
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి.
రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి.
లోక్‌సభలో 127 గంటలు వృథా
లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ మహాజన్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు.
గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.
రాజ్యసభలో 121 గంటల వృథా
రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు.