'రాహుల్ ఓ జ్ఞానంలేని మేధావి'
న్యూఢిల్లీ: మరోసారి సుష్మా స్వరాజ్కు బీజేపీ అండగా నిలిచింది. ఆమె ఎలాంటి తప్పు చేయలేదని లోక్సభలో స్పష్టం చేసింది. బుధవారం రాహుల్ గాంధీ ప్రసంగం పూర్తయ్యాక కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ లలిత్ గేట్ వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ జ్ఞానం లేని మేధావి అని ఆయన తీవ్రంగా విమర్శించారు. లలిత్ గేట్ వ్యవహారంలో సుష్మా స్వరాజ్ రాజీనామా చేసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. ఆమెపై చేసిన ఆరోపణలన్నీకూడా నిరాధారమైనవని చెప్పారు.
ఐపీఎల్ కుంభకోణం 2009లో వెలుగులోకి వచ్చిందని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరిగా వ్యవహరించకపోవడం ద్వారానే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పారు. రిజర్వ్ బ్యాంకు తెలియకుండానే దక్షిణాఫ్రికా బ్యాంకుకు ఐపీఎల్ సొమ్ము తరలిందని చెప్పారు. ఈ వ్యవహారంలో నాటి కాంగ్రెస్ పార్టీ లలిత్ మోదీకి లైట్ బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చిందని, ఇది దేశియ విమానాశ్రయాలకు మాత్రమే వర్తిస్తుందని, కానీ, అప్పటికే లలిత్ దేశం విడిచి లండన్ వెళ్లారని చెప్పారు. ఇక ఫెమా చట్టం కింద నాడు కేసులు పెట్టారని, దీని ప్రకారం అరెస్టు చేయడం కుదరదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ మోదీ తప్పించుకు విదేశాల్లో తిరుగుతున్నారని అన్నారని, కానీ చట్టం దృష్ట్యా కోర్టుల దృష్ట్యా అది తప్పించుకొని తిరిగినట్లు కాదని వివరన ఇచ్చారు. బ్రిటన్ చట్టాల ప్రకారం ఏమేం చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోండని తాము బ్రిటన్కు చెప్పామని, అసలు కాంగ్రెస్ పార్టీ సరిగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవే కావని అన్నారు. తాము ఇప్పుడు లలిత్ మోదీ విషయంలో సరిగానే వ్యవహరిస్తున్నామని, అందుకే మనీ లాండరింగ్ కింద కేసులు నమోదుచేసినట్లు వివరించారు.