అమెరికాలో దాడులు.. లోక్‌సభలో ప్రకటన!
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై ఇటీవలికాలంలో జరిగిన జాత్యాంహకార దాడులపై లోక్‌సభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ప్రకటన చేశారు. అమెరికాలోని పరిస్థితిని విదేశాంగశాఖ నిశితంగా గమనిస్తున్నదని ఆమె తెలిపారు. భారతీయులపై జరిగిన జాత్యాంహకార దాడులపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణను వేగవంతం చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని తాము కోరామని సుష్మా వెల్లడించారు.
ఎన్నారైలు కూచిభొట్ల శ్రీనివాస్ తదితరులపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఆ దేశ ఉన్నతాధికారులు ఖండించారని చెప్పారు. బాధిత కూచిభోట్ల శ్రీనివాస్ దీప్ రాయ్ కుటుంబాలతో తాము మాట్లాడామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె సభకు హామీ ఇచ్చారు. విదేశాల్లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేశారు. జాత్యాంహకార కాల్పుల్లో మృతిచెందిన కూఛిబోట్ల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో తాము మాట్లాడమని చెప్పారు. సకాలంలో తమకు పూర్తి సహకారం అందించడం.. భారత్‌తో తమ అనుబంధాన్ని చాటుతున్నదని కూచిభొట్ల శ్రీనివాస్ భార్య అమెరికాలోని భారత రాయబారికి రాసిన లేఖలో పేర్కొన్నారని ఈ సందర్భంగా సుష్మా తెలిపారు.