'కలిసి చస్తాం.. అనుమతించండి'
భోపాల్: వ్యాపం కుంభకోణం ఎవరిని దోషులను చేస్తుందో ఎవరిని నిర్దోషులగా తేలుస్తుందో అర్థం కానీ పరిస్థితి. దేశ వ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న ఐదుగురు విద్యార్థులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ లేఖ రాశారు. అందులో తమను తాము చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి తప్పుచేయకున్న తోటివారితో నిత్యం దోషులుగా పరిగణించబడుతూ ఆ అవమానం భరించలేకపోతున్నామని, అందుకే గౌరవాన్ని కాపాడుకోవడం కోసమైనా చచ్చిపోయేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
మధ్యప్రదేశ్లో నిర్వహించిన ప్రి మెడికల్ టెస్టులో భారీ అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో చాలామంది విద్యార్థులు భారీ ముడుపులు చెల్లించి పరీక్షల్లో పాల్గొనకుండా ఇతర వ్యక్తుల ద్వారా పరీక్షలు రాయించి ప్రవేశాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపడుతున్న సంస్థ ఓ ఐదుగురు విద్యార్థులకు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.
విచారణకు హాజరై వారు వివరణ కూడా ఇచ్చి తమ పాత్ర లేదని నిరూపించుకున్నారు. కానీ, వారు చదువుతున్న ఇన్స్టిట్యూట్లో మాత్రం ఉద్యోగస్తులు, తోటి విద్యార్థులు చిన్నచూపు చూస్తుండటం, వారిని ఇంకా కుంభకోణానికి పాల్పడినవారిలా చూడటంతో మానసికంగా ప్రతి రోజు కుంగిపోయారు. ఏం చేయాలో పాలుపోక.. గతంలో తమకు ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవం ఇప్పించాలని, లేదంటే తాము ఐదుగురం కలిసి చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతి లేఖ పంపించారు.