మంత్రిగా నాకే పిచ్చెక్కిపోతోంది...
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న కిల్లింగ్ స్కాం 'వ్యాపమ్' మృత్యుహేల సొంతపార్టీ మంత్రులనే గజగజ వణికిస్తోందా? వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఉమాభారతి మీడియాతో చేసిన వ్యాఖ్యల్ని గమనిస్తే అలానే అనిపిస్తుంది.
'మంత్రిగా ఉన్ననాకే పిచ్చెక్కిపోతోంది. చచ్చిపోతానేమోనని చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా పేరు కూడా వ్యాపమ్ కేసు ఎఫ్ఐఆర్లో ఉంది. ఇక అమాయకుల పరిస్థితి ఏంటని' ఉమాభారతి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో స్పందించి ఏదైనా చేయాలని ఆమె సూచించారు.
వ్యాపమ్ స్కాంలో జర్నలిస్టు, నిందితులు, సాక్షులు, విచారణాధికారుల వరుస అనుమానాస్పద మరణాలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. శివరాజ్ సింగ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్రంలో విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కుంభకోణంలో ఆయన ఏదో ఒక పరిష్కారాన్ని చూడాలి. ఈ సంక్షోభం నుంచి పార్టీని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను బయటపడేయాలని మంత్రి పేర్కొన్నారు. మంత్రిగా ఉన్ననాకే ఇంత భయంగా ఉంటే , ఇక సామాన్యుల పరిస్థితిని అర్థం చేసుకోగలనన్నారు. తమ ఆందోళనను, ఆవేదనను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ దృష్టికి తీసుకెళతానన్నారు.
మరోవైపు సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న అరుణ్ జైట్లీ డిమాండ్కు మద్దతు తెలియజేసిన మంత్రి సీబీఐ దర్యాప్తు ద్వారా నిజాలను నిగ్గుదేల్చాలని డిమాండ్ చేశారు. కాగా 2002 నాటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాల వ్యాపమ్ కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు తదితరులు నిందితులుగా ఉన్నారు. వీరిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి కూడా ఒకరు.