సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా గుర్తించాలన్న సుష్మా ప్రతిపాదనపై థరూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం వీరిద్దరి మధ్య లోక్‌సభలో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
సుష్మా ఏం చెప్పారంటే... హిందీని ఇప్పటిదాకా ఐరాసలో అధికార భాషగా గుర్తించలేకపోవటంపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ, అదంతా సులువైన అంశం కాదు. సభ్యుల మద్దతుతోపాటు ఆ క్రమంలో ఆర్థికంగా కూడా చాలా వెచ్చించాల్సి ఉంటుంది. 40 కోట్ల రూపాయలు కాదు.. 400 కోట్ల రూపాయాలు వెచ్చించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేర ప్రయత్నాలు ప్రారంభించాం కూడా. భారత్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు అండగా నిలుస్తామని హామీ కూడా ఇచ్చాయి అని ఆమె వివరించారు.
ఇంతలో శశిథరూర్ కలగజేసుకుని సుష్మా ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘హిందీ మన జాతీయ భాష కాదు. అధికార భాష మాత్రమే. అసలు ఐరాసలో మనం అధికార భాషను కలిగి ఉండాల్సిన అవసరం ఏంటి? ఐరాసలో పని చేసిన అనుభవంతో నేను చెబుతున్నా 22 దేశాల్లో మాట్లాడే అరబిక్‌నే చేర్చనప్పుడు.. హిందీని చేరుస్తారనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఏదో ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి హిందీలో అక్కడ ప్రసంగించారని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ, భారతీయులు దాన్ని గొప్పగా భావించటం లేదు. ప్రధాని తమిళ వ్యక్తి అయితే.. తమిళ్ మాట్లాడితే.. ఆ భాషను ఐరాసలో అధికార భాష చేయాలని ప్రతిపాదిస్తారా? అంటూ థరూర్ మండిపడ్డారు.
అయితే సుష్మా మాత్రం శశిథరూర్ వ్యాఖ్యలను తేలికగా తీసుకున్నారు. 129 దేశాలకు మద్దతు తెలపాలని కోరినట్లు లోక్‌సభకు ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment