vyapam
-
వ్యాపమ్‌లో స్కాంలో మరో ఆత్మహత్య
మోరినా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణంలో మరో ఆత్మహత్య చోటు చేసుకుంది. కేసులో నిందితుల జాబితాలో ఉన్న ప్రవీన్ యాదవ్ మోరినాలోని తన నివాసంలో బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) నిర్వహించే పరీక్షలో అక్రమాలకు పాల్పడటంతో వ్యాపమ్ స్కాం వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో విజయం సాధించి జాబ్ సంపాదించేందుకు పలువురు విద్యార్థుల నుంచి దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు అధికారులకు చేరాయి. గడిచిన పదేళ్లుగా ఈ కేసులో ఏదో ఒక కొత్త మలుపు తిరుగుతూనే ఉంది. కేసులో నిందితులు ఆత్మహత్య చేసుకోవడమో లేదా విద్యార్థులకు సాయం చేసిన వ్యక్తులు హత్యకు గురికావడం వంటివి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. -
సీఎంతో సంభాషణ రికార్డు చేశా
వ్యాపమ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ వెల్లడి * ఆనంద్ రాయ్, ఆయన భార్యను బదిలీ చేసిన ప్రభుత్వం * కొద్ది గంటల్లోనే యూ టర్న్ ఇండోర్: వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో తన సంభాషణను రహస్యంగా రికార్డు చేశారనే విషయం వెలుగు చూసింది. ఆగస్టు 11న సీఎం అధికారిక నివాసంలో రాత్రి 9.45 నుంచి 10.50 దాకా చౌహాన్‌తో భేటీ అయ్యానని, తమ సంభాషణను చేతి గడియారంలోని కెమెరాతో రహస్యంగా రికార్డు చేశారని ఆనంద్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం సీఎంతో తన భేటీని రహస్యంగా రికార్డు చేసి... వారికి పనికొచ్చే భాగాలనే విడుదల చేస్తుందనే ఉద్దేశంతోనే తానీ పని చేశానని, బ్లాక్మెయిల్ చేసేందుకు కాదని అన్నారు. స్కాంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డాక్టర్లయిన ఆనంద్ రాయ్, గౌరి దంపతులను ప్రభుత్వం ఇండోర్ నుంచి బదిలీ చేసింది. కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. పరపతి ఉన్న మంత్రులు, బీజేపీ నేతలపై తాను ఫిర్యాదు చేసినందువల్లే కక్షసాధించేందుకు ప్రభుత్వం తమను బదిలీ చేసిందని ఆనంద్ ఆరోపించారు. స్కాంలో తన పేరును, కుటుంబ సభ్యుల పేర్లను బయటపెట్టకూడదనే షరతుతో చౌహాన్ తమ బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించారన్నారు. సంభాషణను బయటపెడతారా? అని విలేకర్లు అడగ్గా ‘అలా చేయడం నైతికత అనిపించుకోదు’ అని రాయ్ బదులిచ్చారు. -
ఈ వారమూ ఇంతేనా!?
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారం కూడా పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలేవీ కనిపించటం లేదు. లలిత్‌గేట్, వ్యాపమ్ అంశాలకు సంబంధించి ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచీ చేస్తున్న ఆందోళన మిగిలిన 4 రోజులు సైతం కొనసాగేట్లే కనిపిస్తున్నది. బీజేపీ నిందారాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. కాంగ్రెస్ విధ్వంసక విపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయటంతో ఇరుపక్షాల మధ్య ఉద్వేగాల స్థాయి మరింత పెరిగింది. ఎప్పుడూ సాత్వికంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మునుపెన్నడూ లేనివిధంగా ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ గడువు ముగియటంతో సోమవారం కాంగ్రెస్ సభ్యులంతా లోక్‌సభకు హాజరవుతారు. అయితే సభ కొనసాగటం మాత్రం అనుమానమే. కనీసం ఈ నాలుగురోజులైనా సభను సజావుగా సాగనివ్వాలని మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన బాధ్యత తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తిరిగి సజావుగా నడపడానికి కాంగ్రెస్ పార్టీ అర్థవంతమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమైన ఎనిమిది బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ‘రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్’ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభివృద్ధి నిరోధక పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజకీయంగా దివాలా తీసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ఆలోచనలకు పార్లమెంటును వేదికగా చేసుకుందని ఆదివారం తన బ్లాగులో మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. నిరాధార అంశాలపై పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకోవడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమని నఖ్వీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. -
సభలో నిరసనల పర్వం
మిన్నంటిన విపక్షాల నినాదాలు * లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై కొనసాగిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు సోమవారం నాడు లోక్‌సభ విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ మూడుసార్లు వాయిదాపడినా.. మూడు గంటల పాటు సాగింది. సమావేశాల తొలి వారంలో.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలను తొలగించాలంటూ సభను స్తంభింపజేసిన విపక్షాల ఆందోళన ఐదో రోజూ యథాతథంగా కొనసాగినప్పటికీ.. స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మూడు గంటల పాటు కొనసాగించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. ఐపీఎల్, కుల గణన వివరాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, వ్యాపమ్ అంశాలపై చర్చ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నోటీసులు తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం వెల్‌లోకి వచ్చి నినాదాలు మొదలుపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, అది నిబంధనలకు వ్యతిరేకమని సభాపతి సభ్యులను కోరారు. 12 గంటల వరకు సభను వాయిదావేశారు. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభయ్యాక మంత్రి వెంకయ్య లేచి గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన ఇంకా కొనసాగుతోందని, ఎదురు కాల్పులు పూర్తయ్యాక హోంమంత్రి సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సభాపతి ఈ సమయంలో జీరో అవర్‌ను ప్రారంభించగా పలువురు సభ్యులు గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన కూడా గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించబోయారు. అయితే హైకోర్టు విషయం మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చని, గురుదాస్‌పూర్ సంఘటనపై అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వబోనని స్పీకర్ చెప్పారు. దీంతో జితేందర్‌రెడ్డి ‘హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చాను. మాకు చర్చకు అవకాశం వచ్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’ అని చెప్పి ముగించారు. గందరగోళంతో సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం నాడు రాజ్యసభ.. ఇటీవల మరణించిన సిటింగ్ బీజేడీ సభ్యుడు కల్పతరు దాస్, మాజీ సభ్యులు ఆర్.ఎస్.గవాయ్, బి.కె.హాందిక్లకు నివాళులు అర్పించి మంగళవారానికి వాయిదా పడింది. ‘క్యాంటీన్లో ధరలు పెంచొద్దు’ ఎంపీలకు చవగ్గా ఆహారాన్ని అందిస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఈ సబ్సిడీని కొనసాగించాల్సిందేనని పార్లమెంటరీ క మిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు క్యాంటీన్లో ధరలు పెంచితే ఆ ప్రభావం చట్టసభల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై పడుతుందని టీఆర్ఎస్ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ పేర్కొంది. స్పీకర్ టేబుల్‌పై ప్లకార్డు ప్రదర్శన లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాక కాంగ్రెస్ నేత ఖర్గే లేచి.. గురుదాస్‌పూర్ సంఘటనపై మాట్లాడాలనుకుంటే మా ట్లాడనివ్వలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నిరసనలు, నినాదాలు ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదని, గడచిన పదేళ్ల రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వెంకయ్య జోక్యం చేసుకుని గురుదాస్‌పూర్ సంఘటనపై రాజకీయాలు వద్దని, దేశ భద్రతకు సంబంధించిన అంశం లో జాతి మొత్తం ఒక్కటై నిలవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి 377 నిబంధన కింద ప్రత్యేక ప్రస్తావనలకు అనుమతించారు. గందరగోళం మధ్యనే ప్రభు త్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్లు 2015, 295 చట్టాలను రద్దు చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆదిర్రంజన్చౌదరి వెల్ నుం చి స్పీకర్ స్థానం వైపు ఉన్న మెట్ల మీదికి ఎక్కి స్పీకర్ టేబుల్‌పైన ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆగ్రహానికి గురైన సభాపతి సభను 4 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి 4గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్.. చౌదరి సభాపతి స్థానంతో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడిపై చర్యకు ఉపక్రమిస్తూ అతడి పేరును ప్రస్తావించారు. చౌదరి లేచి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. -
'కలిసి చస్తాం.. అనుమతించండి'
భోపాల్: వ్యాపం కుంభకోణం ఎవరిని దోషులను చేస్తుందో ఎవరిని నిర్దోషులగా తేలుస్తుందో అర్థం కానీ పరిస్థితి. దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న ఐదుగురు విద్యార్థులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ లేఖ రాశారు. అందులో తమను తాము చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి తప్పుచేయకున్న తోటివారితో నిత్యం దోషులుగా పరిగణించబడుతూ ఆ అవమానం భరించలేకపోతున్నామని, అందుకే గౌరవాన్ని కాపాడుకోవడం కోసమైనా చచ్చిపోయేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ప్రి మెడికల్ టెస్టులో భారీ అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చాలామంది విద్యార్థులు భారీ ముడుపులు చెల్లించి పరీక్షల్లో పాల్గొనకుండా ఇతర వ్యక్తుల ద్వారా పరీక్షలు రాయించి ప్రవేశాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపడుతున్న సంస్థ ఓ ఐదుగురు విద్యార్థులకు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరై వారు వివరణ కూడా ఇచ్చి తమ పాత్ర లేదని నిరూపించుకున్నారు. కానీ, వారు చదువుతున్న ఇన్స్టిట్యూట్లో మాత్రం ఉద్యోగస్తులు, తోటి విద్యార్థులు చిన్నచూపు చూస్తుండటం, వారిని ఇంకా కుంభకోణానికి పాల్పడినవారిలా చూడటంతో మానసికంగా ప్రతి రోజు కుంగిపోయారు. ఏం చేయాలో పాలుపోక.. గతంలో తమకు ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవం ఇప్పించాలని, లేదంటే తాము ఐదుగురం కలిసి చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి లేఖ పంపించారు. -
మాజీ మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: వ్యాపం స్కాంలో మధ్యప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వ్యాపం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లక్ష్మీకాంత్‌తో పాటు ఆయన సహాయకుడు ఓ ప్రకాశ్ శుక్లాపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. వ్యాపం స్కాంలో సీబీఐ అధికారులు ఇప్పటి వరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తం 52 మందిపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. నేరిపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2012లో జరిగిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపం స్కాంలో సంబంధంఉన్న వారు 40 మందికి పైగా అనుమానాస్పద స్థితిలో మరణించారు. -
‘వ్యాపమ్’ చార్జిషీట్లకు ఓకే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యాపమ్ కుంభకోణంలో అన్ని కేసులను సీబీఐకి బదలాయించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ చార్జిషీట్లను దాఖలు చేసేందుకు మధ్యప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్‌ను సోమవారం విచారించిన సుప్రీంకోర్టు చార్జిషీట్ల దాఖలుకు అనుమతినిచ్చింది. విచారణను జూలై 24కు వాయిదా వేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది సిబల్.. సీబీఐకి వివరణ ఇవ్వడానికి మరింత గడువు కావాలన్నారు. కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటినీ సీబీఐకి బదలాయించాలని ఈ నెల 9న కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆ కేసు అంతు తేల్చేందుకు 40 మంది
భోపాల్: దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసును పరిష్కరించేందుకు సీబీఐ వేగంగా ముందుకు కదులుతోంది. ఆ శాఖకు చెందిన 40 మంది అధికారులు మరికొన్ని గంటల్లో మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. వీరందరికి జాయింట్ డైరెక్టరేట్ లెవల్ అధికారి సారథ్యం వహించనున్నారు. అయితే, ఆ అధికారులు ఎవరనే సమాచారం మాత్రం సీబీఐ బయటకు వెల్లడించలేదు. కనీసం సారథ్యం వహించే వ్యక్తి పేరును కూడా తెలియజేయలేదు. మరోపక్క, బీహార్‌కు చెందిన ఓ అధికారి ఈ టీంకు నేతృత్వం వహిస్తున్నారని వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవాలు, ఆధారాలు లేనివని ఖండించారు. మధ్యప్రదేశ్‌లో ఉన్నత స్ధాయి ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో భారీ స్థాయి కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు ప్రముఖులు నిందితులు ఉండగా వారిలో ఒక్కోక్కరు అనుమానాస్పద స్థితిలో చనిపోతుండటంతో దేశంలోనే సంచలనాత్మ కేసుగా మిగిలింది. దీంతో ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని కేసును సీబీఐకి అప్పగించడంతో విచారణ ప్రారంభమైంది. -
వ్యాపమ్‌పై సీబీ‘ఐ’
కేసుతో సంబంధమున్న వారి వరుస అసహజ, అనుమానాస్పద మరణాలతో దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్ టీఎఫ్ లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్కామ్‌తో పాటు అనుమానాస్పద మరణాలపైనా దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం దర్యాప్తు పర్యవేక్షణపై 24న నిర్ణయం * సోమవారం నుంచి సీబీఐ పని షురూ * మధ్యప్రదేశ్ గవర్నర్ తొలగింపుపై కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు న్యూఢిల్లీ: అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘వ్యాపమ్’ స్కాం దర్యాప్తును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో అక్రమ నియామకాల భారీ కుంభకోణంతో పాటు ఆ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అనుమానాస్పద మరణాలకు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసులపై స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది. ఇప్పటివరకు ఆ కేసులను విచారిస్తున్న సిట్, ఎస్టీఎఫ్లను ఆ బాధ్యత నుంచి తప్పించి, ఆ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసింది. స్కామ్‌లో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ పాత్ర ఉందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తొలగించడానికి సంబంధించి స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం వెలుగుచూడడానికి కారకులైన ఆశిష్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే, ఆప్ నేత కుమార్ విశ్వాస్ సహా పలువురు దాఖలు చేసిన వ్యాపమ్ సంబంధిత పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పై ఆదేశాలు జారీ చేసింది. వ్యాపమ్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ రామ్‌నరేశ్ ను ఆ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని, స్కామ్‌ను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని ఆ దావాల్లో పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు. హైకోర్టు.. చేతులు దులిపేసుకుంది! అంతకుముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. అనుమానాస్పద మరణాలు సహా అన్ని వ్యాపమ్ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో, ఈ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసిన ధర్మాసనం.. సోమవారం నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొంది. జూలై 24న కోర్టుకు తొలి నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశిస్తూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంపై జూలై 24న సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు విచారణ జరపనుందనే కారణం చూపుతూ వ్యాపమ్‌ను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసిన విషయాన్ని అటార్నీ జనరల్ ప్రస్తావించగా.. ‘అలా హైకోర్టు చేతులు దులిపేసుకుంది’ అని ధర్మాసనం పేర్కొది. పిటిషన్‌దార్ల తరఫున వాదనలకు హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తన్ఖా.. స్కాం దర్యాప్తు పర్యవేక్షణలో హైకోర్టు తీరును తప్పుబడుతూ, భవిష్యత్ దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా ధర్మాసనం అడ్డుకుంది. ‘ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి వచ్చింది కదా! ఇక ఈ విషయంలో హైకోర్టు ఎలా ముందుకెళ్తుంది? కచ్చితంగా వెళ్లదు! ఆ విషయం వాళ్ల(హైకోర్టు)కు తెలీదా?’ అని వ్యాఖ్యానించింది. అధికరణ 361(2)ను కారణంగా చూపుతూ.. ఈ కేసులో నిందితుడైన గవర్నర్ రామ్‌నరేశ్‌పై ఎఫ్ఐఆర్ నమోదును హైకోర్టు అడ్డుకుందని, గవర్నర్ పదవి గౌరవాన్ని కాపాడాలంటే ఆయన రాజీనామా చేయాలని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై.. ఆ విషయంపై ఇప్పుడు తామేమీ మాట్లాడబోమంటూ ధర్మాసనం స్పందించింది. స్కాం తీవ్రతను వివరిస్తూ.. రోజుకొకరు చనిపోతున్నారని సిబల్ పేర్కొనగా.. మృతుల సంఖ్యను 36 నుంచి 38కి పెరగనివ్వబోమని కోర్టు హామీ ఇచ్చింది. దానికి, మృతుల సంఖ్య 36 కాదు 49 అని సిబల్ పేర్కొనగా, పిటిషన్లో 36 అనే ఉందని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు వివరించారు. ఇదిలా ఉండగా, వ్యాపమ్ కేసుల్లో సాక్షిగా ఉన్న సంజయ్ సింగ్‌యాదవ్(35) కాలేయసంబంధ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 8న చనిపోయాడని ఇప్పటివరకు స్కామ్‌పై దర్యాప్తు జరుపుతున్న ఎస్టీఎఫ్ గురువారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది. సీబీఐకి తలకు మించిన భారం వ్యాపమ్ దర్యాప్తు సీబీఐకి పెద్ద పనే పెట్టనుంది. వందలాది వ్యాపమ్ కేసులను అధ్యయనం చేయడం, వేలాది నిందితులు, సాక్షులను విచారించడం, నివేదికల తయారీ భారీ కసరత్తు కాగా.. స్కామ్ మరణాల దర్యాప్తు, వాటి వెనక పెద్దల హస్తాలను వెలికి తీయడం మరో పెద్ద కార్యక్రమం. సిబ్బంది కొరతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సీబీఐకి ఇది తలకు మించిన బరువే. అదీకాక ఇప్పటికే సీబీఐ ముందు 6,562 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ వ్యాపమ్ దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వాగతించారు. దీంతో తన హృదయంపై భారం దిగిందన్నారు. దర్యాప్తును త్వరగా ప్రారంభించి, నిజాలను ప్రజలకు వెల్లడి చేయాలని సీబీఐని కోరారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ తొలగింపునకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. గవర్నర్ భవితవ్యంపైనే చర్చించినట్లు సమాచారం. మీ సాయం అక్కర్లేదు * ఎంపీ సీఎంతో జర్నలిస్టు అక్షయ్ కుటుంబం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అవసరం లేదని వ్యాపమ్ మృతుడు, జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబం తేల్చిచెప్పింది. తమను పరామర్శించేందుకు వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో.. అక్షయ్ మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపితే చాలంది. ‘ఇంట్లోంచి వెళ్లినప్పుడు నా కుమారుడు ఆరోగ్యంగా. ఇంతలోనే ఏం జరిగింది? ఎందుకు చనిపోయాడు? అని అక్షయ్ తల్లి నిలదీసింది. కొన్ని రోజుల క్రితం స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లిన అక్షయ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని నమ్రత కుటుంబసభ్యులను ఇంటర్వ్యూ చేసిన కాసేపటికే నురగలు కక్కుకుంటూ చనిపోయిన విషయం తెలిసిందే. ఈ పాపం ఎవరిది? ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికి ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(పీఈబీ)’ అన్న పేరూ ఉంది. మధ్యప్రదేశ్‌లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించడం దీని బాధ్యతలు. 2007-2013: రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షనూ వదలకుండా.. చివరకు బ్యాంకు పరీక్షల్లో సైతం అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, నాయకులు, ప్రతి రంగంలోనూ ఈ స్కాం మాఫియాకు ప్రతినిధులున్నారు. 2008-2013: ఈ కాలంలో మెడికల్ కాలేజీల్లో 1,087 మంది అనర్హులైన విద్యార్థులు సీట్లు పొందారని, వేలాది మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా నిర్ధారించాయి. 2013: ఈ ప్రీ మెడికల్ టెస్ట్ స్కాంను ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది బయటపెట్టారు. * ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. * హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు. * అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు. * ఇటీవలి కొద్దిరోజుల్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో సీబీఐ దర్యాప్తుకు అన్నివైపుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది. మోదీజీ జవాబివ్వండి! ‘నేను తినను.. ఎవరినీ తిననివ్వను’ అంటూ అవినీతిపై ఊదరగొట్టిన ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, రాజస్తాన్‌లో అవినీతిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడంపై సీపీఐ సంతృప్తి వ్యక్తంచేసింది. స్కామ్‌లో నిందితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ గవర్నర్‌ను తక్షణమే తొలగించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి శివరాజ్ సింగ్ కూడా వైదొలగాలన్నారు. -
మంత్రిగా నాకే పిచ్చెక్కిపోతోంది...
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కిల్లింగ్ స్కాం 'వ్యాపమ్' మృత్యుహేల సొంతపార్టీ మంత్రులనే గజగజ వణికిస్తోందా? వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉమాభారతి మీడియాతో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే అలానే అనిపిస్తుంది. 'మంత్రిగా ఉన్ననాకే పిచ్చెక్కిపోతోంది. చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా పేరు కూడా వ్యాపమ్ కేసు ఎఫ్ఐఆర్లో ఉంది. ఇక అమాయకుల పరిస్థితి ఏంటని' ఉమాభారతి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో స్పందించి ఏదైనా చేయాలని ఆమె సూచించారు. వ్యాపమ్ స్కాంలో జర్నలిస్టు, నిందితులు, సాక్షులు, విచారణాధికారుల వరుస అనుమానాస్పద మరణాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో ఆయన ఏదో ఒక పరిష్కారాన్ని చూడాలి. ఈ సంక్షోభం నుంచి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బయటపడేయాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రిగా ఉన్ననాకే ఇంత భయంగా ఉంటే , ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోగలనన్నారు. తమ ఆందోళనను, ఆవేదనను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళతానన్నారు. మరోవైపు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న అరుణ్ జైట్లీ డిమాండ్‌కు మద్దతు తెలియజేసిన మంత్రి సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాలను నిగ్గుదేల్చాలని డిమాండ్ చేశారు. కాగా 2002 నాటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాల వ్యాపమ్ కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి కూడా ఒకరు. -
'అన్ని మరణాలను కుంభకోణానికి ముడిపెట్టొద్దు'