ఈ వారమూ ఇంతేనా!?
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారం కూడా పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలేవీ కనిపించటం లేదు. లలిత్‌గేట్, వ్యాపమ్ అంశాలకు సంబంధించి ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచీ చేస్తున్న ఆందోళన మిగిలిన 4 రోజులు సైతం కొనసాగేట్లే కనిపిస్తున్నది. బీజేపీ నిందారాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. కాంగ్రెస్ విధ్వంసక విపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
గతవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయటంతో ఇరుపక్షాల మధ్య ఉద్వేగాల స్థాయి మరింత పెరిగింది. ఎప్పుడూ సాత్వికంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మునుపెన్నడూ లేనివిధంగా ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ గడువు ముగియటంతో సోమవారం కాంగ్రెస్ సభ్యులంతా లోక్‌సభకు హాజరవుతారు. అయితే సభ కొనసాగటం మాత్రం అనుమానమే. కనీసం ఈ నాలుగురోజులైనా సభను సజావుగా సాగనివ్వాలని మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ తన బాధ్యత తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తిరిగి సజావుగా నడపడానికి కాంగ్రెస్ పార్టీ అర్థవంతమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమైన ఎనిమిది బిల్లులు పార్లమెంట్‌లో పాస్ అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.
‘రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్’
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభివృద్ధి నిరోధక పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజకీయంగా దివాలా తీసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ఆలోచనలకు పార్లమెంటును వేదికగా చేసుకుందని ఆదివారం తన బ్లాగులో మండిపడ్డారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. నిరాధార అంశాలపై పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకోవడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమని నఖ్వీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు.