న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించి జూన్ 26కు 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ఈ అంశం తాజాగా లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. ముందుగా దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావించడం, స్పీకర్ ఓం బిర్లా దీనిపై తీర్మానం చదవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ నాటి అత్యయిక స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ అప్రజాస్వామికమే కావచ్చు. కానీ, రాజ్యాంగ విరుద్ధం కాదన్నారు.
ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సెంగోల్‌ను భర్తీ చేయడం, నీట్ పేపర్ లీక్‌లు వంటి అంశాలపై మాట్లాడారు. అలాగే ఎమర్జెన్సీపై మోదీ, రాష్ట్రపతి, స్పీకర్ చేసిన వ్యాఖ్యలను థరూర్ తప్పుబట్టారు. 49 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనను ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చి, చర్చిస్తున్నారని ప్రశ్నించారు.
‘ఎమర్జెన్సీని నేను విమర్శిస్తా. ఆ చర్యను నేను సమర్థించడం లేదు. గర్వించదగ్గ విషయమనీ చెప్పట్లేదు. అత్యయిక స్థితి సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమనే భావిస్తున్నా. అయితే, అది వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదు. దేశంలో అంతర్గత ఎమర్జెన్సీని విధించేందుకు రాజ్యాంగంలో నిబంధన ఉంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ పరిధిలోనే ఉంది. రాజ్యాంగ విరుద్ధమైన దాడి, రాజ్యాంగంపై దాడి అని రాష్ట్రపతి అనడం చట్టపరంగా సరికాదు' అని పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ విమర్శలు గుప్పించారు. ఎన్డీయే ప్రభుత్వం 1975 లేదా 2047 గురించి మాట్లాడుతోంది కానీ.. వర్తమాన అంశాలను ప్రస్తావించట్లేదని మండిపడ్డారు. దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మోదీ సర్కారు ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని దుయ్యబట్టారు. నీట్ పేపర్ లీక్ వివాదం, నిరుద్యోగం సమస్యలు, మణిపుర్ అల్లర్ల వంటి కీలక అంశాలపై వారు దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాగా తిరువనంతపురం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment