సభలో స్కామ్ల రభస | first serious confusion in the Rajya Sabha today | Sakshi
Sakshi News home page

సభలో స్కామ్ల రభస

Published Wed, Jul 22 2015 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM

సభలో స్కామ్ల రభస

సభలో స్కామ్ల రభస

తొలి రోజే రాజ్యసభలో తీవ్ర గందరగోళం
 

లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై చర్చకు విపక్షాల నోటీసు
సుష్మా, వసుంధర, శివరాజ్‌సింగ్‌ల రాజీనామాల కోసం పట్టు
{పధాని మోదీ పారదర్శకత ఏమైంది: కాంగ్రెస్
ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న ప్రభుత్వం, ప్రకటనకు సుష్మా సిద్ధం
ఏ చర్చ అయినా ఆ నేతల రాజీనామాల తర్వాతేనన్న విపక్షం

 
న్యూఢిల్లీ: ఊహించిన విధంగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభనతో మొదలయ్యాయి. మంగళవారం మొదలైన ఉభయసభల సమావేశాల్లో.. ఇటీవల మరణించిన తాజా, మాజీ ఎంపీలకు నివాళులర్పించిన అనంతరం లోక్‌సభ బుధవారానికి వాయిదా పడగా.. రాజ్యసభలో మాత్రం అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గందరగోళ పరిస్థితుల్లో ఐదు పర్యాయాలు వాయిదా పడినా పరిస్థితిలో మార్పులేదు. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లను పదవుల నుంచి తప్పించాలంటూ కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఆ పార్టీతో వామపక్షాలు, సమాజ్‌వాది పార్టీ గొంతు కలిపాయి. ప్రభుత్వం స్పందిస్తూ.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం సహా అన్ని అంశాలపై సభలో చర్చించటానికి తాము సిద్ధంగా ఉన్నామని, సుష్మా కూడా సభలో ప్రకటన చేస్తారని ప్రభుత్వం పదే పదే పేర్కొంది. కానీ, ఆ ముగ్గురు నేతలూ రాజీనామా చేయాలని ప్రతిపక్షం భీష్మించింది.

ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారు?
ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమయ్యాక, నివాళులు అర్పించిన వెంటనే.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణం అంశాలను కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ లేవనెత్తారు. లలిత్‌గేట్‌లో సుష్మా, రాజే, వ్యాపమ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ల పాత్రపై చర్చ జరగాలని ఆనంద్‌శర్మతో పాటు.. సీతారాం ఏచూరి (సీపీఎం), నరేశ్ అగర్వాల్ (ఎస్‌పీ) 267 నిబంధన కింద నోటీసు ఇచ్చారు. ఈ చర్చ తర్వాతే సభా కార్యకలాపాలు నిర్వహించాలని కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి పట్టుపట్టారు. మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉండి పరారీలో ఉన్న మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్‌మోదీకి ప్రయాణ పత్రాలు అందించాల్సిందిగా.. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లో సుష్మాస్వరాజ్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎందుకు విజ్ఞప్తి చేశారని ఆనంద్‌శర్మ ప్రశ్నించారు.లలిత్‌మోదీకి మద్దతుగా వసుంధరరాజె ప్రమాణపత్రంపై సంతకం చేసిన అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అంది స్తాన మోదీ ఆ పారదర్శకతను ఎక్కడ వదిలేశారని ధ్వజమెత్తారు. మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోజాలరన్నారు.
 
విపక్షం పారిపోతోంది: జైట్లీ

 కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అధికార పక్షం నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడుతూ.. విపక్షం ఇచ్చిన 267 నిబంధన నోటీసు మేరకు లలిత్‌గేట్‌పై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తక్షణమే చర్చ మొదలు పెట్టాలన్నారు. సుష్మాస్వరాజ్ కూడా వివరణ ఇస్తారన్నారు. అయినా విపక్షాల నినాదాలు ఆగలేదు. దర్యాప్తుకు చర్చ అనేది ప్రత్యామ్నాయం కాబోదని సీపీఎం నేత సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఈ నేపథ్యం లో సభ పలుమార్లు వాయిదా పడింది. తిరిగి సమావేశమయ్యాక.. కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకోవడం తప్పితే, చర్చ జరగాలని కోరుకోవడంలేదని జైట్లీ విమర్శించారు. చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కానీ కాంగ్రెస్ పారిపోతోందన్నారు. లలిత్‌గేట్‌పై చర్చ జరిపించడానికి కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్‌శర్మను పిలిపించాలని సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్‌ను ఆయన కోరారు. చర్చకు అధికార, విపక్షాలు సిద్ధంగా ఉండటంతో నోటీసును అనుమతిస్తున్నట్లు కురియన్ పేర్కొన్నారు. విపక్షాలు పట్టువీడకపోవటంతో ఆయన సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సభ మొదలయ్యాక కూడా పరిస్థితి మారలేదు. ఎవరూ రాజీనామా ఇవ్వబోరని, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌నఖ్వీ పేర్కొన్నారు. చర్చకు సిద్ధంగా ఉన్నామని సభాపక్ష నేత ప్రకటించారని, చర్చకు అభ్యంతరం ఏమిటని డిప్యూటీ చైర్మన్ కురియన్ ఏచూరిని ప్రశ్నించారు. సభలో విపక్షం ఆందోళనలను కొనసాగించడంతో బుధవారానికి వాయిదా వేశారు. గందరగోళం మధ్యనే.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ (సవరణ) బిల్లును సభ నుంచి ఉపసంహరించారు. దీనిపై ప్రభుత్వం గత నెలలో ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
 
చర్చ కాదు.. రచ్చే వారికిష్టం: వెంకయ్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చర్చ జరగడం ఇష్టం లేదని, రచ్చ చేయడమే వారి ఉద్దేశమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విమర్శించారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటే అది జాతికే నష్టమని పేర్కొన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వందేళ్ల రాజకీయ అనుభవం, యాభై ఏళ్ల పాలనానుభవం ఉందని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. పార్లమెంటులో వ్యవహరించిన తీరు విచారకరం. ఆ పార్టీ ఎత్తుగడలు ఆ పార్టీకే ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తున్నాయి. సమావేశాలు ప్రారంభం కాకముందే.. సమావేశాలు జరగవు.. జరగనివ్వబోమని ఆ పార్టీ ప్రకటించుకోవడం సిగ్గుచేటు. ఎవరైనా చర్చకు పట్టుబట్టి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టాలి. కానీ సమావేశాలే జరగనివ్వబోమని చెప్పడం విడ్డూరం...’’ అని ధ్వజమెత్తారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో కూడా వారి వైఖరి అలాగే ఉంది. మిగిలిన 28 పార్టీలు చర్చ జరగాలి.. తమకు అవకాశం కావాలి.. అని కోరాయి. దాంతో కాంగ్రెస్ స్వరం మార్చి తమకు సంతృప్తికరమైన సమాధానం కావాలని పేర్కొంది. వాళ్లకు అధికారం తప్ప మరొకటి సంతృప్తినివ్వదు. అందుకే ప్రభుత్వం చర్చకు సిద్ధమని ప్రకటించినా రాజ్యసభలో గందరగోళం సృష్టించి రభసకు కారణమయ్యారు.’’ అని తప్పుపట్టారు.

‘‘లోక్‌సభ సిట్టింగ్ సభ్యుడు చనిపోతే నివాళులు అర్పించి సభను వాయిదా వేయడం సంప్రదాయం. సభ వాయిదా పడుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్, వామపక్షాలు వాయిదా తీర్మానం ఇచ్చాయి. నిబంధనలు తెలియవా?’’ అని వెంకయ్య మండిపడ్డారు. ‘‘మా మంత్రివర్గంలో ఎవరిపైనా ఆరోపణలు లేవు. రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలు వస్తే రాష్ట్రాల్లో చర్చించుకోవాలి. అవన్నీ చర్చించడానికి పార్లమెంటు ఎలా వేదిక అవుతుంది?’’ అని ప్రశ్నించారు.  ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ పట్టుబడుతోంది కదా?’ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘వాళ్లు పట్టుబడుతున్నది బిల్లులో ఉన్న అంశాల గురించి. బిల్లులో అది లేదు...’’ అని వెంకయ్యనాయుడు బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement