లలిత్‌మోదీ వివాదంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ సభలో ఆందోళనకు దిగటంతో ఇప్పటివరకూ స్తంభించిపోయిన లోక్‌సభలో బుధవారం ఆ వివాదంపై వాడివేడిగా చర్చ జరిగింది. మరో రోజులో సమావేశాలు ముగిసిపోనుండగా.. ఈ వివాదంపై ‘వాయిదా తీర్మానం చర్చ’కు ప్రభుత్వ, ప్రతిపక్షాలు అంగీకరించాయి. బుధవారం ఉదయం సభ సమావేశమైన తర్వాత.. లలిత్‌మోదీ వివాదంపై చర్చకు కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు వెల్‌లోకి వెళ్లి రాజీనామా డిమాండ్లతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షం డిమాండ్ మేరకు వాయిదా తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా సుష్మా స్వయంగా స్పీకర్‌ను కోరారు. చర్చలో కేవలం ప్రతిపక్షమే పాల్గొననీయండని.. తాను సమాధానం చెప్పేటపుడు ప్రతిపక్షం సభలో ఉండాలని మాత్రమే తాను కోరుతున్నానని పేర్కొన్నారు. కానీ.. చర్చ జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరు కావాలని.. ఆయన సమాధానం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘ప్రధాని హాజరు కాకుండా.. చర్చకు సమాధానం ఇవ్వకుండా.. మంత్రిపై చర్యలు ఎలా చేపట్టగలరు?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వాయిదా తీర్మానం కింద చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు సభలో పేర్కొన్నారు. దీంతో.. వాయిదా తీర్మానానికి తనకు అభ్యంతరం లేదని.. అయితే దానిని సభ నియమాల ప్రాతిపదికనే చేపట్టటం జరుగుతుందని స్పీకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటికే దానిని తిరస్కరించినందున.. దానిపై ప్రశ్నోత్తరాల తర్వాత మాత్రమే దానిపై చర్చించగలమని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సభాపక్ష నేత మల్లిఖార్జునఖర్గే చర్చ ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడికి సుష్మా సాయం చేశారని.. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు ప్రశ్నలు సంధించారు. ఆయన ఆరోపణలకు సుష్మాస్వరాజ్ బదులిచ్చారు. రాహుల్ విమర్శలనూ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. అనంతరం పలు పార్టీల సభ్యులతో పాటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌పై, ప్రధానమంత్రిపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. చివరిగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చర్చకు బదులిచ్చారు. కాంగ్రెస్ ఆరోపణలు నిరాధారమంటూ సుష్మా రాజీనామా డిమాండ్‌ను తిరస్కరించారు. కాంగ్రెస్ వాకౌట్ చేయగా..వాయిదా తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది.
Published Thu, Aug 13 2015 6:58 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
Advertisement