వ్యాపమ్‌పై సీబీ‘ఐ’ | Cracking conspiracy, nabbing bigwigs: Vyapam scam will test CBI | Sakshi
Sakshi News home page

వ్యాపమ్‌పై సీబీ‘ఐ’

Published Fri, Jul 10 2015 12:36 AM | Last Updated on Mon, Oct 8 2018 3:31 PM

వ్యాపమ్‌పై సీబీ‘ఐ’ - Sakshi

వ్యాపమ్‌పై సీబీ‘ఐ’

కేసుతో సంబంధమున్న వారి వరుస అసహజ, అనుమానాస్పద మరణాలతో దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తున్న మధ్యప్రదేశ్ వ్యాపమ్ కుంభకోణాన్ని సీబీఐ దర్యాప్తు చేయనుంది. మధ్యప్రదేశ్ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు, పోలీసు, రెవెన్యూ, తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో చోటుచేసుకున్న ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసులన్నింటి నుంచీ సిట్, ఎస్ టీఎఫ్ లను సుప్రీంకోర్టు తప్పించింది. ఈ కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ... స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

స్కామ్‌తో పాటు అనుమానాస్పద మరణాలపైనా దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశం
దర్యాప్తు పర్యవేక్షణపై 24న నిర్ణయం
* సోమవారం నుంచి సీబీఐ పని షురూ
* మధ్యప్రదేశ్ గవర్నర్ తొలగింపుపై కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: అంతు చిక్కని మరణాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘వ్యాపమ్’ స్కాం దర్యాప్తును సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. మధ్యప్రదేశ్ మెడికల్ కాలేజీల్లో అక్రమ ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగాల్లో అక్రమ నియామకాల భారీ కుంభకోణంతో పాటు ఆ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న అనుమానాస్పద మరణాలకు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసులపై స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది.

ఇప్పటివరకు ఆ కేసులను విచారిస్తున్న సిట్, ఎస్‌టీఎఫ్‌లను ఆ బాధ్యత నుంచి తప్పించి, ఆ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసింది. స్కామ్‌లో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్ పాత్ర ఉందన్న ఆరోపణలున్న నేపథ్యంలో ఆయనపై ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గవర్నర్ పదవి నుంచి ఆయనను తొలగించడానికి సంబంధించి స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది.

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్,  స్కాం  వెలుగుచూడడానికి కారకులైన ఆశిష్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే, ఆప్ నేత కుమార్ విశ్వాస్ సహా పలువురు దాఖలు చేసిన వ్యాపమ్ సంబంధిత పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పై ఆదేశాలు జారీ చేసింది. వ్యాపమ్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ రామ్‌నరేశ్ ను ఆ పదవి నుంచి తొలగించేలా ఆదేశించాలని, స్కామ్‌ను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని ఆ దావాల్లో పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును అభ్యర్థించారు.
 
హైకోర్టు.. చేతులు దులిపేసుకుంది!
అంతకుముందు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ.. అనుమానాస్పద మరణాలు సహా అన్ని వ్యాపమ్ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో, ఈ కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేసిన ధర్మాసనం.. సోమవారం నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొంది. జూలై 24న కోర్టుకు తొలి నివేదిక అందజేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై రెండు వారాల్లోగా స్పందించాలని ఆదేశిస్తూ సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

ఈ విషయంపై జూలై 24న సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ధర్మాసనం విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు విచారణ జరపనుందనే కారణం చూపుతూ వ్యాపమ్‌ను సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పటిషన్ల విచారణను హైకోర్టు వాయిదా వేసిన విషయాన్ని అటార్నీ జనరల్ ప్రస్తావించగా.. ‘అలా హైకోర్టు చేతులు దులిపేసుకుంది’ అని ధర్మాసనం పేర్కొది.

పిటిషన్‌దార్ల తరఫున వాదనలకు హాజరైన సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ, వివేక్ తన్ఖా.. స్కాం దర్యాప్తు పర్యవేక్షణలో హైకోర్టు తీరును తప్పుబడుతూ, భవిష్యత్ దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా ధర్మాసనం అడ్డుకుంది. ‘ఇప్పుడు సుప్రీంకోర్టు రంగంలోకి వచ్చింది కదా! ఇక ఈ విషయంలో హైకోర్టు ఎలా ముందుకెళ్తుంది? కచ్చితంగా వెళ్లదు! ఆ విషయం వాళ్ల(హైకోర్టు)కు తెలీదా?’ అని వ్యాఖ్యానించింది. అధికరణ 361(2)ను కారణంగా చూపుతూ.. ఈ కేసులో నిందితుడైన గవర్నర్ రామ్‌నరేశ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదును హైకోర్టు అడ్డుకుందని, గవర్నర్ పదవి గౌరవాన్ని కాపాడాలంటే ఆయన రాజీనామా చేయాలని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై..

ఆ విషయంపై ఇప్పుడు తామేమీ మాట్లాడబోమంటూ ధర్మాసనం స్పందించింది. స్కాం తీవ్రతను వివరిస్తూ.. రోజుకొకరు చనిపోతున్నారని సిబల్ పేర్కొనగా.. మృతుల సంఖ్యను 36 నుంచి 38కి పెరగనివ్వబోమని కోర్టు హామీ ఇచ్చింది. దానికి, మృతుల సంఖ్య 36 కాదు 49 అని సిబల్ పేర్కొనగా, పిటిషన్‌లో 36 అనే ఉందని జస్టిస్ హెచ్ ఎల్ దత్తు వివరించారు. ఇదిలా ఉండగా, వ్యాపమ్ కేసుల్లో సాక్షిగా ఉన్న సంజయ్ సింగ్‌యాదవ్(35) కాలేయసంబంధ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి 8న చనిపోయాడని ఇప్పటివరకు స్కామ్‌పై దర్యాప్తు జరుపుతున్న ఎస్‌టీఎఫ్ గురువారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు తెలిపింది.
 
సీబీఐకి తలకు మించిన భారం
వ్యాపమ్ దర్యాప్తు సీబీఐకి పెద్ద పనే పెట్టనుంది.  వందలాది వ్యాపమ్ కేసులను అధ్యయనం చేయడం, వేలాది నిందితులు, సాక్షులను విచారించడం,  నివేదికల తయారీ  భారీ కసరత్తు కాగా.. స్కామ్ మరణాల దర్యాప్తు, వాటి వెనక పెద్దల హస్తాలను వెలికి తీయడం మరో పెద్ద కార్యక్రమం.  సిబ్బంది కొరతతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న సీబీఐకి ఇది తలకు మించిన బరువే. అదీకాక ఇప్పటికే సీబీఐ ముందు 6,562 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
 
రాష్ట్రపతితో రాజ్‌నాథ్ భేటీ
వ్యాపమ్ దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వాగతించారు. దీంతో తన హృదయంపై భారం దిగిందన్నారు. దర్యాప్తును త్వరగా ప్రారంభించి, నిజాలను ప్రజలకు వెల్లడి చేయాలని సీబీఐని కోరారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ తొలగింపునకు సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.  గవర్నర్ భవితవ్యంపైనే చర్చించినట్లు సమాచారం.
 
మీ సాయం అక్కర్లేదు
* ఎంపీ సీఎంతో జర్నలిస్టు అక్షయ్ కుటుంబం

మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి తమకెలాంటి సాయం అవసరం లేదని వ్యాపమ్ మృతుడు, జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ కుటుంబం తేల్చిచెప్పింది. తమను పరామర్శించేందుకు వచ్చిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో.. అక్షయ్ మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు జరిపితే చాలంది. ‘ఇంట్లోంచి వెళ్లినప్పుడు నా కుమారుడు ఆరోగ్యంగా. ఇంతలోనే ఏం జరిగింది? ఎందుకు చనిపోయాడు? అని అక్షయ్ తల్లి నిలదీసింది. కొన్ని రోజుల క్రితం స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లిన అక్షయ్ అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని నమ్రత  కుటుంబసభ్యులను ఇంటర్వ్యూ చేసిన కాసేపటికే నురగలు కక్కుకుంటూ చనిపోయిన విషయం తెలిసిందే.
 
ఈ పాపం ఎవరిది?

‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికి ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(పీఈబీ)’ అన్న పేరూ ఉంది. మధ్యప్రదేశ్‌లో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు నిర్వహించడం దీని బాధ్యతలు.
 
2007-2013: రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షనూ వదలకుండా.. చివరకు బ్యాంకు పరీక్షల్లో సైతం అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, నాయకులు, ప్రతి రంగంలోనూ ఈ స్కాం మాఫియాకు ప్రతినిధులున్నారు.  
 
2008-2013: ఈ కాలంలో మెడికల్ కాలేజీల్లో 1,087 మంది అనర్హులైన విద్యార్థులు సీట్లు పొందారని, వేలాది మంది అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని దర్యాప్తు సంస్థలు ఇప్పటిదాకా నిర్ధారించాయి.
 
2013: ఈ ప్రీ మెడికల్ టెస్ట్ స్కాంను ఇండోర్‌కు చెందిన ప్రజా వేగు డాక్టర్ ఆనంద్ రాయ్, గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిశ్ చతుర్వేది బయటపెట్టారు.
* ఈ స్కాంలో గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
* హైకోర్టు ఆదేశాలతో సిట్, ఎస్‌టీఎఫ్ 2013లో దర్యాప్తు చేపట్టాయి. ఇప్పటిదాకా ఈ స్కాంకు సంబంధించి దాదాపు 2 వేల మందిని అరెస్టు చేశారు.
* అయితే కేసు నిందితుల్లో ఒకరైన గవర్నర్ కుమారుడు శైలేశ్ యాదవ్‌తో సహా కేసుకు సంబంధం ఉన్న 46 మంది అసహజ, అనుమానాస్పద రీతిలో మరణించారు.
* ఇటీవలి కొద్దిరోజుల్లో వరుస మరణాలు సంభవిస్తుండటంతో సీబీఐ దర్యాప్తుకు అన్నివైపుల నుంచి ఒత్తిడి తీవ్రమైంది.
 
మోదీజీ జవాబివ్వండి!

‘నేను తినను.. ఎవరినీ తిననివ్వను’ అంటూ అవినీతిపై ఊదరగొట్టిన ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, రాజస్తాన్‌లో అవినీతిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడంపై సీపీఐ సంతృప్తి వ్యక్తంచేసింది. స్కామ్‌లో నిందితుడిగా ఉన్న మధ్యప్రదేశ్ గవర్నర్‌ను తక్షణమే తొలగించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి శివరాజ్ సింగ్ కూడా వైదొలగాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement