సభలో నిరసనల పర్వం
మిన్నంటిన విపక్షాల నినాదాలు
* లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై కొనసాగిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు సోమవారం నాడు లోక్‌సభ విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ మూడుసార్లు వాయిదాపడినా.. మూడు గంటల పాటు సాగింది. సమావేశాల తొలి వారంలో.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలను తొలగించాలంటూ సభను స్తంభింపజేసిన విపక్షాల ఆందోళన ఐదో రోజూ యథాతథంగా కొనసాగినప్పటికీ.. స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మూడు గంటల పాటు కొనసాగించారు.
ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. ఐపీఎల్, కుల గణన వివరాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, వ్యాపమ్ అంశాలపై చర్చ కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నోటీసులు తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు.
కాంగ్రెస్ సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం వెల్‌లోకి వచ్చి నినాదాలు మొదలుపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, అది నిబంధనలకు వ్యతిరేకమని సభాపతి సభ్యులను కోరారు. 12 గంటల వరకు సభను వాయిదావేశారు. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభయ్యాక మంత్రి వెంకయ్య లేచి గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన ఇంకా కొనసాగుతోందని, ఎదురు కాల్పులు పూర్తయ్యాక హోంమంత్రి సభలో ప్రకటన చేస్తారని చెప్పారు.
సభాపతి ఈ సమయంలో జీరో అవర్‌ను ప్రారంభించగా పలువురు సభ్యులు గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన కూడా గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించబోయారు. అయితే హైకోర్టు విషయం మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చని, గురుదాస్‌పూర్ సంఘటనపై అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వబోనని స్పీకర్ చెప్పారు. దీంతో జితేందర్‌రెడ్డి ‘హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చాను.
మాకు చర్చకు అవకాశం వచ్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’ అని చెప్పి ముగించారు. గందరగోళంతో సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం నాడు రాజ్యసభ.. ఇటీవల మరణించిన సిటింగ్ బీజేడీ సభ్యుడు కల్పతరు దాస్, మాజీ సభ్యులు ఆర్.ఎస్.గవాయ్, బి.కె.హాందిక్‌లకు నివాళులు అర్పించి మంగళవారానికి వాయిదా పడింది.
‘క్యాంటీన్‌లో ధరలు పెంచొద్దు’
ఎంపీలకు చవగ్గా ఆహారాన్ని అందిస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఈ సబ్సిడీని కొనసాగించాల్సిందేనని పార్లమెంటరీ క మిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు క్యాంటీన్‌లో ధరలు పెంచితే ఆ ప్రభావం చట్టసభల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై పడుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ పేర్కొంది.
స్పీకర్ టేబుల్‌పై ప్లకార్డు ప్రదర్శన
లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాక కాంగ్రెస్ నేత ఖర్గే లేచి.. గురుదాస్‌పూర్ సంఘటనపై మాట్లాడాలనుకుంటే మా ట్లాడనివ్వలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నిరసనలు, నినాదాలు ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదని, గడచిన పదేళ్ల రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వెంకయ్య జోక్యం చేసుకుని గురుదాస్‌పూర్ సంఘటనపై రాజకీయాలు వద్దని, దేశ భద్రతకు సంబంధించిన అంశం లో జాతి మొత్తం ఒక్కటై నిలవాలని పేర్కొన్నారు.
ఈ సమయంలో సభాపతి 377 నిబంధన కింద ప్రత్యేక ప్రస్తావనలకు అనుమతించారు. గందరగోళం మధ్యనే ప్రభు త్వం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ బిల్లు 2015, 295 చట్టాలను రద్దు చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆదిర్‌రంజన్‌చౌదరి వెల్ నుం చి స్పీకర్ స్థానం వైపు ఉన్న మెట్ల మీదికి ఎక్కి స్పీకర్ టేబుల్‌పైన ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
ఆగ్రహానికి గురైన సభాపతి సభను 4 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి 4గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్.. చౌదరి సభాపతి స్థానంతో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడిపై చర్యకు ఉపక్రమిస్తూ అతడి పేరును ప్రస్తావించారు. చౌదరి లేచి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు.