుని వరుసగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు. 'ముఖ్య' నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం కమలం పార్టీ గుబులు రేపుతోంది. ఇక సాధారణ ఎన్నికల ముందు మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీలను ఏకీపారేసి పీఎం సీటులోకి వచ్చిన నరేంద్ర మోదీ తమ సీఎంలపై వచ్చిన ఆరోపణలతో మౌనమునిగా మారిపోవడం విచిత్రం. అసలేం జరుగుతోంది?
రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె 'లలిత్ గేట్'లో చిక్కుకుంటే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 'వ్యాపమ్' స్కామ్ తో విలవిల్లాడుతున్నారు. అనూహ్యంగా సీఎం సీటు దక్కించుకున్న మహారాష్ట్ర 'ముఖ్య' నేత దేవంద్ర పఢ్నవిస్.. తన మంత్రుల కక్కుర్తి పనులతో చిక్కుల్లో పడ్డారు. ఆర్థిక మోసగాడుగా ముద్రపడి దేశాలు పట్టిపోయిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీకి 'చిన్నమ్మ' సాయం చేశారన్న వాస్తవం వెలుగుచూడడంతో 'లలిత్ గేట్' తెరుచుకుంది. సుష్మతో పాటు రాజె పేరు బయటికి రావడంతో కాషాయ దళంలో కలకలం రేగింది. అందివచ్చిన అస్త్రాన్ని అందుకుని విపక్షాలు చెలరేగడంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. పార్టీ కొమ్ముకాయడంతో 'కమలమ్మ'లకు పదవీ గండం దాదాపు తప్పింది.
ఇక అంతుచిక్కని చావులతో మృత్యుగీతం మార్మోగిస్తున్న 'వ్యాపమ్' స్కామ్ చౌహాన్ మెడకు చుట్టుకుంది. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వారు పిట్టల్లా రాలుతుండడంతో చౌహాన్ సీఎం పీఠం కిందకు నీళ్లు వచ్చాయి. ఎట్టకేలకు మేల్కొన్న శివరాజా వారు 'వ్యాపమ్' మరణాల వెనుకున్న వాస్తవాలను వెలికి తీయాలంటూ సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే 43కు చేరిన 'వ్యాపమ్' మరణాల సంఖ్య ఎక్కడిదాకా ఎగబాకుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది.
'పల్లీ చిక్కీ' కొనుగోళ్లలో రూ.206 కోట్లకు మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే 'టెండర్' పెట్టారని ప్రతిపక్షాలు దుమారం రేపడంతో 'మహా' ప్రభుత్వం ఉలిక్కిపడింది. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే రూ.191 కోట్ల కాంట్రాక్టు కుంభకోణం చేశారని విపక్షాలు ఇష్యూ రైజ్ చేశాయి. నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, తావ్డే బోగస్ వర్సిటీ అంశం ఫడ్నవిస్ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎయిరిండియా విమానం నుంచి ప్రయాణికుల దించేశారన్న ఆరోపణలతో ఫడ్నవిస్ కూడా వివాదాలపాలయ్యారు.
'ముఖ్య'నేతలు వరుస వివాదాల్లో చిక్కుకున్నా కమలం పార్టీ వారికి కాపాడుకుంటూ వచ్చింది. ప్రధాని మోదీ అయితే మౌనవ్రతం పాటిస్తున్నారు. సిల్లీ విషయాలపై తాను మాట్లాడబోనంటూ తన పరివారంతో ప్రకటనలిప్పిస్తున్నారు. మోదీ నోరు విప్పాలంటూ విపక్షాలు మాత్రం గొంతు చించుకుంటూనే ఉన్నాయి.