
న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుడు, ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) ఎవరివాడనే దానిపై కాంగ్రెస్-బీజేపీ మధ్య రాజకీయాలు ముసుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశంలో ఆ పార్టీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసింది. పార్టీ తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. పటేల్ వారసత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీసేసుకుని, దానిని నెహ్రూ-గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్(Congress) సారధ్యంలో జరిగిన విస్తృత కార్యవర్గ సమావేశంలో (సీడబ్ల్యూసీ) ‘స్వాతంత్ర్య ఉద్యమ సారథి - మా సర్దార్ వల్లభాయ్ పటేల్’ అనే తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది. గాంధీ, పటేల్ జన్మస్థలమైన అహ్మదాబాద్‌లో దేశానికి కొత్త దిశానిర్దేశాన్ని అందించేందుకు తమ నాయకత్వం సమావేశమైందని పేర్కొంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అలాగే పటేల్.. జవహర్‌లాల్ నెహ్రూ మధ్య విభేదాలు ఉన్నాయంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఇరువురు నేతలు ఒకే నాణేనికున్న బొమ్మబొరుసులాంటి వారిని, వారి మధ్య గొప్ప అనుబంధం ఉందని కాంగ్రెస్ పేర్కొంది.
గుజరాత్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ స్వస్థలం కూడా కావడంతో ఇక్కడ సత్తా నిరూపించుకునేందుకు కాంగ్రెస్ తపత్రయ పడుతోంది. ఇది తమ సొంత గడ్డ అని నిరూపించుకునేలా బీజేపీకి సవాల్ విసరాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ(BJP) సర్దార్ పటేల్‌ను తమ జాతీయవాద సిద్ధాంతంలో ఒక భాగంగా ఇప్పటికే మలచుకుంది. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్‌లోని ఆనంద్‌లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా ‘జోధ్‌పూర్, జూనాగఢ్, హైదరాబాద్, లక్షద్వీప్ ఈ రోజు భారతదేశంలో భాగంగా ఉన్నాయంటే, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనేనని, ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలను నెరవేర్చారు’ అని పేర్కొన్నారు. ఇదేవిధంగా బీజేపీ 2018లో నర్మదా నది తీరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చెందిన 182 మీటర్ల ఎత్లయిన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించి, పాటీదార్ సమాజాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.
గుజరాత్(Gujarat)లో పాటిదార్ సమాజం రాజకీయంగా ప్రభావవంతంగా ఉంది. 182 సభ్యుల అసెంబ్లీలో 40-50 సీట్లపై పాటీదార్లు తమ ప్రభావం చూపిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం చాలా ఏళ్లు గుజరాత్‌ను పాలించిన కాంగ్రెస్, 1995లో అధికారాన్ని కోల్పోయింది. మళ్లీ తిరిగి ప్రాభవాన్ని పొందలేకపోయింది. అయితే ఇప్పుడు సర్దార్ పటేల్ వారసత్వాన్ని తిరిగి స్వీకరించడం ద్వారా, పాటిదార్ ఓట్లను ఆకర్షించి, బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బీజేపీ ఇప్పటికే పటేల్ వారసత్వాన్ని తమ సొంతం చేసుకున్న తరుణంలో కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమవుతుందా లేక ఆలస్యమైన చర్యగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ ఆరోపణలపై చైనా ఆగ్రహం