ప్రధానికి సభకొచ్చే దమ్ము లేదా?
లలిత్ మోదీకి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రహస్యంగా.. చాటుమాటుగా ఎందుకు సాయం చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రశ్నించారు. లలిత్ మోదీ వివాదంపై గురువారం సభలో చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ ఆవేశంగా మాట్లాడుతూ సుష్మా స్వరాజ్పై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. లోక్సభలో కూర్చున్నప్పుడు సుష్మా స్వరాజ్ తనవద్దకు వచ్చి 'బాబూ.. నీకు నామీద ఎందుకు కోపం అని అడిగారు. నాకు కోపం లేదు.. మీరంటే నాకు గౌరవం అని చెప్పాను' అని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ అన్నారు. అసలు ప్రధానమంత్రి సభకు ఎందుకు రావట్లేదని, ఆయనకు సభకు వచ్చే దమ్ము లేదా అని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- సుష్మాజీ, నేను అందరితో చెబుతున్నాను.. మీరు మీ కళ్లు కిందకు దించుకున్నారు.
- అవునా కాదా.. ఇప్పుడు మీరు ఎందుకిలా అన్నారు?
- మీ కుటుంబంతో లలిత్ మోదీకి సంబంధం ఉంది.
- వాళ్లు అతడి లీగల్ వ్యవహారాలు చూస్తారు, మీరు మీ మంత్రిత్వశాఖతో వాళ్లకు సాయం చేస్తారు
- మీరు కూడా సాయం చేస్తారు.. ఏదైనా ఆస్పత్రి వాళ్లు వస్తారు, ఎవరైనా ఎవరికైనా సాయం చేస్తారు.
- కానీ, ప్రపంచంలో సుష్మా చాటుమాటుగా సాయం చేసిన మొదటి మానవతావాది.
- మీ వాళ్లకు ఎంత సొమ్ము ముట్టింది అన్నది నా మొదటి ప్రశ్న
- ఈ పని మీరు రహస్యంగా ఎందుకు చేశారు.. ప్రధానికి ఎందుకు చెప్పలేదు? అసలు చెప్పారా, చెప్పలేదా?
- 12 కోట్ల రూపాయలు లలిత్ మోదీ ఇచ్చారా లేదా?
- వాణిజ్య లావాదేవీలలో రెండు రకాల వ్యక్తులకు లాభం కలుగుతుంది.
- లలిత్ మోదీకి ఎలాంటి లాభం కలిగింది?
- లంచాలు తీసుకోను.. తీసుకోనివ్వబోనని మోదీ చెప్పారు.. ఇప్పుడు చేసిందేంటి?
- వీళ్లు మిమ్మల్ని రక్షించడం లేదు.. మరింత నష్టం చేస్తున్నారు.. మీరు మాట్లాడితేనే రక్షణ ఉంటుంది. మాట్లాడేందుకు భయపడొద్దు
- మన్ కీ బాత్ అంటున్నారు.. దేశం మీ మాటలు వినాలనుకుంటోంది. అవి కూడా చెప్పండి.
- అసలు ఈ చర్చ జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభలో ఎందుకు లేరు?
- లలిత్ మోదీని ఎవరు.. ఎందుకు రక్షించారు, మంత్రి రక్షిస్తున్నారా, ఆమె కూతురు రక్షిస్తోందా, లేదా ఒక ముఖ్యమంత్రి రక్షిస్తున్నారా