న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనతో సభలు సాగని పరిస్థితి ఏర్పడింది. పెగసస్, రైతు చట్టాలపై తొలుత చర్చించాలని విపక్షాలు, అవి తప్ప మిగిలిన అంశాలపై చర్చకు రెడీ అంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 107 గంటలు జరగాల్సిన సమావేశాలు కేవలం 18 గంటలకే పరిమితమయ్యాయి. అంటే మొత్తం సభా సమయంలో 83 శాతం వృధాగా పోయింది. ఈ వృథా ఖరీదు రూ. 133 కోట్లని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై 19న ఆరంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి.
ఇప్పటివరకు రాజ్యసభలో కేవలం 21 శాతం సభా సమయమే ఆందోళనలు లేకుండా సాగగా, లోక్‌సభలో కేవలం 13 శాతం సభా సమయం మాత్రమే జరిగింది. గంటల లెక్కన చూస్తే లోక్‌సభ 54 గంటలకు గాను 7 గంటల పాటు, రాజ్యసభ 53 గంటలకుగాను 11 గంటల పాటు జరిగాయి. సభ సాగిన కొద్ది సమయంలో మూజువాణి ఓటుతో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో నిరసన కారణంగా జరిగిన వృ«థా వల్ల ప్రజాధనం దాదాపు 133 కోట్లు నిరుపయోగంగా పోయినట్లయింది. సభా ప్రతిష్ఠంభనకు మీరంటే మీరే కారణమని ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ మొత్తం మీద ప్రజాధనాన్ని వృథా చేశాయని రాజకీయ నిపుణులు వాపోతున్నారు.
ఎందుకీ నిరసన?: పెగసస్ అనే స్పైవేర్‌తో ప్రభుత్వం పలువురి ఫోన్లను హ్యాక్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి సమాధానమిస్తూ పెగసస్ విషయం అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదని, హ్యాకింగ్ ఏమీ జరగలేదని విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు కొన్ని విపక్షాలు రైతు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వీటిపై చర్చించామని, కావాలంటే సభలో సమయానుకూలతను బట్టి చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
కానీ విపక్షాలు తగ్గకుండా వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటున్నాయి. కేవలం కొందరికి నివాళులు అర్పించడం, ఒలింపిక్ విజేతకు శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యకలాపాలు మినహా కీలకమైన కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. విపక్షాల ధోరణిపై ఇటీవలే ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ఇంతే దీటుగా బదులిచ్చాయి. పెగసస్ అంశం అమెరికాలో బయటపడ్డ వాటర్‌గేట్ కుంభకోణంలాంటిదని దుయ్యబడుతున్నాయి. ఇలా ఇరుపక్షాలు మొండిపట్టు పట్టడంతో సభలు సాగకుండా వాయిదాలు పడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment