Opposition protests
-
‘ప్రధాని మోదీ రావాలి.. మాట్లాడాలి’
సాక్షి, న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. విపక్ష ఎంపీలు తమ డిమాండ్‌పై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి.. సమాధానం ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెప్పారు. ప్రధానమంత్రి మొండి వైఖరిని నిరసిస్తూ నల్లరంగు దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో ఉభయ సభల్లో గురువారం సైతం వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మణిపూర్ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మోదీ మౌనాన్ని వీడాలని, మణిపూర్ హింసపై నోరు విప్పాలని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో అధికార బీజేపీ సభ్యులు ఎదురుదాడికి దిగారు. ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాల హోరు మధ్యే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఖనిజ చట్ట సవరణ బిల్లును, కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ జన్‌విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. సభ పునఃప్రారంభమైన తర్వాత జన్‌విశ్వాస్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. 76 కాలం చెల్లిన చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. అనంతరం లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ భేటీని బహిష్కరించిన ఎంపీలు రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశాన్ని ప్రతిపక్ష ఎంపీలు బహిష్కరించారు. మణిపూర్ అంశంపై ప్రధాని వైఖరికి నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. రాజ్యసభ బీఏసీలో మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ సమావేశాన్ని జైరాం రమేశ్(కాంగ్రెస్), మీసా భారతి(ఆర్జేడీ), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ) బహిష్కరించారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సభ్యుడు కేశవరావు గైర్హాజరయ్యారు. దేశాన్ని విభజిస్తున్నారు: రాహుల్ దేశాన్ని విభజించాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసికట్టుగా కుట్రపన్నుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ప్రజల దుఃఖం బాధ వారికి పట్టడం లేదు. అధికారం తప్ప వారికి మరి దేనిపైనా ఆసక్తి లేదు’ అని అన్నారు. యువజన కాంగ్రెస్ గురువారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆన్లైన్లో పాల్గొని ప్రసంగించారు. ‘బీజేపీ–ఆర్ఎస్ఎస్కి కావాల్సింది అధికారమే. దాని కోసం ఏమైనా చేస్తారు. అధికారం కోసం వారు మణిపూర్‌ను రావణకాష్టంలా మారుస్తారు. యావత్ దేశాన్ని నిప్పుల కుంపటి చేస్తారు. దేశ ప్రజల బాధ, శోకం వారికి పట్టదు’ అని తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. ‘మీరు ఒక వైపు కూర్చొని ప్రేమను పంచుతూ ఉంటారు. దేశానికి, దేశ ప్రజలకి గాయమైతే మీకూ ఆ నొప్పి తెలుస్తుంది. కానీ వాళ్లకి అలాంటి భావాలే లేవు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి ప్రజల బాధ ఏంటో తెలీదు. వాళ్లు దేశాన్ని విభజించే పనిలో బిజీ’ అని అన్నారు. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్ రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగింది. మణిపూర్‌లో మంటలు చెలరేగుతున్నా ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు ప్రయ తి్నస్తుండగా, అధికారపక్ష ఎంపీలు అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభ మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే కేంద్ర మంత్రి ఠాకూర్ సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో విపక్షాల తీరును ఆయన తప్పుపపట్టారు. దాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఒక సమయంలో ప్రతిపక్ష సభ్యులు ‘ఇండియా, ఇండియా’ అంటూ నినాదాలు చేయగా, బీజేపీ సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినదించారు. సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందింది. -
పార్లమెంట్ ప్రతిష్టంభనతో రూ.133 కోట్లు వృథా
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనతో సభలు సాగని పరిస్థితి ఏర్పడింది. పెగసస్, రైతు చట్టాలపై తొలుత చర్చించాలని విపక్షాలు, అవి తప్ప మిగిలిన అంశాలపై చర్చకు రెడీ అంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 107 గంటలు జరగాల్సిన సమావేశాలు కేవలం 18 గంటలకే పరిమితమయ్యాయి. అంటే మొత్తం సభా సమయంలో 83 శాతం వృధాగా పోయింది. ఈ వృథా ఖరీదు రూ. 133 కోట్లని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై 19న ఆరంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఇప్పటివరకు రాజ్యసభలో కేవలం 21 శాతం సభా సమయమే ఆందోళనలు లేకుండా సాగగా, లోక్‌సభలో కేవలం 13 శాతం సభా సమయం మాత్రమే జరిగింది. గంటల లెక్కన చూస్తే లోక్‌సభ 54 గంటలకు గాను 7 గంటల పాటు, రాజ్యసభ 53 గంటలకుగాను 11 గంటల పాటు జరిగాయి. సభ సాగిన కొద్ది సమయంలో మూజువాణి ఓటుతో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో నిరసన కారణంగా జరిగిన వృ«థా వల్ల ప్రజాధనం దాదాపు 133 కోట్లు నిరుపయోగంగా పోయినట్లయింది. సభా ప్రతిష్ఠంభనకు మీరంటే మీరే కారణమని ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ మొత్తం మీద ప్రజాధనాన్ని వృథా చేశాయని రాజకీయ నిపుణులు వాపోతున్నారు. ఎందుకీ నిరసన?: పెగసస్ అనే స్పైవేర్‌తో ప్రభుత్వం పలువురి ఫోన్లను హ్యాక్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి సమాధానమిస్తూ పెగసస్ విషయం అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదని, హ్యాకింగ్ ఏమీ జరగలేదని విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు కొన్ని విపక్షాలు రైతు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వీటిపై చర్చించామని, కావాలంటే సభలో సమయానుకూలతను బట్టి చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్షాలు తగ్గకుండా వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటున్నాయి. కేవలం కొందరికి నివాళులు అర్పించడం, ఒలింపిక్ విజేతకు శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యకలాపాలు మినహా కీలకమైన కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. విపక్షాల ధోరణిపై ఇటీవలే ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ఇంతే దీటుగా బదులిచ్చాయి. పెగసస్ అంశం అమెరికాలో బయటపడ్డ వాటర్‌గేట్ కుంభకోణంలాంటిదని దుయ్యబడుతున్నాయి. ఇలా ఇరుపక్షాలు మొండిపట్టు పట్టడంతో సభలు సాగకుండా వాయిదాలు పడుతున్నాయి. -
రాజ్యసభలో ‘ఎలక్టోరల్’ రచ్చ
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల అంశంపై రాజ్యసభ శుక్రవారం అట్టుడికింది. ఈ విషయంపై సభలో చర్చ జరగాలని, ప్రధాని మోదీ సమాధానమివ్వాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చైర్మన్ వెంకయ్య తిరస్కరించడంతో పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు నిరసనలు తెలిపాయి. దీనిపై సభలో చర్చ జరగాలంటూ రాజ్యసభలో శుక్రవారం ప్రతిపక్షాలు 267వ నిబంధన కింద నోటీసులిచ్చాయి. ఇది తీవ్రమైన అంశమని, ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం వెల్లడించాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. అయితే, మిగతా కార్యక్రమాలను పక్కనబెట్టి, చర్చించేంత ముఖ్యమైన విషయం కాదని, కావాలనుకుంటే ఇతర నిబంధనల కింద చర్చకు కోరవచ్చని చైర్మన్ వెంకయ్య అన్నారు. సభ్యులు నిరసనలు కొనసాగిస్తుండటంతో సభను వాయిదా వేస్తానన్న చైర్మన్ హెచ్చరికతో గందరగోళం సద్దుమణిగింది. అనంతరం సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. బాండ్లపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు, అనుమానాలపై ప్రధాని మౌనం వీడాలన్నారు. చట్టబద్ధ రాజకీయ అవినీతి: సీపీఎం ‘ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాలి. ఇది చట్టబద్ధ రాజకీయ అవినీతిగా మారింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ డబ్బును నిబంధనలకు విరుద్ధంగా శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ వాడుతోంది’అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. జేఎన్‌యూ ఫీజు పెంపుపై వివాదం జేఎన్‌యూ హాస్టల్ విద్యార్థుల ఫీజు పెంపు, విద్యార్థుల డ్రెస్ కోడ్ తదితర అంశాల తాజా ప్రతిపాదనలపై రాజ్యసభలో వామపక్ష పార్టీలు, అధికార పక్షం సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా, జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యంపై న్యాయ విచారణ జరిపించాలంటూ జీరో అవర్‌లో సీపీఎంకు చెందిన కేకే రాగేశ్ డిమాండ్ చేయగా చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. ఢిల్లీలో నీటి నాణ్యతపై వాగ్యుద్ధం ఢిల్లీ వాసులకు అందించే నల్లా నీటి నాణ్యతపై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంపై చైర్మన్ వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చెందిన విజయ్ గోయెల్ జీరో అవర్‌లో ఢిల్లీ నీటి నాణ్యత అంశాన్ని లేవనెత్తారు. సురక్షితం కాని నీరు ఢిల్లీ వాసులకు అందుతోందని ఆరోపించగా ఆప్ సభ్యుడు సంజయ్ అరుస్తూ అంతరాయం కలిగించారు. ‘ఆ సమస్యను పరిష్కరించడానికి మీరేమైనా మంత్రా?’అని వెంకయ్య ఆగ్రహంతో ప్రశ్నించారు. -
సరోగసీ బిల్లుకు ఓకే
న్యూఢిల్లీ: రఫేల్ వివాదంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే సరోగసీ (రెగ్యులేషన్) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కావేరీ డ్యాం సమస్యపై డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు ఉభయ సభలను నినాదాలతో హోరెత్తించారు. రఫేల్ విమానాల కొనుగోలు వివాదంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ గోయెల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రఫేల్ వివాదంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు కొనసాగడంతో ఉదయం11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ.. కొద్దిసేపటికే మరుసటి రోజుకు వాయిదా పడింది. సభ నడవడం ఎవరికీ ఇష్టం లేనట్లు ఉందంటూ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. కాగా, లోక్‌సభలో మాత్రం సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు ఆమోదం పొందింది. వినియోగదారు హక్కుల రక్షణ బిల్లుకు మాత్రం మోక్షం కలగలేదు. ఆందోళనలు తీవ్రతరం కావడంతో ఈ బిల్లుపై చర్చ సాధ్యం కాదని, దీనిపై గురువారం చర్చిస్తామని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. 24, 26 తేదీల్లోనూ రాజ్యసభకు సెలవు సభ్యుల వినతి మేరకు రాజ్యసభకు శనివారం(డిసెంబర్ 22) మొదలుకొని బుధవారం (డిసెంబర్ 26) వరకు సెలవు ప్రకటించారు. క్రిస్మస్ను పురస్కరించుకుని డిసెంబర్ 25న మాత్రమే సెలవు దినంగా నిర్ణయిస్తూ గతంలో ప్రకటన వెలువడింది. సరోగసీ బిల్లు ముఖ్యాంశాలు ► 23–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు, 26–55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులు మాత్రమే సరోగసీ(అద్దె గర్భం) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ► వాణిజ్య అవసరాల కోసం సరోగసీ చేపట్టడాన్ని నిషేధించారు. ► ఎన్ఆర్ఐలు, విదేశీయులు, పీఐవోలు, హోమో సెక్సువల్స్, సింగిల్ పేరెంట్స్, సహ జీవనం చేసే జంటలు సరోగసీకి అనర్హులు. ► ఒకే సంతానం ఉన్న జంటలు సైతం సరోగసికి అర్హులు కారు. కానీ వీరు ఇతర చట్టాల ప్రకారం చిన్నారులను దత్తత తీసుకోవచ్చు. ► సమీప బంధువులు అంటే సోదరి లేదా మరదలు వంటివారినే సరోగసీ కోసం అనుమతిస్తారు. ► ఓ మహిళను సరోగసీ కోసం జీవితకాలంలో ఒకసారి మాత్రమే అనుమతిస్తారు. ► సరోగసికి ముందుకొచ్చే మహిళకు అప్పటికే వివాహమై, ఓ కుమారుడు/కుమార్తె ఉండాలి. ► ఈ చట్టం జమ్మూకశ్మీర్ తప్ప దేశమంతటా వర్తిస్తుంది. ► 3 నెలల్లోగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సరోగసీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. -
తుడిచిపెట్టుకుపోయిన మలిదశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి. రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి. లోక్‌సభలో 127 గంటలు వృథా లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ మహాజన్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 121 గంటల వృథా రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు. -
గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల ఆందోళన
-
సభలో నిరసనల పర్వం
మిన్నంటిన విపక్షాల నినాదాలు * లలిత్‌గేట్, వ్యాపమ్‌లపై కొనసాగిన కాంగ్రెస్ సభ్యుల ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజు సోమవారం నాడు లోక్‌సభ విపక్షాల నిరసనలు, నినాదాల నడుమ మూడుసార్లు వాయిదాపడినా.. మూడు గంటల పాటు సాగింది. సమావేశాల తొలి వారంలో.. లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ స్కామ్‌లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలను తొలగించాలంటూ సభను స్తంభింపజేసిన విపక్షాల ఆందోళన ఐదో రోజూ యథాతథంగా కొనసాగినప్పటికీ.. స్పీకర్ సుమిత్రామహాజన్ సభను మూడు గంటల పాటు కొనసాగించారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. ఐపీఎల్, కుల గణన వివరాలు, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు, వ్యాపమ్ అంశాలపై చర్చ కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా వివిధ పక్షాల సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. నోటీసులు తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించగానే కాంగ్రెస్, ఇతర విపక్షాల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్ సభ్యులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం వెల్‌లోకి వచ్చి నినాదాలు మొదలుపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, అది నిబంధనలకు వ్యతిరేకమని సభాపతి సభ్యులను కోరారు. 12 గంటల వరకు సభను వాయిదావేశారు. సభ తిరిగి 12 గంటలకు ప్రారంభయ్యాక మంత్రి వెంకయ్య లేచి గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదుల దాడి సంఘటన ఇంకా కొనసాగుతోందని, ఎదురు కాల్పులు పూర్తయ్యాక హోంమంత్రి సభలో ప్రకటన చేస్తారని చెప్పారు. సభాపతి ఈ సమయంలో జీరో అవర్‌ను ప్రారంభించగా పలువురు సభ్యులు గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించారు. ఆ సమయంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వగా ఆయన కూడా గురుదాస్‌పూర్ సంఘటనను ప్రస్తావించబోయారు. అయితే హైకోర్టు విషయం మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చని, గురుదాస్‌పూర్ సంఘటనపై అయితే ఇప్పుడు అవకాశం ఇవ్వబోనని స్పీకర్ చెప్పారు. దీంతో జితేందర్‌రెడ్డి ‘హైకోర్టు అంశంపై వాయిదా తీర్మానం కోరుతూ నోటీసులు ఇచ్చాను. మాకు చర్చకు అవకాశం వచ్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది’ అని చెప్పి ముగించారు. గందరగోళంతో సభను స్పీకర్ 2 గంటల వరకు వాయిదా వేశారు. విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజైన సోమవారం నాడు రాజ్యసభ.. ఇటీవల మరణించిన సిటింగ్ బీజేడీ సభ్యుడు కల్పతరు దాస్, మాజీ సభ్యులు ఆర్.ఎస్.గవాయ్, బి.కె.హాందిక్లకు నివాళులు అర్పించి మంగళవారానికి వాయిదా పడింది. ‘క్యాంటీన్లో ధరలు పెంచొద్దు’ ఎంపీలకు చవగ్గా ఆహారాన్ని అందిస్తుండటంపై విమర్శలు వస్తున్నా ఈ సబ్సిడీని కొనసాగించాల్సిందేనని పార్లమెంటరీ క మిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు క్యాంటీన్లో ధరలు పెంచితే ఆ ప్రభావం చట్టసభల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులపై పడుతుందని టీఆర్ఎస్ ఎంపీ ఎ.పి.జితేందర్ రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ పేర్కొంది. స్పీకర్ టేబుల్‌పై ప్లకార్డు ప్రదర్శన లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యాక కాంగ్రెస్ నేత ఖర్గే లేచి.. గురుదాస్‌పూర్ సంఘటనపై మాట్లాడాలనుకుంటే మా ట్లాడనివ్వలేదని, ఇది అన్యాయమని పేర్కొన్నారు. నిరసనలు, నినాదాలు ఈ రోజు కొత్తగా పుట్టినవి కాదని, గడచిన పదేళ్ల రికార్డులు చూసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంలో వెంకయ్య జోక్యం చేసుకుని గురుదాస్‌పూర్ సంఘటనపై రాజకీయాలు వద్దని, దేశ భద్రతకు సంబంధించిన అంశం లో జాతి మొత్తం ఒక్కటై నిలవాలని పేర్కొన్నారు. ఈ సమయంలో సభాపతి 377 నిబంధన కింద ప్రత్యేక ప్రస్తావనలకు అనుమతించారు. గందరగోళం మధ్యనే ప్రభు త్వం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్లు 2015, 295 చట్టాలను రద్దు చేయటానికి ఉద్దేశించిన బిల్లు, ఢిల్లీ హైకోర్టు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. దీనిపై చర్చ జరుగుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆదిర్రంజన్చౌదరి వెల్ నుం చి స్పీకర్ స్థానం వైపు ఉన్న మెట్ల మీదికి ఎక్కి స్పీకర్ టేబుల్‌పైన ప్లకార్డును ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆగ్రహానికి గురైన సభాపతి సభను 4 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి 4గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్.. చౌదరి సభాపతి స్థానంతో అమర్యాదగా ప్రవర్తించారని పేర్కొంటూ అతడిపై చర్యకు ఉపక్రమిస్తూ అతడి పేరును ప్రస్తావించారు. చౌదరి లేచి స్పీకర్‌కు క్షమాపణలు చెప్పారు. -
హనుమంతరావు ప్లీజ్ గో బ్యాక్..
న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ వ్యవహారం 'లలిత్ గేట్'పై చర్చ జరగాలని విపక్ష సభ్యులు బుధవారం రాజ్యసభలో ఆందోళనకు దిగారు. అందుకు డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ ససేమిరా అన్నారు. దాంతో విపక్ష సభ్యులు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకువెళ్లి... పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దయ చేసి వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని పీజే కురియన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. అంతా వెనక్కి వెళ్తున్న తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వి.హనుమంతరావు అక్కడే ఉండి పెద్ద పెట్టున్న నినాదాలు చేస్తున్నారు. దాంతో పీజే కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హనుమంతరావు ప్లీజ్ గో బ్యాక్ అంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో వీహెచ్ సీట్లోకి వెళ్లారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సభలు ప్రారంభమైన నాటి నుంచి అధికార పార్టీకి లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
బడ్జెట్ సమావేశాలు
సాక్షి ముంబై: అనుకున్నట్టే బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. అయితే కొద్దిసేపటికే ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సభ ప్రారంభమైంది. అనంతరం దివంగత ఉప ముఖ్యమంత్రి ఆర్ఆర్ పాటిల్, దివంగత సీనియర్ కమ్యూనిస్ట్ నేత గోవింద్ పాన్సరే, దివంగత శివసేన ఎమ్మెల్యే బాలా సావంత్ తదితరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య సభను మంగళవారానికి వాయిదా వేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ అసెంబ్లీ ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్ర గవర్నర్ వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితి వల్ల రైతులు విలవిల్లాడుతోంటే.. వారికి కనీస మద్దతు లభించలేదని విపక్ష సభ్యులు విమర్శించారు. సీనియర్ కమ్యూనిస్టు నేత గోవింద్ పాన్సరే హత్య కేసులో ఇంకా ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా ‘అమ్హీ సారే పాన్సరే’ (మేమందరం పాన్సరేలం) అంటూ నినాదాలు చేశారు. పాన్సారే హంతకులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎంత ఆర్థిక సాయం ఎప్పుడు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఇచ్చిన తేనేటి విందును బహిష్కరించిన విపక్షాలు... మొదటి రోజు దూకుడుతో వ్యవహరించాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చండి... -అజిత్ పవార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు పూర్తి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు, వడగళ్ల వర్షం, పాన్సరే హత్యతో పాటు ముస్లిం రిజర్వేషన్ రద్దు, ధన్గర్ రిజర్వేషన్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలి.... -ధనంజయ్ ముండే గత మూడు నెలల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రభుత్వంపై 302 సెక్షన్ కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వీరంగం సృష్టిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీసం పడకలు కూడా లేవని ఆయన ఆరోపించారు. టామీ ఫ్లూ టాబ్లెట్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని..ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని విమర్శించారు.