Lalitget
-
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
-
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
లలిత్‌గేట్‌పై లోక్‌సభలో విపక్ష, ప్రభుత్వాల వాగ్యుద్ధం ♦ సమావేశాలు ముగిసే తరుణంలో లలిత్‌గేట్‌పై వాడివేడిగా చర్చ ♦ కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి సరేనన్న సర్కారు ♦ సుష్మా ‘మానవతా సాయం’ ప్రకటనను తిరస్కరించిన కాంగ్రెస్ ♦ చట్టప్రకారం సాయం చేసి ఉండొచ్చని.. రహస్యం ఎందుకని ప్రశ్న ♦ లలిత్‌మోదీకి సాయం చేశారని మీరే ఒప్పుకున్నారు.. అదే సాక్ష్యం ♦ అధికార దుర్వినియోగం చేసినందుకు పదవికి రాజీనామా చేయాలి ♦ మోదీ సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత ఖర్గే న్యూఢిల్లీ:లలిత్‌మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ సభలో ఆందోళనకు దిగటంతో ఇప్పటివరకూ స్తంభించిపోయిన లోక్‌సభలో బుధవారం ఆ వివాదంపై వాడివేడిగా చర్చ జరిగింది. మరో రోజులో సమావేశాలు ముగిసిపోనుండగా.. ఈ వివాదంపై ‘వాయిదా తీర్మానం చర్చ’కు ప్రభుత్వ, ప్రతిపక్షాలు అంగీకరించాయి. బుధవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత.. లలిత్‌మోదీ వివాదంపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు వెల్‌లోకి వెళ్లి రాజీనామా డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షం డిమాండ్ మేరకు వాయిదా తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సుష్మా స్వయంగా స్పీకర్‌ను కోరారు. చర్చలో కేవలం ప్రతిపక్షమే పాల్గొననీయండని.. తాను సమాధానం చెప్పేటపుడు ప్రతిపక్షం సభలో ఉండాలని మాత్రమే తాను కోరుతున్నానని పేర్కొన్నారు. కానీ.. చర్చ జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరు కావాలని.. ఆయన సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘ప్రధాని హాజరు కాకుండా.. చర్చకు సమాధానం ఇవ్వకుండా.. మంత్రిపై చర్యలు ఎలా చేపట్టగలరు?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వాయిదా తీర్మానం కింద చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సభలో పేర్కొన్నారు. దీంతో.. వాయిదా తీర్మానానికి తనకు అభ్యంతరం లేదని.. అయితే దానిని సభ నియమాల ప్రాతిపదికనే చేపట్టటం జరుగుతుందని స్పీకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటికే దానిని తిరస్కరించినందున.. దానిపై ప్రశ్నోత్తరాల తర్వాత మాత్రమే దానిపై చర్చించగలమని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే చర్చ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడికి సుష్మా సాయం చేశారని.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఆరోపణలకు సుష్మాస్వరాజ్ బదులిచ్చారు. రాహుల్ విమర్శలనూ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. అనంతరం పలు పార్టీల సభ్యులతో పాటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌పై, ప్రధానమంత్రిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. చివరిగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చర్చకు బదులిచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమంటూ సుష్మా రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగా..వాయిదా తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. సుష్మా సమాధానాన్ని శ్రద్ధగా విన్న సోనియా... సుష్మా సమాధానం చెప్పటం ప్రారంభించగానే.. కాంగ్రెస్ సభ్యులు అందుకు వ్యతిరేకిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు ప్రారంభించారు. బీజేపీ సభ్యురాలిగా జోక్యం చేసుకునే స్వేచ్ఛ సుష్మాకు ఉందని స్పీకర్ మహాజన్ పేర్కొన్నారు. చర్చకు ఆర్థికమంత్రి జైట్లీ బదులిస్తారని.. అయితే దీనిపై మాట్లాడే స్వేచ్ఛ సుష్మాకు ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ‘‘ఖర్గే గంటసేపు సుష్మాపై విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ఆమె చెప్పేదానిని వినాలి.’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య సుష్మా మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా హెడ్‌ఫోన్ ధరించి ఆమె మాటలను శ్రద్ధగా వినటం కనిపించింది. లలిత్‌పై సానుభూతి చూపవద్దు... క్రికెట్ అభిమానుల మనోభావాలను లలిత్‌మోదీ దుర్వినియోగం చేశారని అన్నా డీఎంకే సభ్యుడు పి.వేణుగోపాల్ విమర్శించారు. లలిత్ తన భార్య బాగోగులు చూసుకోవటానికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతించినప్పటికీ.. ఆయన తన భార్యను చూసుకోవటానికి బదులుగా రిసార్టుల్లో కాలం గడుపుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఆయన విషయంలో ప్రభుత్వం ఎటువంటి సానుభూతీ చూపరాదని.. కఠిన చర్యలు చేపట్టాలని.. వేణుగోపాల్ సూచించారు. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యానికి ఆలయం అయినందున.. దేశాన్ని కదిలిస్తున్న అంశాలపై ఇక్కడ శాంతియుత వాతావరణంలో చర్చ జరగాలని టీఎంసీ నేత దినేశ్త్రివేది పేర్కొన్నారు. ఒకరు ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో కట్టుబడి ఉండరాదని.. దేశానికి కట్టుబడి ఉండాలని బీజేడీ నేత భర్తృహరి మహతాబ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు.. ఇటీవల మరణించిన మాజీ ఎంపీలు బలేశ్వర్రామ్, జగన్నాథ్సింగ్లకు సభ సంతాపం తెలిపింది. లలిత్‌మోదీకి మానవతా ప్రాతిపదికన సాయం చేశానంటూ సుష్మాస్వరాజ్ సమర్థించుకోవటాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది. కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే చర్చను ప్రారంభిస్తూ.. లలిత్‌మోదీకి సాయంపై సుష్మా చేసిన ప్రకటనలో లోపాలను ఎత్తిచూపారు. ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దర్యాప్తు చేస్తున్న పరారీలో ఉన్న నిందితుడికి సాయం చేయటానికి ఆమె ఎందుకు అంగీకరించారంటూ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ఆయనకు మానవతా ప్రాతిపదిక సాయం చేశానని మీరు చెప్పారు. మీరు మానవతా ప్రాతిపదికన సాయం చేయాలనుకున్నట్లయితే.. అది చట్టబద్ధంగా చేసి ఉండవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘ఆయన పాస్‌పోర్టును పునరుద్ధరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు అప్పీలు చేయలేదు? హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు చేయకుండా ఉండటానికి.. ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రుల్లో ఎవరిది బాధ్యత?’’ అని ప్రశ్నించారు. లలిత్‌మోదీ పోర్చుగల్‌లో అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు ప్రయాణ పత్రాలు జారీ చేసినట్లయితే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపబోదని బ్రిటిష్ రాయబారి అడిగిన ప్రశ్నకు తాను మౌఖికంగానే సమాధానం చెప్పానన్న సుష్మా వాదనను కూడా ఖర్గే తోసిపుచ్చారు. ‘‘అది సిఫారసు చేయటం కాదా? ఆమె కనీసం తన మంత్రిత్వశాఖ అధికారులతో కూడా ఈ అంశంపై మాట్లాడలేదు’’ అని తప్పుపట్టారు. లలిత్‌మోదీ ప్రయాణ పత్రాలు కోరటానికి చూపిన మూడు కారణాల్లో.. తన భార్య అనారోగ్యం అనేది అసలు మొదటి కారణమే కాదని.. ఆయన ఆ అనుమతిని ప్రతి చోటా రిసార్టులకు వెళ్లటానికి వాడుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. ‘‘లలిత్‌మోదీని భారత్‌కు తిప్పిపంపించాలని, ఆయనకు ప్రయాణ పత్రాలు ఇస్తే అది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని నాటి ఆర్థికమంత్రి పి.చిదంబరం బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పారు. కానీ.. లలిత్‌మోదీకి ప్రయాణ పత్రాలు ఇవ్వటం వల్ల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం ఉండబోదని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పటం ద్వారా సుష్మా ఈ అంశంపై భారత ప్రభుత్వ విధానాన్ని మార్చివేశారు’’ అని తప్పుపట్టారు. ‘‘ఐపీఎల్ క్రీడా నిర్వహణలో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న లలిత్‌మోదీ కోసం సుష్మా భర్త, ఆమె కుమార్తె పనిచేస్తున్నారు. అధికార దుర్వినియోగం అంశంలో సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందే. లలిత్‌మోదీకి మీరు సాయం చేయటం.. ఆయనతో మీకు గల బలమైన సంబంధాన్ని చూపుతోంది. మీ సంబంధం ఆర్థికమైనది.మీరు ఆయనకు చేసింది ఉపకారం. మీపై మా ఆరోపణ ఇదే. మీరు సాయం చేశారని అంగీకరించారు. మీ అంగీకారమే సాక్ష్యం. కాబట్టి.. మీ రాజీనామాను మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. లలిత్‌మోదీకి సాయం చేసిన అంశంపై బీజేపీ ముఖ్యమంత్రి ఒకరిపై కూడా మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే.. ఆ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. వంశ చరిత్ర చదువుకో... రాహుల్... మీకు సెలవులంటే ఇష్టం కదా. ఈసారి అలాంటి సుదీర్ఘ సెలవుపై వెళ్లినపుడు వంశచరిత్ర చదువుకోండి. వచ్చి మీ తల్లిని అడగండి. అమ్మా... ఖత్రోచి కేసులో మనకెంత ముట్టింది? అండర్సన్‌ను డాడీ (రాజీవ్‌గాంధీ) ఎందుకు వదిలిపెట్టాడని అడగండి. ‘ఖత్రోకీ, ఆండర్సన్‌ల నుంచి ఎంత తీసుకున్నారో మీ అమ్మను అడుగు’ లలిత్‌మోదీకి సాయం విషయంలో తనపై ఆరోపణలు చేసిన విపక్ష కాంగ్రెస్‌పై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు. బోఫోర్స్ కుంభకోణంలో నిందితుడైనఓటావియో ఖత్రోకీ, భోపాల్ గ్యాస్ విషాదంలో నిందితుడైన వారెన్ ఆండర్సన్లు భారత్ నుంచి పరారవటానికి కాంగ్రెస్ పార్టీ సాయం చేసిందంటూ ఆరోపణలు ఎక్కుపెడుతూ.. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీపై కూడా విమర్శలు సంధించారు. ప్రత్యేకించి.. లలిత్‌మోదీకి సాయం చేయటానికి తాను డబ్బులు తీసుకున్నానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ‘‘ఖత్రోకీ నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారని, 15,000 మందిని చంపిన హంతకుడిని మీ తండ్రి ఎందుకు విడుదల చేయించారని మీ అమ్మను అడగండి. ఖత్రోకీ, ఆండర్సన్‌ల విషయంలో వారు క్విడ్ ప్రో కోకు ఎందుకు పాల్పడ్డారో రాహుల్ (తన తల్లిని) అడగాలి’’ అని ఎదురు దాడి చేశారు. ‘‘2 నెలల పాటు సెలవుపై వెళ్లటం నీకు చాలా ఇష్టం. ఈసారి అలాంటి పర్యటనకు వెళ్లినపుడు.. నీ కుటుంబ చరిత్రను ఒంటరిగా చదవాలి. తిరిగి వచ్చాక మీ అమ్మను ప్రశ్నలు అడగాలి’’ అని రాహుల్‌కు సూచించా రు. మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరంపైనా సుష్మా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘బ్రిటన్ నుంచి లలిత్‌మోదీని వెనక్కు తీసుకురావటంలో నాటి ఆర్థికమంత్రి చిదంబరం విఫలమయ్యారు. ఆ విషయంలో కాంగ్రెస్ చీలిపోయింది. లలిత్‌పై చర్య తీసుకోవాలని ఆ పార్టీలో కోరుకున్నది చిదంబరం ఒక్కరే. అదికూడా ఆయనతో తన వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే. లలిత్‌ని అదుపులోకి తీసుకుని అప్పగిస్తామని ఆ దేశం సూచించినప్పటికీ.. చిదంబరం కేవలం ఆయనను తిప్పి పంపించాలన్న వినతులకే పరిమితమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖతో కూడా ఆయన సంప్రదించలేదు. నాలుగేళ్ల పాటు మీరు (కాంగ్రెస్ ప్రభుత్వం) ఏమీ చేయలేదు. నిష్క్రియగా ఉండిపోయారు. ఆయనను అదుపులోకి తీసుకుని (భారత్‌కు) అప్పగించే ప్రయత్నాలేవీ లేవు. ఆయనకు నివాస హక్కు (బ్రిటన్‌లో) ఎలా వచ్చిందని మీరు నన్ను అడుగుతున్నారు. మీ హయాంలోనే ఆయనకు ఆ హక్కు వచ్చింది. ఏం జరిగినా.. మీ హయాంలోనే జరిగింది. అరుణ్‌జైట్లీ ఆర్థికమంత్రిగా పదవి చేపట్టిన తర్వాతే.. లలిత్‌మోదీని వెనక్కు రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి’’ అని పేర్కొన్నారు. ‘‘లలిత్‌మోదీ లీగల్ కేసును నా భర్త, కుమార్తె వాదించారన్న విపక్షం ఆరోపణ వాస్తవం కాదు. లలిత్ పాస్‌పోర్టు కేసులో నా భర్త ఆయన తరఫు న్యాయవాది కాదన్నారు. లలిత్ తరఫు న్యాయవాదుల జాబితాలో 9వ న్యాయవాదిగా నా కుమార్తె ఉన్నారు. ఆమెకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. సీనియారిటీ జాబితాలో 9వ స్థానంలో ఉన్న జూనియర్ న్యాయవాదికి ఎవరైనా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఈ కేసులో సీనియర్లతో కలిసి నా కుమార్తె హాజరయ్యారు’’ అని అన్నారు. నేను నిజం మాట్లాడుతున్నా ‘‘సుష్మాస్వరాజ్ నిన్న నన్ను కలిశారు. నా చేయి పట్టుకుని.. బేటా నీకు నాపై అంత కోపం ఎందుకని అడిగారు. నేను నిజం మాట్లాడుతున్నానని ఆమెకు చెప్పాను. సుష్మాగారూ.. నేను మీ కళ్లలోకి సూటిగా చూస్తూ నిజం చెప్తున్నాను అన్నపుడు.. మీరు మీ కళ్లు దించేశారు’’ ‘లలిత్‌మోదీ నుంచి ఎంత డబ్బు అందుకున్నారు?’ సభలో కూర్చుని తమను ఎదుర్కొనేందుకు, తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి దమ్ము లేదని.. అందుకే ఆయన సభకు రాలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. నల్లధనానికి ప్రతీక అయిన ఐపీఎల్ మాజీ బాస్ లలిత్‌మోదీకి రహస్యంగా సాయం చేసినందుకు గాను తన కుటుంబానికి ఎంత డబ్బు ముట్టిందో సుష్మాస్వరాజ్ బయటపెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈ ప్రభుత్వంతో సమస్య ఏమిటంటే.. మహాత్మా గాంధీ మూడు కోతుల లాగా అది వాస్తవాన్ని చూడాలని, వినాలని, మాట్లాడాలని కోరుకోదు. మానవతా కృషి చేసే వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ.. మౌనంగా ఆ పని చేసే తొలి వ్యక్తి సుష్మాస్వరాజ్. సుష్మాస్వరాజ్‌ను నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. లలిత్‌మోదీ నుంచి ఆమె, ఆమె కుంటుంబం ఎంత డబ్బు అందుకున్నారు? నల్లధనం ప్రతీకను రక్షించేందుకు ఆమె ఎంత డబ్బు అందుకున్నారు? ఆయనకు ఆమె ఎందుకు రహస్యంగా సాయం చేశారు?’’ అని ప్రశ్నించారు. ‘‘నల్లధనం వెనక్కు తెస్తానని ప్రధానమంత్రి ఇచ్చిన హామీని భారత ప్రజలు విశ్వసించారు. ఆయన హామీ ఇచ్చినట్లు భారతీయులందరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు ఎప్పుడు జమ చేస్తారు? ‘నేను తినను.. తిననివ్వను’ అని హామీ ఇచ్చిన ప్రధాని దానిని నిలబెట్టుకోలేదు. తన మంత్రుల అక్రమాలపై ఆయన మౌనంగా ఉండిపోయారు. ఈ రోజు కుర్చీలో కూర్చుని మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ఆయనకు లేదు. మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ఆయనకు లేదు. వీళ్లు మీకు సరైన దారి చూపటం లేదు. వీళ్లు మీ ప్రయోజనాలకు చేటు చేస్తున్నారు. మీ మాటలు వినాలని దేశం కోరుతోంది. మీరు మాట్లాడాలి’’ అని నరేంద్రమోదీపైనా రాహుల్ తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజెకు, లలిత్‌మోదీకి మధ్య గల వ్యాపార సంబంధం.. వాణిజ్య లావాదేవీ అని అభివర్ణించిన అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘వ్యాపార ఒప్పందంలో ఒకరు లబ్ధిదారు అవుతారు. ఈ ఉదంతంలో లబ్ధిదారు ఎవరు?’’ అని ప్రశ్నించారు. రాహుల్ మాట్లాడుతున్నపుడు బీజేపీ సభ్యులు తీవ్ర స్వరంతో అరుస్తుండగా.. ‘‘కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండిపోదు. పార్టీ గొంతు నొక్కలేరు. కాంగ్రెస్ తన గళం ఎత్తుతూనే ఉంటుంది’’ అని తిప్పికొట్టారు. ‘‘ఐపీఎల్ అనేది భారతదేశంలో నల్లధనానికి కేంద్రం. లలిత్‌మోదీ నల్లధనానికి ప్రతీక మినహా మరేమీ కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘సుష్మాస్వరాజ్ నిన్న నన్ను కలిశారు. నా చేయి పట్టుకుని.. బేటా నీకు నాపై అంత కోపం ఎందుకని అడిగారు. నేను నిజం మాట్లాడుతున్నానని ఆమెకు చెప్పాను. సుష్మాగారూ.. నేను మీ కళ్లలోకి సూటిగా చూస్తూ నిజం చెప్తున్నాను అన్నపుడు.. మీరు మీ కళ్లు దించేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. రాజీనామా ప్రసక్తే లేదు.. * సుష్మను బలిపశువును చేశారు: జైట్లీ ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం చెప్తూ.. గోరంత కూడా లేనిదాన్ని కొండంత చేసి రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ పార్లమెంటును అడ్డుకోవటానికి ప్రధాన కారణం.. జీఎస్టీ వంటి సంస్కరణల బిల్లులను నిలిపివేటం ద్వారా భారత అభివృద్ధి గాథను నిలువరించటమేనని.. అందుకు సుష్మాస్వరాజ్‌ను బలిపశువును చేశారని మండిపడ్డారు. సుష్మా ఎటువంటి తప్పూ చేయలేదంటూ.. ఆమె రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. లలిత్‌మోదీని వెనక్కు తీసుకువచ్చేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం పటిష్టంగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాహుల్ ఉటంకించిన మూడు కోతుల కథను ప్రస్తావిస్తూ.. పార్లమెంటు సమావేశాలు మొత్తాన్నీ స్తంభింపచేయటం ద్వారా దేశాన్ని కోతిలా చేయవద్దని సూచించారు. ‘తరాలుగా కూర్చొని తింటున్నారు’ ‘‘ఈ రోజు రాహుల్ గాంధీ... సుష్మా స్వరాజ్‌ను నిలదీస్తున్నారు. పాస్‌పోర్ట్ కేసులో లలిత్ మోదీ తరఫున వాదించినందుకు ఆమె కుటుంబానికి ఎంత ముట్టిందో చెప్పాలంటున్నారు. ఆమె ఇప్పటికే స్పష్టం చేసింది. తన కూతురు ఆ కేసులో ఓ జూనియర్ న్యాయవాది మాత్రమేనని. తొమ్మిదో స్థానంలో ఉందని. ఆ కేసులో రూపాయి కూడా తీసుకోలేదని. అయినా... పదేపదే అవే ఆరోపణలు చేస్తున్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపాలని ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌తో వచ్చిన సమస్యేమిటంటే ఆయనో జ్ఞానం లేని నిపుణుడు. ఈ దేశంలో చాలామంది నిజాయితీపరులున్నారు. హోదాలతో పనిలేకుండా వారి కుటుంబీకులు (సుష్మ కూతురిని ఉద్దేశించి) తమ జీవనభృతిని స్వయంగా సంపాదించుకుంటారు. అయితే ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కుటుంబం మాత్రం... తరతరాలుగా ఎలాంటి పని చేయట్లేదు’’ -
ఈ వారమూ ఇంతేనా!?
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారం కూడా పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలేవీ కనిపించటం లేదు. లలిత్‌గేట్, వ్యాపమ్ అంశాలకు సంబంధించి ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచీ చేస్తున్న ఆందోళన మిగిలిన 4 రోజులు సైతం కొనసాగేట్లే కనిపిస్తున్నది. బీజేపీ నిందారాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. కాంగ్రెస్ విధ్వంసక విపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయటంతో ఇరుపక్షాల మధ్య ఉద్వేగాల స్థాయి మరింత పెరిగింది. ఎప్పుడూ సాత్వికంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మునుపెన్నడూ లేనివిధంగా ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ గడువు ముగియటంతో సోమవారం కాంగ్రెస్ సభ్యులంతా లోక్‌సభకు హాజరవుతారు. అయితే సభ కొనసాగటం మాత్రం అనుమానమే. కనీసం ఈ నాలుగురోజులైనా సభను సజావుగా సాగనివ్వాలని మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన బాధ్యత తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తిరిగి సజావుగా నడపడానికి కాంగ్రెస్ పార్టీ అర్థవంతమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమైన ఎనిమిది బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ‘రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్’ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభివృద్ధి నిరోధక పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజకీయంగా దివాలా తీసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ఆలోచనలకు పార్లమెంటును వేదికగా చేసుకుందని ఆదివారం తన బ్లాగులో మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. నిరాధార అంశాలపై పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకోవడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమని నఖ్వీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. -
సభలో స్కామ్‌ల రభస
తొలి రోజే రాజ్యసభలో తీవ్ర గందరగోళం లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై చర్చకు విపక్షాల నోటీసు సుష్మా, వసుంధర, శివరాజ్సింగ్ల రాజీనామాల కోసం పట్టు {పధాని మోదీ పారదర్శకత ఏమైంది: కాంగ్రెస్ ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం, ప్రకటనకు సుష్మా సిద్ధం ఏ చర్చ అయినా ఆ నేతల రాజీనామాల తర్వాతేనన్న విపక్షం న్యూఢిల్లీ: ఊహించిన విధంగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో మొదలయ్యాయి. మంగళవారం మొదలైన ఉభయసభల సమావేశాల్లో.. ఇటీవల మరణించిన తాజా, మాజీ ఎంపీలకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ బుధవారానికి వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గందరగోళ పరిస్థితుల్లో ఐదు పర్యాయాలు వాయిదా పడినా పరిస్థితిలో మార్పులేదు. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్చౌహాన్లను పదవుల నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ పార్టీతో వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ గొంతు కలిపాయి. ప్రభుత్వం స్పందిస్తూ.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం సహా అన్ని అంశాలపై సభలో చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని, సుష్మా కూడా సభలో ప్రకటన చేస్తారని ప్రభుత్వం పదే పదే పేర్కొంది. కానీ, ఆ ముగ్గురు నేతలూ రాజీనామా చేయాలని ప్రతిపక్షం భీష్మించింది. ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారు? ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమయ్యాక, నివాళులు అర్పించిన వెంటనే.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం అంశాలను కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ లేవనెత్తారు. లలిత్‌గేట్‌లో సుష్మా, రాజే, వ్యాపమ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల పాత్రపై చర్చ జరగాలని ఆనంద్‌శర్మతో పాటు.. సీతారాం ఏచూరి (సీపీఎం), నరేశ్ అగర్వాల్ (ఎస్పీ) 267 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ చర్చ తర్వాతే సభా కార్యకలాపాలు నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి పట్టుపట్టారు. మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్‌మోదీకి ప్రయాణ పత్రాలు అందించాల్సిందిగా.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లో సుష్మాస్వరాజ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు విజ్ఞప్తి చేశారని ఆనంద్‌శర్మ ప్రశ్నించారు.లలిత్‌మోదీకి మద్దతుగా వసుంధరరాజె ప్రమాణపత్రంపై సంతకం చేసిన అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అంది స్తాన మోదీ ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారని ధ్వజమెత్తారు. మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోజాలరన్నారు. విపక్షం పారిపోతోంది: జైట్లీ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడుతూ.. విపక్షం ఇచ్చిన 267 నిబంధన నోటీసు మేరకు లలిత్‌గేట్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తక్షణమే చర్చ మొదలు పెట్టాలన్నారు. సుష్మాస్వరాజ్ కూడా వివరణ ఇస్తారన్నారు. అయినా విపక్షాల నినాదాలు ఆగలేదు. దర్యాప్తుకు చర్చ అనేది ప్రత్యామ్నాయం కాబోదని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో సభ పలుమార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకోవడం తప్పితే, చర్చ జరగాలని కోరుకోవడంలేదని జైట్లీ విమర్శించారు. చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కానీ కాంగ్రెస్ పారిపోతోందన్నారు. లలిత్‌గేట్‌పై చర్చ జరిపించడానికి కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మను పిలిపించాలని సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ను ఆయన కోరారు. చర్చకు అధికార, విపక్షాలు సిద్ధంగా ఉండటంతో నోటీసును అనుమతిస్తున్నట్లు కురియన్ పేర్కొన్నారు. విపక్షాలు పట్టువీడకపోవటంతో ఆయన సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సభ మొదలయ్యాక కూడా పరిస్థితి మారలేదు. ఎవరూ రాజీనామా ఇవ్వబోరని, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌నఖ్వీ పేర్కొన్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని సభాపక్ష నేత ప్రకటించారని, చర్చకు అభ్యంతరం ఏమిటని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఏచూరిని ప్రశ్నించారు. సభలో విపక్షం ఆందోళనలను కొనసాగించడంతో బుధవారానికి వాయిదా వేశారు. గందరగోళం మధ్యనే.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లును సభ నుంచి ఉపసంహరించారు. దీనిపై ప్రభుత్వం గత నెలలో ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. చర్చ కాదు.. రచ్చే వారికిష్టం: వెంకయ్య న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చర్చ జరగడం ఇష్టం లేదని, రచ్చ చేయడమే వారి ఉద్దేశమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటే అది జాతికే నష్టమని పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వందేళ్ల రాజకీయ అనుభవం, యాభై ఏళ్ల పాలనానుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. పార్లమెంటులో వ్యవహరించిన తీరు విచారకరం. ఆ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీకే ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభం కాకముందే.. సమావేశాలు జరగవు.. జరగనివ్వబోమని ఆ పార్టీ ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఎవరైనా చర్చకు పట్టుబట్టి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలి. కానీ సమావేశాలే జరగనివ్వబోమని చెప్పడం విడ్డూరం...’’ అని ధ్వజమెత్తారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో కూడా వారి వైఖరి అలాగే ఉంది. మిగిలిన 28 పార్టీలు చర్చ జరగాలి.. తమకు అవకాశం కావాలి.. అని కోరాయి. దాంతో కాంగ్రెస్ స్వరం మార్చి తమకు సంతృప్తికరమైన సమాధానం కావాలని పేర్కొంది. వాళ్లకు అధికారం తప్ప మరొకటి సంతృప్తినివ్వదు. అందుకే ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా రాజ్యసభలో గందరగోళం సృష్టించి రభసకు కారణమయ్యారు.’’ అని తప్పుపట్టారు. ‘‘లోక్‌సభ సిట్టింగ్ సభ్యుడు చనిపోతే నివాళులు అర్పించి సభను వాయిదా వేయడం సంప్రదాయం. సభ వాయిదా పడుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్, వామపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. నిబంధనలు తెలియవా?’’ అని వెంకయ్య మండిపడ్డారు. ‘‘మా మంత్రివర్గంలో ఎవరిపైనా ఆరోపణలు లేవు. రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలు వస్తే రాష్ట్రాల్లో చర్చించుకోవాలి. అవన్నీ చర్చించడానికి పార్లమెంటు ఎలా వేదిక అవుతుంది?’’ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ పట్టుబడుతోంది కదా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘వాళ్లు పట్టుబడుతున్నది బిల్లులో ఉన్న అంశాల గురించి. బిల్లులో అది లేదు...’’ అని వెంకయ్యనాయుడు బదులిచ్చారు.