►అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్‌ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్‌మెంట్‌ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు తీసుకున్నారు.
► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.
విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష‍్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్‌ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష‍్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు.
మరోవైపు కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment