
అహ్మదాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతో మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందని, ఈరోజు కాకపోయినా రేపైనా వాస్తవాలు బయటపడతాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. ఈ క్రమంలో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి తీసుకురావాల్సిందేనని గట్టిగా గళం వినిపించారాయన. బుధవారం ఏఐసీసీ సమావేశంలో పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ఖర్గే.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచమంతా ఈవీఎంల నుంచి బ్యాలెట్ పేపర్ల వైపు మళ్లుతోంది. కానీ, మనం ఇంకా ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాం. ఇదే అతి పెద్ద మోసం. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈవీఎంలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మళ్లీ.. ఈవీఎంల మోసాల్ని నిరూపించాలని వాళ్లే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ విషయంలో యువతరం మేల్కొవాలి. బ్యాలెట్ పేపర్లు కావాలని ముందుకు వచ్చి పోరాడాలి.
మహారాష్ట్రలో ఏం జరిగింది?. ఈవీఎంలతో అతిపెద్ద మోసం జరిగింది. అక్కడ ఎలాంటి ఓటర్ల జాబితాను రూపొందించారు?. బీజేపీ 90 శాతం సీట్లు ఎలా నెగ్గింది?. ఎన్నికల చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు. అసలు మహారాష్ట్ర ఎన్నికలే పెద్ద మోసం. ఈ అంశాన్ని మేం దాదాపు ప్రతీ చోటా ప్రస్తావించాం. రాహుల్ గాంధీ గట్టిగా గళం వినిపించారు. హర్యానాలోనూ అదే జరిగింది. మా లాయర్లు, నేతలు.. ఆ దొంగలను దొరకబట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో ఒకనాటికి వాస్తవాలు బయటపడక తప్పదు.
చట్టసభల్లో ప్రతిపక్షంగా మన గళం వినిపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఏకపక్షంగా కేంద్రం బిల్లులను ఆమోదించుకుంటోంది. అలాంటప్పుడు ప్రజల గొంతుకను ఎలా వినిపిస్తాం?. అమెరికా టారిఫ్‌ల మీద చర్చకు అవకాశం ఇవ్వలేదు. మణిపూర్‌పై వేకువ జామున 4 గంటలకు చర్చిస్తామన్నారు. ఉదయం చర్చించాలని నేను అడిగితే తిరస్కరించారు. ప్రభుత్వం ఏదో దాస్తుందో కాబట్టే ఇలాంటి పనులు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని నెమ్మది నెమ్మదిగా అంతం చేయాలని చూస్తున్నారు. రాజ్యాంగం మీద గత 11 ఏళ్లు దాడి జరుగుతూనే ఉంది. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది.
కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధి కోసం పలు సంస్థలను స్థాపించింది. కానీ, ప్రభుత్వ సంస్థలను మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ వ్యక్తులపరం చేసింది. జాతి ప్రయోజనాల కంటే.. ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలే ముఖ్యంగా ఈ ప్రభుత్వం భావిస్తోంది. ఆఖరికి.. రిజర్వేషన్లనూ ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే దేశాన్ని అమ్మేసే ప్రమాదం లేకపోలేదు.
బీజేపీ ఆరెస్సెస్‌లు మతపరమైన అంశాలతో వివాదాలు సృష్టించాలనుకుంటున్నాయి. మసీదుల కింద శివలింగాలను వెతకడం లేదంటూనే ఆ పని చేస్తున్నారు. ప్రధాని మోదీ మంట పెడితే.. ఆరెస్సెస్ దానికి ఆజ్యం పోస్తోంది. రాజస్థాన్ ఆల్వార్ ఘటనతో బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి బయటపడింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సౌజ్ డ్యూటీ సుంకాలు పెంచడం, గ్యాస్ ధరలను పెంచడం ద్వారా ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో అత్యాచారాలు పెరిగిపోతుంటే.. అమిత్ షా కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు?. పలు రాష్ట్రాల్లో గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. తమిళనాడు గవర్నర్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఒక చెంపపెట్టు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు పలు చట్టాలు చేశాయి. భూసేకరణ చట్టం, నిర్భంద విద్య, అటవీ రక్షణ చట్టాలు చేసింది. ఈ అంశాలపై మనం పోరాడాల్సిన అవసరం ఉంది.
ఇక డీసీసీలదే పవర్
ఏఐసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పవర్స్ కట్టబెట్టింది. ఇక నుంచి అభ్యర్థుల ఎంపికలోనూ డీసీసీలదే నిర్ణయమని వెల్లడించింది. ఇది ఏఐసీసీ నిర్ణయంగా ఖర్గే బుధవారం ప్రకటించారు.