
తన పేరుతో లేని 8 క్రెడిట్ కార్డులు వాడారు
ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
న్యూఢిల్లీ: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐపీఎల్ అధినేతగా ఉన్నప్పుడు విదేశీ బ్యాంకులకు చెందిన 8 క్రెడిట్ కార్డులను ఆయన వినియోగించినట్టు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. వీటిలో ఏ ఒక్కటీ ఆయన పేరు మీద లేకపోవడం ఆశ్చర్యపరిచే అంశం.
5 క్రెడిట్ కార్డులు లలిత్ బావమరిది సురేశ్ చెల్లారం కుటుంబ సభ్యులకు చెందినవి. రెండు సవతి కూతురు కరీమా పేరుతో ఉన్నాయి. మరోటి విజయ్ ఇష్రానీ పేరు మీద ఉంది. ఎనిమిందిలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ సర్వీసెస్ యూరప్ లిమిటెడ్, నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ పీఎల్సీకి చెందిన మూడేసి క్రికెట్ కార్డులు ఉన్నాయి. మరో రెండు కార్డులు వెల్ ఫార్గో బ్యాంకు, సిటీ బ్యాంకులకు చెందినవి.
2008 ఏప్రిల్ - 2011 మార్చి మధ్య కాలంలో బీసీసీఐ, ఐపీఎల్ కోసం ఈ కార్డులు వినియోగించినట్టు గుర్తించారు. తన స్నేహితుల కోసం విమాన టిక్కెట్లు, హోటళ్లు బుక్ చేసేందుకు లలిత్ ఈ కార్డులు వాడినట్టు వెల్లడైంది. లండన్ పారిపోయిన తర్వాత లలిత్ మోదీకి సంబంధించిన కార్యాలయాల నుంచి ఐటీ అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. 'లలిత్ గేట్'తో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.