lalit gate
-
'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?'
న్యూఢిల్లీ: ఇంటర్ పోల్ నుంచి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురైంది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ కూడా అందింది. ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అతడిని తిరిగి వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముందుకు కదిలిన విషయం తెలిసిందే. ఈడీ కూడా లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్ పోల్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్ పోల్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
చాటుమాటు సాయం ఎందుకు చేశారు?
-
ప్రధానికి సభకొచ్చే దమ్ము లేదా?
లలిత్ మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రహస్యంగా.. చాటుమాటుగా ఎందుకు సాయం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రశ్నించారు. లలిత్ మోదీ వివాదంపై గురువారం సభలో చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ ఆవేశంగా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. లోక్‌సభలో కూర్చున్నప్పుడు సుష్మా స్వరాజ్ తనవద్దకు వచ్చి 'బాబూ.. నీకు నామీద ఎందుకు కోపం అని అడిగారు. నాకు కోపం లేదు.. మీరంటే నాకు గౌరవం అని చెప్పాను' అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. అసలు ప్రధానమంత్రి సభకు ఎందుకు రావట్లేదని, ఆయనకు సభకు వచ్చే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. సుష్మాజీ, నేను అందరితో చెబుతున్నాను.. మీరు మీ కళ్లు కిందకు దించుకున్నారు. అవునా కాదా.. ఇప్పుడు మీరు ఎందుకిలా అన్నారు? మీ కుటుంబంతో లలిత్ మోదీకి సంబంధం ఉంది. వాళ్లు అతడి లీగల్ వ్యవహారాలు చూస్తారు, మీరు మీ మంత్రిత్వశాఖతో వాళ్లకు సాయం చేస్తారు మీరు కూడా సాయం చేస్తారు.. ఏదైనా ఆస్పత్రి వాళ్లు వస్తారు, ఎవరైనా ఎవరికైనా సాయం చేస్తారు. కానీ, ప్రపంచంలో సుష్మా చాటుమాటుగా సాయం చేసిన మొదటి మానవతావాది. మీ వాళ్లకు ఎంత సొమ్ము ముట్టింది అన్నది నా మొదటి ప్రశ్న ఈ పని మీరు రహస్యంగా ఎందుకు చేశారు.. ప్రధానికి ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పారా, చెప్పలేదా? 12 కోట్ల రూపాయలు లలిత్ మోదీ ఇచ్చారా లేదా? వాణిజ్య లావాదేవీలలో రెండు రకాల వ్యక్తులకు లాభం కలుగుతుంది. లలిత్ మోదీకి ఎలాంటి లాభం కలిగింది? లంచాలు తీసుకోను.. తీసుకోనివ్వబోనని మోదీ చెప్పారు.. ఇప్పుడు చేసిందేంటి? వీళ్లు మిమ్మల్ని రక్షించడం లేదు.. మరింత నష్టం చేస్తున్నారు.. మీరు మాట్లాడితేనే రక్షణ ఉంటుంది. మాట్లాడేందుకు భయపడొద్దు మన్ కీ బాత్ అంటున్నారు.. దేశం మీ మాటలు వినాలనుకుంటోంది. అవి కూడా చెప్పండి. అసలు ఈ చర్చ జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో ఎందుకు లేరు? లలిత్ మోదీని ఎవరు.. ఎందుకు రక్షించారు, మంత్రి రక్షిస్తున్నారా, ఆమె కూతురు రక్షిస్తోందా, లేదా ఒక ముఖ్యమంత్రి రక్షిస్తున్నారా -
ఏడు రకాల ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : లోక్‌సభలో చర్చ సందర్భంగా లలిత్ మోదీ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఏడు రకాల ప్రశ్నలు సంధించింది. కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ....లేవనెత్తిన ప్రశ్నలు ఇవే... *లలిత్ మోదీకి సంబంధించిన పత్రాలను ఎందుకు రహస్యంగా ఉంచారు? *మోదీకి తాత్కాలిక పద్ధతిలో అనుమతి పత్రాలు ఎందుకు ఇవ్వలేదు? *హైకోర్టు ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదు? *లలిత్ మోదీకి సహాయం చేయాలన్న నిర్ణయం ఎవరు తీసుకున్నారు? దీనికి ఎవరు ఆమోదం తెలిపారు? *బ్రిటన్ అనుమతి ఇస్తున్న సమయంలో భారత్ అభ్యంతరం తేలిపిందా? లేదా? *మోదీకి నివాస పత్రాన్ని ఎలా మంజూరు చేశారు? * ట్రావెల్ డాక్యుమెంట్లు తీసుకున్న తర్వాత మోదీ ఎక్కడకు వెళ్లారు? *పోర్చుగల్ వెళ్లారు, వియన్నా వెళ్లారు, రిసార్టుల్లో సేద తీరారు? *మానవతా దృక్పథంతో ఇచ్చిన అనుమతి ఇదేనా? *మోదీకి వెనక్కి తీసుకు రావడంలో ప్రభుత్వం ఎందుకు విఫలం అయింది? *లలిత్ మోదీ కుటుంబంతో ఉన్న సంబంధాలు ఏంటి? -
సభలో నిరసనల పర్వం
మిన్నంటిన విపక్షాల నినాదాలు * లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై కొనసాగిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు సోమవారం నాడు లోక్‌సభ విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ మూడుసార్లు వాయిదాపడినా.. మూడు గంటల పాటు సాగింది. సమావేశాల తొలి వారంలో.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలను తొలగించాలంటూ సభను స్తంభింపజేసిన విపక్షాల ఆందోళన ఐదో రోజూ యథాతథంగా కొనసాగినప్పటికీ.. స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మూడు గంటల పాటు కొనసాగించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. ఐపీఎల్, కుల గణన వివరాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, వ్యాపమ్ అంశాలపై చర్చ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నోటీసులు తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం వెల్‌లోకి వచ్చి నినాదాలు మొదలుపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, అది నిబంధనలకు వ్యతిరేకమని సభాపతి సభ్యులను కోరారు. 12 గంటల వరకు సభను వాయిదావేశారు. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభయ్యాక మంత్రి వెంకయ్య లేచి గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన ఇంకా కొనసాగుతోందని, ఎదురు కాల్పులు పూర్తయ్యాక హోంమంత్రి సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సభాపతి ఈ సమయంలో జీరో అవర్‌ను ప్రారంభించగా పలువురు సభ్యులు గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన కూడా గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించబోయారు. అయితే హైకోర్టు విషయం మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చని, గురుదాస్‌పూర్ సంఘటనపై అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వబోనని స్పీకర్ చెప్పారు. దీంతో జితేందర్‌రెడ్డి ‘హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చాను. మాకు చర్చకు అవకాశం వచ్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’ అని చెప్పి ముగించారు. గందరగోళంతో సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం నాడు రాజ్యసభ.. ఇటీవల మరణించిన సిటింగ్ బీజేడీ సభ్యుడు కల్పతరు దాస్, మాజీ సభ్యులు ఆర్.ఎస్.గవాయ్, బి.కె.హాందిక్లకు నివాళులు అర్పించి మంగళవారానికి వాయిదా పడింది. ‘క్యాంటీన్లో ధరలు పెంచొద్దు’ ఎంపీలకు చవగ్గా ఆహారాన్ని అందిస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఈ సబ్సిడీని కొనసాగించాల్సిందేనని పార్లమెంటరీ క మిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు క్యాంటీన్లో ధరలు పెంచితే ఆ ప్రభావం చట్టసభల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై పడుతుందని టీఆర్ఎస్ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ పేర్కొంది. స్పీకర్ టేబుల్‌పై ప్లకార్డు ప్రదర్శన లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాక కాంగ్రెస్ నేత ఖర్గే లేచి.. గురుదాస్‌పూర్ సంఘటనపై మాట్లాడాలనుకుంటే మా ట్లాడనివ్వలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నిరసనలు, నినాదాలు ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదని, గడచిన పదేళ్ల రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వెంకయ్య జోక్యం చేసుకుని గురుదాస్‌పూర్ సంఘటనపై రాజకీయాలు వద్దని, దేశ భద్రతకు సంబంధించిన అంశం లో జాతి మొత్తం ఒక్కటై నిలవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి 377 నిబంధన కింద ప్రత్యేక ప్రస్తావనలకు అనుమతించారు. గందరగోళం మధ్యనే ప్రభు త్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్లు 2015, 295 చట్టాలను రద్దు చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆదిర్రంజన్చౌదరి వెల్ నుం చి స్పీకర్ స్థానం వైపు ఉన్న మెట్ల మీదికి ఎక్కి స్పీకర్ టేబుల్‌పైన ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆగ్రహానికి గురైన సభాపతి సభను 4 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి 4గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్.. చౌదరి సభాపతి స్థానంతో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడిపై చర్యకు ఉపక్రమిస్తూ అతడి పేరును ప్రస్తావించారు. చౌదరి లేచి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. -
'గుదిబండలా మారిన గవర్నర్'
తిరుపతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ గుదిబండలా మారారని సీపీఐ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. గవర్నర్ ను మార్చడం కాదు, వ్యవస్థనే రద్దు చేయాలని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్థిక నేరాల నిందితుడు లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నిందితురాలని పేర్కొన్నారు. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో సమాధానం ఇస్తే.. ఉభయ సభలకు అవమానకరమన్నారు. సుష్మా స్వరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. -
కాంగ్రెస్ నేత పేరు బయటపెడతా: సుష్మ
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ సహాయ మంత్రి సంతోశ్ బాగ్రోడియాకు దౌత్యవీసా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు తనపై ఒత్తిడి తెచ్చారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. ఆ నాయకుడు పేరు పార్లమెంట్ లో వెల్లడిస్తానని ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు. కాగా 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ స్వరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేసేవరకు పార్లమెంట్ సమావేశాలు అడ్డుకుంటామని కాంగ్రెస్ సహా విపక్షాలు స్పష్టం చేశాయి. 'లలిత్ గేట్'పై చర్చించేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. ముందు రాజీనామా, తర్వాతే చర్చ జరగాలని అంటున్నాయి. I will disclose name of the leader on the floor of the House.@imTejasBarot — Sushma Swaraj (@SushmaSwaraj) July 22, 2015 -
'చర్చకు ఒప్పుకోం, రాజీనామా చేయాల్సిందే'
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్' వ్యవహారంలో వెనక్కు తగ్గేది లేదని సీపీఎం స్పష్టం చేసింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో చర్చిస్తామన్న బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చ అనేది నిష్పక్షపాత దర్యాప్తుకు ప్రత్యామ్నాయం కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. సుష్మ, రాజె రాజీనామా చేసి తీరాల్సిందేనని స్పష్టీకరించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలంటే విపక్షాల డిమాండ్ ను ప్రభుత్వం అంగీకరించాల్సిదేనని అన్నారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంపై బీజేపీ ఇంతే పట్టుదలతో వ్యవహరించిందని ఏచూరి గుర్తు చేశారు. -
సభలో ఇక సమరమే...
-
సభలో ఇక సమరమే...
* అధికార - విపక్షాల మధ్య సయోధ్య మృగ్యం * ప్రతిష్టంభనతో ముగిసిన అఖిలపక్ష సమావేశం న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య సమరం ఖరారయింది. లలిత్‌గేట్, వ్యాపమ్ స్కాంలపై పాలక, ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు పదవుల నుంచి వైదొలగకపోతే సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ స్పష్టంచేయగా.. అటువంటి రాజీనామాలు ఏవీ ఉండబోవని, ఎవరి హెచ్చరికలకూ తాము లొంగబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. పార్లమెంటు నిర్వహణ సమష్టి బాధ్యత అని, అందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశంపైన అయినా చర్చించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. మంగళవారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నిర్వహణలో ఒకటి, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహణలో మరొకటి.. మొత్తం రెండు అఖిలపక్ష సమావేశాలు జరిగాయి. ఈ రెండు భేటీల్లోనూ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షం..తమ వైఖరులపై భీష్మించటంతో ఆ భేటీలు ప్రతిష్టంభనతో ముగిశాయి. వెంకయ్య నిర్వహించిన అఖిలపక్ష భేటీలో.. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లయితే.. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్లను తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో నాటి రైల్వేమంత్రి పవన్‌కుమార్ బన్సల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్చవాన్లపై ఆరోపణలు వచ్చినపుడు వారు ఎలా రాజీనామా చేశారో ఆయన ఉదహరించారు. వ్యాపమ్ కుంభకోణంలో వరుస మరణాలను ఖండిస్తూ.. పాకిస్తాన్ ఐఎస్ఐ కానీ, ఇక్కడి ఉగ్రవాదులు లేదా నక్సలైట్లు కానీ ఈ పని చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోందా అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేసిన హామీలను గుర్తుంచుకుని అవినీతిపై మాటలను చేతల్లో చూపించాలని కాంగ్రెస్ సూచించింది. ఆజాద్ డిమాండ్లను వెంకయ్య తిరస్కరించారు. ‘ఎవరి నుంచైనా తుదిహెచ్చరికలను అంగీకరంచేది లేదు. రాజీనామా అనే ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ప్రభుత్వానికి ఎవరూ షరతులతో ఆజ్ఞలు జారీచేయజాలరు. ప్రభుత్వం నుంచి ఏ కేంద్రమంత్రి కూడా అక్రమమైన, అనైతికమైన పని ఏదీ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. లలిత్‌మోదీ వివాదంపై సుష్మాస్వరాజ్ సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సమావేశాలు సాగకపోతే.. చర్చించేదెలా? కాంగ్రెస్, జేడీ(యూ), ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు, ఎన్డీఏ మిత్రపక్షాలు సహా 29 పార్టీల నుంచి పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ 42 మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తృణమూల్ కాంగ్రెస్, అన్నా డీఎంకే పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొనలేదు. అయితే.. వసుంధర, చౌహాన్లు ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయకపోతే సమావేశాలను సాగనివ్వబోమన్న కాంగ్రెస్ వైఖరితో సమావేశానికి హాజరైన ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏకీభవించలేదు. పార్లమెంటు సమావేశాలు తుడిచిపెట్టుకుపోవటం పరిష్కారం కాబోదని పలు పార్టీలు అభిప్రాయపడ్డాయి. కాంగ్రెస్ వైఖరి గురించి ప్రస్తావించగా.. ‘ఇది సరికాదు. పార్లమెంటు జరుగుతుంది. ప్రభుత్వం చర్చకు అనుమతించాలి’ అని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్‌యాదవ్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదిస్తున్న భూసేకరణ బిల్లును తాము అంగీకరించేది లేదన్నారు. సమావేశాలు సజావుగా సాగుతాయా అన్నది అనుమానమేనని ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్ స్పందించారు. ఆజాద్ లేవనెత్తిన అంశాలపై చర్చజరగాలని.. పార్లమెంటు పనిచేయకుండా అడ్డుకుంటే చర్చ ఎలా జరుగుతుందని శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్‌దేవ్‌సింగ్ ధిండ్సా వ్యాఖ్యానించారు. భారత్ - పాక్ సరిహద్దులో సంఘటనలపై చర్చ జరగకుండా పార్లమెంటుకు ఆటంకం కలిగించేవారిని జాతి క్షమించదని శివసేన నేత సంజయ్‌రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై సవివరమైన చర్చ జరగాలని టీఆర్ఎస్ నేత కె.కేశవరావు అన్నారు. చర్చల ద్వారా స్పష్టత వచ్చేందుకు వీలుగా వివిధ అంశాలపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని సీపీఎం నేత సీతారాంఏచూరి కోరారు. చర్చకు ప్రతిపాదించిన అంశాలివీ... సమావేశాల్లో చర్చించటానికి ప్రతిపాదించిన అంశాల్లో.. భారత్, పాక్ సంబంధాలు - విదేశాంగ విధానం, పెరుగుతున్న సామాజిక అంతరాలు, రైతుల ఆత్మహత్యలు - వ్యవసాయ రంగ సంక్షోభం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - దాని అమలు, పదోన్నతుల్లో ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్లు, పొగాకు రైతుల సమస్యలు, సామాజిక - ఆర్థిక కుల గణన తదితర అంశాలున్నాయి. కాంగ్రెస్ చేతిలో బ్రహ్మాస్త్రాలు..! సుష్మాస్వరాజ్: ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీ బ్రిటన్ నుంచి పోర్చుగల్ వెళ్లేందుకు ట్రావెల్ డాక్యుమెంట్స్లభించేలా సహకరించారన్న ఆరోపణలతో వివాదం రేగింది. మోదీ భార్య కేన్సర్ చికిత్సకు పోర్చుగల్ వెళ్లడం కోసం మోదీ కోరడంతో మానవతా దృక్పథంతోనే సాయం చేశానని సుష్మా వివరణ ఇచ్చినప్పటికీ.. విపక్షం శాంతించలేదు. వసుంధర రాజె: ‘లలిత్‌గేట్’లో రెండో వికెట్. తన బ్రిటన్ ఇమిగ్రేషన్‌కు సాక్షిగా వచ్చేందుకు రాజె ఒప్పుకున్నారని, ఈలోపు ఆమె సీఎం కావడంతో కుదరలేదని లలిత్ ట్వీట్‌తో రాజె ఇందులో ఇరుక్కున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్: వ్యాపమ్.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్పె భారీ ఎత్తున బురదజల్లిన కుంభకోణం. వైద్య విద్యలో ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో నియామకాల్లో జరిగిన రూ.కోట్ల స్కాం చౌహాన్ ఇమేజిని దారుణంగా దెబ్బతీసింది. నిందితులు, సాక్ష్యులు.. దాదాపు 50 మంది అనుమానాస్పదంగా మృతి చెందడం ఈ స్కాంలోని చీకటి కోణాలను బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంలో ప్రభుత్వ, పార్టీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు రావడంతో శివరాజ్ సింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పట్టుపడుతోంది. భూబిల్లుపై సర్దుకుపోవాలి: మోదీ దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన తొలి అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ కొద్దిసేపు పాల్గొని ప్రసంగించారు. పార్లమెంటు సజావుగా సాగటానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. అది సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. భూబిల్లుపై సర్దుకుపోవాలన్నారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలపై అన్ని రాజకీయ పార్టీలూ సమష్టిగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. పార్లమెంటు సమయాన్ని అన్ని అంశాలనూ చర్చించేందుకు వినియోగించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆగస్ట్ తొలివారంలో ‘భూ’ నివేదిక * మరింత గడువు కోరిన జేపీసీ న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లును అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదిక సమర్పించే గడువును ఆగస్టు మొదటివారం వరకు పొడగించినట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ తెలిపారు. నివేదికను పార్లమెంటు వర్షాకాల స మావేశాల తొలిరోజైన జూలై 21వ తేదీన సమర్పించాల్సి ఉండగా మొదట జూలై 27 వరకు గడవును పొడగించాలని కమిటీ చైర్మన్ అహ్లూవాలియా(బీజేపీ) అభ్యర్థించారని, మరోసారి పొడిగింపును కోరుతూ తాజాగా లేఖ రాశారని వివరించారు. దాంతో ఆగస్ట్ తొలివారం వరకు గడవును పొడగించామని చెప్పారు. 2013 భూ సేకరణ చట్టానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలపై మరింత వివరణ కావాలని జేపీసీ సభ్యులు కోరుతున్నందున నివేదిక సమర్పణకు గడువు కావాలని అహ్లూవాలియా కోరారన్నారు. జూలై 6న జేపీసీ ముందు హాజరుకావాల్సి ఉన్న వివిధ శాఖలకు చెందిన ముగ్గురు కార్యదర్శులు గైర్హాజరయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 3 వరకు గడువు కో రుతూ రేపు(బుధవారం) అహ్లూవాలియా లోక్‌సభలో ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారని వెల్లడించాయి. అయితే, ఈ గడువులోపు కూడా ని వేదిక సిద్ధం కాకపోవచ్చని, మరోసారి గడువు పొడగింపును జేపీసీ కోరవచ్చని పేర్కొన్నాయి. అదే జరిగితే, భూ ఆర్డినెన్సును ప్రభుత్వం మరోసారి(4వ సారి) జారీ చేయాల్సి వస్తుంది. భూబిల్లును వ్యతిరేకించడమంటే అభివృద్ధిని వ్యతిరేకించడమే భూ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడాన్ని వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. అది రైతు వ్యతిరేకత, అభివృద్ధి వ్యతిరేకత అని వ్యాఖ్యానించారు. అంగుళం భూమి కూడా రైతుల నుంచి సేకరించనివ్వబోమన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వాళ్లు అధికారంలో ఉండగా సరైన పరిహారం ఇవ్వకుండానే 20 లక్షల ఎకరాల భూమిని పరిశ్రమలకు, ఎస్ఈజీలకు కట్టబెట్టారంటూ ట్వీట్ చేశారు. పార్లమెంటుకు విదేశీ అధికారుల లంచాల బిల్లు న్యూఢిల్లీ: లంచం ఇవ్వజూపే లేదా తీసుకునే విదేశీ ప్రభుత్వాధికారులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు కాలవ్యవధి ముగిసింది. దీంతో తాజాగా దీన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిన ప్రభుత్వం...ఈ బిల్లుపై సూచనలు, అభిప్రాయాలు తెలపాల్సిందిగా లా కమిషన్‌ను కోరింది. అయితే మంగళవారం పార్లమెంటులో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందా లేదా అనే విషయం తెలియరాలేదు. -
అసలేం జరుగుతోంది?
'ఈ నగరానికి ఏమైంది....' సినిమా ధియేటర్ లోకి అడుగు పెట్టగానే ప్రేక్షకుడిని పలకరించే సర్కారువారి ప్రకటన ఇది. ఇప్పుడీ మాటను బీజేపీ ముఖ్యమంత్రులకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాషాయ సీఎంలు వివాదాల్లో చిక్కుకుని వరుసగా పతాక శీర్షికలకు ఎక్కుతున్నారు. 'ముఖ్య' నేతలపై ఆరోపణలు వెల్లువెత్తడం కమలం పార్టీ గుబులు రేపుతోంది. ఇక సాధారణ ఎన్నికల ముందు మాటల తూటాలతో ప్రత్యర్థి పార్టీలను ఏకీపారేసి పీఎం సీటులోకి వచ్చిన నరేంద్ర మోదీ తమ సీఎంలపై వచ్చిన ఆరోపణలతో మౌనమునిగా మారిపోవడం విచిత్రం. అసలేం జరుగుతోంది? రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె 'లలిత్ గేట్'లో చిక్కుకుంటే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 'వ్యాపమ్' స్కామ్ తో విలవిల్లాడుతున్నారు. అనూహ్యంగా సీఎం సీటు దక్కించుకున్న మహారాష్ట్ర 'ముఖ్య' నేత దేవంద్ర పఢ్నవిస్.. తన మంత్రుల కక్కుర్తి పనులతో చిక్కుల్లో పడ్డారు. ఆర్థిక మోసగాడుగా ముద్రపడి దేశాలు పట్టిపోయిన ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీకి 'చిన్నమ్మ' సాయం చేశారన్న వాస్తవం వెలుగుచూడడంతో 'లలిత్ గేట్' తెరుచుకుంది. సుష్మతో పాటు రాజె పేరు బయటికి రావడంతో కాషాయ దళంలో కలకలం రేగింది. అందివచ్చిన అస్త్రాన్ని అందుకుని విపక్షాలు చెలరేగడంతో అధికార పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. పార్టీ కొమ్ముకాయడంతో 'కమలమ్మ'లకు పదవీ గండం దాదాపు తప్పింది. ఇక అంతుచిక్కని చావులతో మృత్యుగీతం మార్మోగిస్తున్న 'వ్యాపమ్' స్కామ్ చౌహాన్ మెడకు చుట్టుకుంది. ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వారు పిట్టల్లా రాలుతుండడంతో చౌహాన్ సీఎం పీఠం కిందకు నీళ్లు వచ్చాయి. ఎట్టకేలకు మేల్కొన్న శివరాజా వారు 'వ్యాపమ్' మరణాల వెనుకున్న వాస్తవాలను వెలికి తీయాలంటూ సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే 43కు చేరిన 'వ్యాపమ్' మరణాల సంఖ్య ఎక్కడిదాకా ఎగబాకుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. 'పల్లీ చిక్కీ' కొనుగోళ్లలో రూ.206 కోట్లకు మహిళా శిశు సంక్షేమ మంత్రి పంకజ ముండే 'టెండర్' పెట్టారని ప్రతిపక్షాలు దుమారం రేపడంతో 'మహా' ప్రభుత్వం ఉలిక్కిపడింది. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే రూ.191 కోట్ల కాంట్రాక్టు కుంభకోణం చేశారని విపక్షాలు ఇష్యూ రైజ్ చేశాయి. నీటిపారుదల శాఖ మంత్రి లోణికర్ నకిలీ డిగ్రీ వివాదం, తావ్డే బోగస్ వర్సిటీ అంశం ఫడ్నవిస్ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎయిరిండియా విమానం నుంచి ప్రయాణికుల దించేశారన్న ఆరోపణలతో ఫడ్నవిస్ కూడా వివాదాలపాలయ్యారు. 'ముఖ్య'నేతలు వరుస వివాదాల్లో చిక్కుకున్నా కమలం పార్టీ వారికి కాపాడుకుంటూ వచ్చింది. ప్రధాని మోదీ అయితే మౌనవ్రతం పాటిస్తున్నారు. సిల్లీ విషయాలపై తాను మాట్లాడబోనంటూ తన పరివారంతో ప్రకటనలిప్పిస్తున్నారు. మోదీ నోరు విప్పాలంటూ విపక్షాలు మాత్రం గొంతు చించుకుంటూనే ఉన్నాయి. -
'లలిత్ గేట్' ఆధారాలన్నీ బయటపెట్టాలి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ... బీజేపీ మంత్రి కుటుంబ సభ్యుడొకరికి ఉద్యోగం ఇవ్వజూపారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుజ్రీవాలా డిమాండ్ చేశారు. 'లలిత్ గేట్'లో ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టాలన్నారు. లలిత్ మోదీ ఏవిధంగా విదేశాలకు పారిపోయారో, ఆయనకు ఎవరెవరూ సహకరించారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీని లలిత్ మోదీ వివాదంలోకి లాగారు. -
'నరేంద్ర కాదు.. మౌనేంద్ర మోదీ'
న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ముఖ్యమంత్రుల ప్రమేయం బట్టబయలైనప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పందించకపోవడం దారుణమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. ' మన ప్రధాని పేరు నరేంద్ర మోదీ కాదు.. మౌనేంద్ర మోదీ' అని ఎద్దేవా చేశారు. మౌనంగా ఉన్నంతమాత్రాన మంత్రివర్గ సహచరులపై వచ్చిన ఆరోపణలు నిజంకాకుండాపోవన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జైరామ్.. లలిత్ మోదీతో బీజేపీ నాయకులకు సంబంధాలున్నాయని కచ్చితమైన ఆధారాలు లభించినప్పటికీ వారిపై చర్యలకు ప్రధాని వెనుకాడుతున్నారని ఆరోపించారు. -
‘లలిత్‌గేట్’ మూసేదెలా?
జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. పాలనలో వేగం పెంచడానికి, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, భూ సవరణ బిల్లు సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఈ సమావేశాలు సజావుగా సాగడం మోదీ ప్రభుత్వానికి చాలా అవసరం. ఈ సమావేశాలు ఫలప్రదం కావాలంటే కాంగ్రెస్ సహా విపక్షాల సహకారం చాలా అవసరం. అదీ, రాజ్యసభలో ప్రభుత్వ పక్షానికి మెజారిటీ లేనందున విపక్షాల మద్దతు లేకుండా ముందుకెళ్లడం ఎన్డీయే సర్కారుకు కత్తి మీద సామే. ఈ పరిస్థితుల్లో తాజాగా తెరపైకి వచ్చిన ‘లలిత్ గేట్’ కేంద్రానికి కొత్త తలనొప్పి తీసుకువచ్చింది. 20-20 క్రికెట్ టోర్నీ ఐపీఎల్ నిర్వహణలో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఈడీ సహా పలు జాతీయ దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే వేర్వేరు సందర్భాల్లో సహకరించారన్న ఆరోపణలు టీ కప్పులో తుఫానులా ప్రారంభమై.. సునామీలా మోదీ సర్కారును కుదిపేస్తున్నాయి. విపక్ష కాంగ్రెస్‌కు అంది వచ్చిన అస్త్రాలుగా మారాయి. సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలు రాజీనామా చేయడమో లేక వారిని పదవుల నుంచి తొలగించడమో చేయకపోతే.. పార్లమెంటు సమావేశాలను సాగనివ్వబోమని కాంగ్రెస్ ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో.. సమావేశాల సజావు నిర్వహణ కోసం కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గడమో.. లేక ప్రతిపక్షాలతో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశంతో తమ సీనియర్ నేతలకు బాసటగా నిలవడమో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి నెలకొంది. ప్రభుత్వం ఎదుర్కొంటున్న తాజా సంక్షోభంపై ‘సాక్షి’ ఫోకస్.. - నేషనల్ డెస్క్ * మోదీ సర్కారు మల్లగుల్లాలు * పార్లమెంటు సమావేశాల ముందు ప్రభుత్వానికి తలనొప్పి తెరపైకి రాజే! లలిత్‌గేట్‌లో తొలుత కేంద్రమంత్రి సుష్మ తర్వాత వసుంధర రాజే ప్రవేశించారు. 2011లో లలిత్ మోదీ బ్రిటన్ ఇమిగ్రేషన్ పొందేందుకు బ్రిటన్ అధికారుల ముందు అందించాల్సిన లిఖితపూర్వక సాక్ష్యం రాజేనే ఇచ్చారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా లలిత్మోదీనే ట్వీట్ చేశారు. ఆ తరువాత సంబంధిత డాక్యుమెంట్ కూడా వెలుగులోకి వచ్చింది. మొదట్లో, అదేంలేదంటూ బుకాయించిన వసుంధర.. ఆ తరువాత ఆ డాక్యుమెంట్, దానిపై తన సంతకం బయటపడటంతో పార్టీ అగ్ర నాయకత్వానికి వివరణ ఇచ్చారని వార్తలు వచ్చాయి. కేన్సర్‌కు చికిత్స పొందుతున్న సమయంలో తన భార్యతో పాటు పోర్చుగల్ వచ్చింది వసుంధర రాజేనే అని, తన ఇమ్మిగ్రేషన్‌కు మద్దతుగా సాక్ష్యమిచ్చేందుకు బ్రిటన్ కోర్టు ముందుకు రావడానికి కూడా వసుంధర సంతోషంగా ఒప్పుకున్నారని, అయితే, అప్పటికే ఆమె సీఎం కావడంతో అది కుదరలేదని అని సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ కుండబద్ధలు కొట్టారు. తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సత్సంబంధాలున్నాయని వివరించారు. దీంతో వసుంధర రాజే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇది మోదీ వ్యూహమే! ఈ వివాదంలోకి వసుంధర రాజేను లాగడం లలిత్‌మోదీ వ్యూహమే. దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కొన్ని కారణలతో దెబ్బతినడం, తనను కావాలనే రాజే పక్కన పెడ్తున్నారని లలిత్ మోదీ భావించడం.. ఈ వివాదంలోకి రాజేను లాగడానికి కారణమైంది. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) ఎన్నికల్లో.. గత 40 ఏళ్లుగా రాష్ట్ర క్రికెట్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను, అప్పటివరకు అంతగా ఎవరికీ తెలియని లలిత్‌మోదీ ఓడించారు. నిజానికి రుంగ్తాను ఓడించింది లలిత్ మోదీ కాదు.. ఆయన వెనకున్న నాటి ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఆ తరువాత వసుంధర రాజే మద్ధతుతో రాజస్తాన్‌లో మోదీ శకం ప్రారంభమైంది. ఒక దశలో మోదీని అంతా ‘సూపర్ సీఎం’ అనుకునేవారు. దాదాపు 2 వేల గజాలున్న, పురాతత్వ ప్రాముఖ్యత ఉన్న రెండు హవేలీలను కారుచవకగా కేవలం రూ. 30 లక్షలకు మోదీకి చెందిన కంపెనీకి అమ్మేయడం రాజేపై అవినీతి ఆరోపణల్లో అతి పెద్దది. మోదీ, రాజేల అవినీతితో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. ఆ తరువాత ఐపీఎల్లో అవకతవకలు బయటపడిన తరువాత బీసీసీఐ లలిత్‌మోదీపై జీవిత కాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోకుండా, రాజే 2014(అప్పటికి ఆమె మళ్లీ సీఎం అయ్యారు) మేలో ఆర్సీఏ అధ్యక్షుడిగా మోదీ ఎన్నికయ్యేలా చూశారు. అదే సంవత్సరం అక్టోబర్‌లో ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్ష పదవి నుంచి మోదీని తొలగించి తాను అధ్యక్షుడయ్యారు. దీని వెనుక వసుంధర రాజేనే ఉన్నారని లలిత్ భావించారు. అమిన్ పఠాన్ అధ్యక్షుడవడాన్ని లలిత్ మోదీ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో జనరల్ బాడీ సమావేశం పెట్టి మరీ లలిత్‌ను ఆర్సీఏ నుంచి సాగనంపారు. ఇదంతా రాజే కుట్రనే అని లలిత్ భావించడంతో వారిద్దరి మధ్య విబేధాలు తీవ్రమయ్యయి. దాంతో సమయం చూసుకుని లలిత్ వదిలిన ట్వీట్లలో రాజే చిక్కుకున్నారు. పెట్టుబడులు కూడా! వసుంధర రాజే కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌కు చెందిన నియంత్ హెరిటేజ్ హోటల్స్ కంపెనీలో లలిత్ మోదీ దాదాపు రూ.11 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని, ఆ పెట్టుబడులు షేర్ల రూపంలో పరోక్షంగా రాజే ఖాతాలోకే వెళ్లాయని వార్తలు వెలువడటంతో వసుంధర మరింత చిక్కుల్లో పడ్డారు. నియంత్ కంపెనీలో రూ.10 విలువైన షేరును అత్యధికంగా రూ. 96 వేల పైచిలుకు ప్రీమియంతో మోదీ కొనుగోలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఎలా మొదలైంది? లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ట్రావెల్ డాక్యుమెంట్స్ లభించేలా సుష్మా స్వరాజ్ సహకరించారనే విషయాన్ని నిర్ధారించే పత్రాలు వెల్లడి కావడంతో ‘లలిత్‌గేట్’ గేట్లు తెరుచుకున్నాయి. ఆ విషయం వాస్తవమేనని ఒప్పుకున్న సుష్మ.. మోదీ భార్య కేన్సర్‌తో బాధ పడుతోందని, ఆమె చికిత్స కోసం తాను పోర్చుగల్ వెళ్లాల్సి ఉందని మోదీ అభ్యర్థించడంతో మానవతా దృక్పథంతో మాట సాయం చేశానని చెప్పారు. అయితే, తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ, పరారీలో ఉన్న నిందితుడికి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి సహకరించడం నేరమే అవుతుందని, అందువల్ల సుష్మా రాజీనామా చేయాల్సిందేనని విపక్షాలు పట్టుబడ్తున్నాయి. మరోవైపు, సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బాన్సురి స్వరాజ్ తనకు చాలా సంవత్సరాలు ఉచితంగా న్యాయ సేవలందించారంటూ లలిత్ చేసిన ట్వీట్ అగ్నికి ఆజ్యంలా మారింది. సుష్మాకు మద్దతు.. రాజేకు మౌనం! సుష్మా స్వరాజ్ అంశం వెలుగులోకి రాగానే తక్షణమే స్పందించిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆమెకు బాసటగా నిలిచాయి. సుష్మా తప్పేం చేయలేదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాయి. ఈ విషయంలో ఆమెకు ఆరెస్సెస్ కూడా మద్దతుగా నిలిచిందని సమాచారం. అదే వసుంధర రాజే విషయానికి వచ్చేసరికి.. మొదట్లో ప్రభుత్వం, పార్టీ మౌనం వహించాయి. బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు. దాంతో సుష్మాను కాపాడేందుకు రాజేను బలి చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల తరువాతే, చర్చోపచర్చల అనంతరమే రాజేకు మద్దతుగా నిలవాలనే నిర్ణయం మోదీ సర్కారు తీసుకుంది. వసుంధర రాజే రాజస్తాన్‌లో పార్టీకి ఉన్న ఏకైక, ప్రజాకర్షక నేత కావడం, ఆమెకు రాజస్తాన్ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించడం, ఎమ్మెల్యేల మద్దతుతో అవసరమైతే అగ్ర నాయకత్వాన్నైనా ఎదుర్కొనేందుకు రాజే సిద్ధమవుతున్నారని, సంతకాల సేకరణ కూడా ప్రారంభించారని వార్తలు రావడం, ఆరెస్సెస్ సపోర్ట్ కూడా ఆమెకే ఉండటం.. తదితర కారణాల వల్లనే బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని, ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడిందని జైపూర్ వర్గాల సమాచారం. కిం కర్తవ్యం!? ఊహించని ఉత్పాతంగా మారిన ‘లలిత్‌గేట్’తో మోదీ సర్కారు ఆత్మ రక్షణలో పడింది. ఇప్పుడే ఈ విషయంలో కాంగ్రెస్ విమర్శలకు సరిగ్గా సమాధానమివ్వలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక సకల అస్త్రాలతో సన్నద్ధంగా ఉన్న ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం ముందు రెండే మార్గాలున్నాయని.. ఒకటి, విపక్ష ఒత్తిడికి తలొగ్గి రాజేతో రాజీనామా చేయించడం.. రెండోది, ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడం, అందుకు అవసరమైన ఆయుధాలను సిద్ధం చేసుకోవడమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఆ ఇద్దరికీ ముప్పు తప్పినట్టే(నా)!
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజెలపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీహార్ ఎన్నికల ముందు ఎలాంటి చర్య వద్దని, విపక్షాల ఒత్తిడికి తలొగ్గకూడదని ఆర్ఎస్ఎస్ ఉద్బోధించడంతో మహిళా నేతలకు ముప్పు తప్పినట్టే కనబడుతోంది. మరోవైపు 'లలిత్ గేట్'పై బీజేపీ అగ్రనాయకులు శుక్రవారం మంతనాలు సాగించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీ అయ్యారు. ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇరువురు నాయకులు మంతనాలు సాగించినట్టు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి జైట్లీ వ్యూహం ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. కాగా వసుంధర రాజె ప్రభుత్వం శాసనసభలో బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు అశోక్ పర్నామి స్పష్టం చేశారు. 'లలిత్ గేట్'లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ, రాజె తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'
బెంగళూరు: ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మండిపడ్డారు. రోజుకొకరి పేరు తెరపైకి తెస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం నుంచి లలిత్ మోదీ తప్పించుకోలేరని అన్నారు. 'ఈ రోజు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పేర్లు బయపెట్టిన లలిత్ మోదీ రేపు ఇంకొకరి పేరు చెబుతారు. ఆ తర్వాత మరొకరి పేరు బయటపెడతారు. గందరగోళం సృష్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. దీనిక రాజకీయ కుట్ర ఉన్నట్టు కనబడుతోంద'ని సదానందా గౌడ అన్నారు. లండన్ లో ప్రియాంక, వాద్రాలను కలిశానని ట్విటర్ లో లలిత్ మోదీ పేర్కొన్నారు. -
తన పేరుతో లేని 8 క్రెడిట్ కార్డులు వాడారు
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐపీఎల్ అధినేతగా ఉన్నప్పుడు విదేశీ బ్యాంకులకు చెందిన 8 క్రెడిట్ కార్డులను ఆయన వినియోగించినట్టు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. వీటిలో ఏ ఒక్కటీ ఆయన పేరు మీద లేకపోవడం ఆశ్చర్యపరిచే అంశం. 5 క్రెడిట్ కార్డులు లలిత్ బావమరిది సురేశ్ చెల్లారం కుటుంబ సభ్యులకు చెందినవి. రెండు సవతి కూతురు కరీమా పేరుతో ఉన్నాయి. మరోటి విజయ్ ఇష్రానీ పేరు మీద ఉంది. ఎనిమిందిలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ సర్వీసెస్ యూరప్ లిమిటెడ్, నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ పీఎల్‌సీకి చెందిన మూడేసి క్రికెట్ కార్డులు ఉన్నాయి. మరో రెండు కార్డులు వెల్ ఫార్గో బ్యాంకు, సిటీ బ్యాంకులకు చెందినవి. 2008 ఏప్రిల్ - 2011 మార్చి మధ్య కాలంలో బీసీసీఐ, ఐపీఎల్ కోసం ఈ కార్డులు వినియోగించినట్టు గుర్తించారు. తన స్నేహితుల కోసం విమాన టిక్కెట్లు, హోటళ్లు బుక్ చేసేందుకు లలిత్ ఈ కార్డులు వాడినట్టు వెల్లడైంది. లండన్ పారిపోయిన తర్వాత లలిత్ మోదీకి సంబంధించిన కార్యాలయాల నుంచి ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. 'లలిత్ గేట్'తో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. -
మోదీగేట్: ఈసారి ఎన్ని వికెట్లో?
లలిత్ మోదీ.. మన ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా ఈ పేరుకు ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం. ఐపీఎల్ సృష్టికర్తగా మోదీ ఓ వెలుగు వెలిగారు. సినీ తారలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఐపీఎల్‌ను సృష్టించారు. ఐపీఎల్ విజయవంతం కావడంలో మోదీదే కీలకపాత్ర. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా లలిత్ మోదీ స్థానం సంపాదించాడంటే ఆయన స్థాయి ఏపాటిదో ఊహించుకోవచ్చు. అయితే ఇదంతా నాణేనికి ఓ పార్శ్వం మాత్రమే. ఐపీఎల్ కమిషనర్‌గా ఎంతో కీర్తిప్రతిష్టలు సంపాదించిన మోదీ.. ఆర్థిక అవకతవకలకు పాల్పడి పాతాళానికి దిగజారారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు దేశం నుంచి పారిపోయి లండన్‌లో తలదాచుకుంటున్నారు. ఈడీ, ఐటీ విచారణలకు సహకరించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మోదీ ఎఫెక్ట్‌కు గతంలో కేంద్ర మంత్రి శశిథరూర్ మాత్రమే పదవి పోగొట్టుకోగా.. ప్రస్తుతం ఎంతో మంది పదవులు అనుమానంలో పడ్డాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్‌లో నాటి కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద్ పుష్కర్ కు వాటాలున్నాయని మోదీ బాంబు పేల్చారు. ఈ యాజమాన్యానికి శశి థరూర్ సాయం చేసినందుకు ప్రతిగా సునందకు ఉచితంగానే వాటాలు ఇచ్చారని మోదీ ఆరోపించారు. ఈ దెబ్బకు థరూర్ మంత్రి పదవి ఊడింది. ఆ తర్వాత మోదీకి కష్టాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 2010లో మోదీ లండన్ పారిపోయారు. తాజాగా లలిత్ మోదీ మరో తేనెతుట్టెను కదిపారు. ఆయనకు వీసా మంజూరు విషయంలో సాయం చేశారంటూ ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. న్యాయవాదులైన సుష్మా భర్త, కుమార్తె కూడా మోదీ సేవలోనే తరించారంటున్నారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజె పేరు కూడా మోదీ వీసా విషయంలో బయటకు వస్తోంది. వసుంధర కుమారుడు, ఎంపీ దుష్యంత్ కంపెనీలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారు. నిందితుడిగా ఉన్న మోదీకి బీజేపీ నేతలు సాయం చేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. వీరు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ తొలుత మౌనం పాటించినా ఆనక తమవారిని సమర్థించింది. ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ జిల్లాల క్రికెట్ సంఘం (డీడీసీఏ) కుంభకోణంలో ప్రమేయముందని మోదీ మరో బాంబు పేల్చారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఇక ఈడీ కేసు విచారణలో నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న మోదీని లండన్‌లో ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలిసిన సంఘటన వెలుగు చూడటం కలకలం రేపింది. రాకేష్‌పై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడంతో.. ఎన్డీయే పక్షాలు బీజేపీ, శివసేన మధ్య చిచ్చు రగిలింది. మోదీ ఈ వ్యవహారం చివరకు ఎక్కడికి దారితీస్తుందో? ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఎంతమంది పదవులు ఊడుతాయో?