తప్పులు చేసింది మేము కాదు.. మీరు
అధికారంలో ఉండగా తప్పుల మీద తప్పులు చేసింది కాంగ్రెస్ నాయకులే తప్ప.. తాను ఎలాంటి తప్పు చేయలేదని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. లలిత్ మోదీ వ్యవహారంపై లో్క్సభలో బుధవారం జరిగిన చర్చకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తుండటంతో.. తన సమాధానం వినేందుకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని చెప్పారు.
పి. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలోనే ఆదాయపన్ను శాఖ ఆయన భార్య నళినీ చిదంబరాన్ని తమ న్యాయవాదిగా నియమించుకుందని, ఇది తప్పుకాదా అని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. తన భర్త లలిత్ మోదీ పాస్పోర్టు విషయంలో న్యాయవాదిగా వ్యవహరించలేదని ఆమె చెప్పారు. లోక్సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ఆరోపణలపై ఆమె ఈ విషయాలు చెప్పారు. తన కూతురు 9వ నెంబరు జూనియర్ అని, ఆ నెంబరులో ఉండే న్యాయవాదికి ఎవరైనా ఒక్క రూపాయైనా ఇస్తారా అని ప్రశ్నించారు. లలిత్ మోదీ నుంచి ఈ కేసులో తన కూతురికి ఒక్క రూపాయి కూడా లభించలేదని స్పష్టం చేశారు.
తాను తన తప్పు అంగీకరించినట్లు మల్లికార్జున ఖర్గే చెబుతున్నారని, కానీ.. తాను మాత్రం కేవలం కేన్సర్తో బాధపడుతున్న ఒక భారతీయ పౌరురాలికి సాయం చేశానని మాత్రమే చెప్పానని ఆమె అన్నారు. అలాంటి మహిళకు సాయం చేయడం తప్పే అయితే.. తాను తన తప్పు అంగీకరిస్తాననే అన్నానని గుర్తుచేశారు. దీన్ని తాను తప్పు అంగీకరించినట్లు ఖర్గే భావిస్తారాన అని ప్రశ్నించారు.
కాగా, ఈ చర్చ సందర్భంగా ఖత్రోచీ నుంచి బోఫోర్స్ వరకు కాంగ్రెస్ మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ సుష్మా స్వరాజ్ ప్రస్తావించారు. అయితే.. ఆమె మాట్లాడుతున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. కానీ సుష్మా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆమె ఒక్కో ఆరోపణ చేస్తున్నపుడు కాంగ్రెస్ ఎంపీలు నినాదాల మీద నినాదాలు చేస్తూనే ఉన్నారు. 15 వేల మంది మరణానికి కారణమైన ఆండర్సన్ను దేశం నుంచి దాటించింది కాంగ్రెస్ నాయకత్వం కాదా అని నిలదీశారు. క్విడ్ ప్రో కో ప్రకారమే ఆండర్సన్ను దేశం దాటించారని ఆరోపించారు. శారదా కుంభకోణంలో నళినీ చిదంబరం కోటి రూపాయల ఫీజు తీసుకున్నారని అన్నారు. చాటుమాటు కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకే అలవాటు తప్ప తమకు అలవాటు లేదని చెప్పారు.