kuchibhotla Srinivas
-
శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో కొత్త ట్విస్ట్
వాషింగ్టన్ : అమెరికాలో దారుణంగా హత్యకు గురైన ఇండియన్ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆడం పూరింటన్ తాను నిరాపరాధినంటూ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఫెడరల్ ప్రాసెక్యూటర్ మాత్రం పురింటన్ కావాలనే శ్రీనివాస్, అలోక్ మదాసానిలను లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తొలివాదనలు జరగగా.. తదుపరి విచారణను వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేశారు. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అతనికి శిక్ష పడటం ఖాయంగానే కనిపిస్తోంది. అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురింటన్ (51) కన్సాస్ సిటీ బార్లో కూచిబొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపటంతోపాటు మరో ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచాడు. జాత్యాంహకార దాడి, మారణాయుధాలు కలిగి ఉండటం అనే అభియోగాలు పురింట్‌న్‌పై నమోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘటనను జాతి వివక్ష దాడిగా విచారణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది కూడా. గన్‌తో కాల్పులు జరిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింటన్ అరుపులు పెట్టినట్లు సాక్ష్యులు తెలిపారు. అభియోగాలు రుజువై దోషిగా తేలితే పురింటన్‌కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది. -
అమెరికాలో దాడులు.. లోక్‌సభలో ప్రకటన!
-
అమెరికాలో దాడులు.. లోక్‌సభలో ప్రకటన!
న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయులపై ఇటీవలికాలంలో జరిగిన జాత్యాంహకార దాడులపై లోక్‌సభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ప్రకటన చేశారు. అమెరికాలోని పరిస్థితిని విదేశాంగశాఖ నిశితంగా గమనిస్తున్నదని ఆమె తెలిపారు. భారతీయులపై జరిగిన జాత్యాంహకార దాడులపై ఎఫ్‌బీఐ విచారణ జరుపుతున్నదని, ఈ విచారణను వేగవంతం చేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వాన్ని తాము కోరామని సుష్మా వెల్లడించారు. ఎన్నారైలు కూచిభొట్ల శ్రీనివాస్ తదితరులపై జరిగిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ఆ దేశ ఉన్నతాధికారులు ఖండించారని చెప్పారు. బాధిత కూచిభోట్ల శ్రీనివాస్ దీప్ రాయ్ కుటుంబాలతో తాము మాట్లాడామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆమె సభకు హామీ ఇచ్చారు. విదేశాల్లోని భారతీయుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ఆమె స్పష్టం చేశారు. జాత్యాంహకార కాల్పుల్లో మృతిచెందిన కూఛిబోట్ల శ్రీనివాస్ కుటుంబసభ్యులతో తాము మాట్లాడమని చెప్పారు. సకాలంలో తమకు పూర్తి సహకారం అందించడం.. భారత్‌తో తమ అనుబంధాన్ని చాటుతున్నదని కూచిభొట్ల శ్రీనివాస్ భార్య అమెరికాలోని భారత రాయబారికి రాసిన లేఖలో పేర్కొన్నారని ఈ సందర్భంగా సుష్మా తెలిపారు. -
అశ్రు‘నయన’ ప్రశ్న
బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెలిగేవాడు. 2006 ఆగస్టులో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్’ ద్వారా పలకరించుకునే వాళ్లం. తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాబంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్‌ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. అందుకే నాలుగేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను. ఎన్నో కలలతో కాన్సస్‌కు వచ్చాం.. విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం ఆయన తపించేవాడు. రాక్వెల్ కోలిన్స్ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫ్లయిట్ కంట్రోల్ సిస్టమ్‌పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లయిట్ కంట్రోల్ కంప్యూటర్ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్వెల్లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్ రాపిడ్స్‌లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్‌లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్ స్వయంగా రంగులేశాడు.. గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు. ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి.. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది ఆలోచించని ఒకే ఒక వ్యక్తి మూలంగా.. పోలీసులు చెబుతుంటే నమ్మలేదు.. ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపో యా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా? మీరు శ్రీని వాస్‌ను చూశారా? తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా? మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురిం చేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నిం టికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమా ధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్‌లో ఉంటు న్న శ్రీనివాస్ తమ్ముడికి ఫోన్ చేశా. నమ్మలేదు... నేనేదో జోక్ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మి త్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్ లూ యిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మి త్రులు వచ్చారు. న్యూయార్క్, నూజెర్సీలో ఉండే అతని బంధువులు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి త ను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్ ఎంగేజ్ మెంట్ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ కొరకు వీకెండ్లో షాపింగ్ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్‌కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని.. ఇమిగ్రేషన్‌పై ఆందోళన చెందేవాడు.. ఆయనకు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్ గురించి, నరేంద్ర మోదీ గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. ఇమిగ్రేషన్ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్4 ఈఏడీ రూల్ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు. ‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లలో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట. వెళ్లిపోదామా అని అడిగేదాన్ని.. ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఆత్మీయ ఆలింగనం లేదు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే..! ఈ కష్టం ఎవరికీ రావొద్దు... గార్మిన్ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్ నగర మేయర్‌కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్టచ్ సొల్యూషన్స్ సీఈవో ఫ్రాంక్‌కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నేరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు. మార్క్ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబ్‌బచ్చన్ సర్, షారూక్ ఖాన్ సర్... మేము మీకు వీరాభిమానులం. ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేం కలలుగన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలసి నివసించడానికి ఇది సురక్షితమేనా? – సునయన దుమాలా నువ్వు ఎప్పటికీ నా వాడివే.. కాన్సస్ ఎయిర్‌పోర్ట్‌లో ఎంతోమంది నన్ను గుర్తు పట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పర మార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి.. చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను. ఐ లవ్ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే. టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటు న్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. నాకో బిడ్డ ఉంటే తనలో శ్రీనును చూసుకునేదాన్ని.. ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అందత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమార్లు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపో యాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్నచిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం. ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్‌కు మాకిద్దరికీ బాక్స్‌లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్ బాక్స్ నేనే సర్దుకుంటే... ఏం తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్ చేశావనుకో... ఈరోజు లంచ్‌లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్‌లో ఆర్నబ్ గోస్వామి షో ఎంజాయ్ చేసేవాడు. మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా? అని ఎదురుచూస్తుండే వాడు. పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్‌ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలిచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా..’ అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్‌ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని. - ఫేస్బుక్లో తన ఆవేదనకు అక్షరరూపమిచ్చిన సునయన (అమెరికాలోని కాన్సస్‌లో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ అర్ధాంగి సునయన 28–02–2017న తన ఫేస్బుక్ అకౌంట్లో చేసిన పోస్ట్) -
ప్రతిభావంతుల వలసలకు ఓకే!
మెరిట్ ఆధారిత వలస విధానం ⇒ కెనడా, ఆస్ట్రేలియా తరహాలో అమలు ⇒ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి.. కాంగ్రెస్‌నుద్దేశించి తొలి ప్రసంగం వాషింగ్టన్: వలస విధానంపై పునరాలోచనలో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతిభ ఆధారిత వలసల విధానాన్ని అవలంబించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా భారత్ వంటి దేశాల నుంచి వచ్చే సాంకేతిక నిపుణులకు మేలు జరుగుతుంది. అధ్యక్షుడిగా కాంగ్రెస్‌నుద్దేశించి (అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం) మంగళవారం రాత్రి తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ‘కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ప్రతిభ ఆధారిత వలసల వ్యవస్థ అమల్లో ఉంది. ఇప్పుడున్న తక్కువ నైపుణ్య వలసల విధానం నుంచి ప్రతిభ ఆధారిత వ్యవస్థకు మారటం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ విధానం కార్మికుల వేతనాలను పెంచటం ద్వారా వెనుకబడిన వర్గాలు మధ్యతరగతి వర్గంలోకి వచ్చేందుకు దోహదపడుతుంది’ అని ట్రంప్ వెల్లడించారు. ఈ అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు. లక్షలకొద్ది ఉద్యోగాలను తిరిగి తీసుకొస్తానని భరోసా ఇచ్చిన ట్రంప్.. న్యాయమైన వలసల్లో సంస్కరణలు తీసుకురావటం ద్వారా అమెరికన్ వర్కర్లకు ఉద్యోగభద్రత ఇవ్వగలమన్నారు. ప్రస్తుత వ్యవస్థ ద్వారా పేద వర్కర్లకు వేతనాలివ్వకపోవటంతోపాటు పన్నుకట్టేవారిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోందని ట్రంప్ తెలిపారు. రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి పనిచేయటం ద్వారా వలసల విధానంతోపాటు మరెన్నో సమస్యలను పరిష్కారం తీసుకురావొచ్చన్నారు. ‘మన అమెరికా’ అనే భావనను పెంచటం ద్వారా రోజూవారి సవాళ్లకు సరైన పరిష్కారం లభిస్తుందని ట్రంప్ వెల్లడించారు. గత ప్రభుత్వా లు తీసుకున్న నిర్ణయాల వల్ల అమెరికా పరిశ్రమలతోపాటు ఇతర రంగాల్లో చాలా వెనకబడిందన్నారు. చైనా 2001లో డబ్ల్యూటీవోలోచేరిన తర్వాత, నాఫ్తా (ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) అమల్లోకి వచ్చాక దాదాపు 60 వేల ఉద్యోగాలను అమెరికా కోల్పోయిన విషయాన్ని ట్రంప్ సభకు గుర్తుచేశారు. దేశంలో 4.3 కోట్ల మంది పేదరికంలో ఉంటే... మరో 4.3 కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ స్టాంపులపై ఆధారపడుతున్నారని ట్రంప్ వెల్లడించారు. అవినీతిని సహించం ‘ప్రభుత్వంలో అవినీతిని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాం. ఉన్నతాధికారులు తప్పుచేస్తే ఐదేళ్ల నిషేధం, విదేశీ ప్రభుత్వానికి ఎవరైనా లాబీయిం గ్ చేస్తే.. జీవితకాల నిషేధం విధిస్తున్నాం’ అని ట్రంప్ చెప్పారు. కేర్‌ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్యబీమానే ప్రతి అమెరికన్ తప్పనిసరిగా తీసుకోవాలనేది (ఒబామా) అమెరికా విధానాలకు సరిపోదని, తమ ప్రభుత్వం తక్కువ ధరకు బీమా అందుబాటులో ఉండేలా మార్పులు చేస్తోందన్నారు. విదేశాల్లో మౌలిక వసతులపై లక్షల కోట్ల డాలర్లను అమెరికా వెచ్చించిందని.. స్వదేశంలో మౌలిక వసతులను విస్మరించిందన్నారు. అమెరికాకు దాదాపు 800 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటుందని ట్రంప్ గుర్తుచేశారు. స్వేచ్ఛావాణిజ్యం ఉండాలని అయితే సముచితంగా ఉంటే బాగుంటుందన్నారు. దేశంలో పన్ను కటుడున్న వారిపైనే ఎక్కువ భారం పడుతుందని.. దీన్ని తగ్గించేందుకు పన్ను విధానంలో సంస్కరణలు తీసుకురానున్నట్లు ట్రంప్ తెలిపారు. కాంగ్రెస్‌లో ప్రసంగానికి ముందు న్యూస్ యాంకర్స్‌తో జరిగిన భోజన సమావేశంలోనూ వలసలపై ఇరువైపులా రాజీధోరణి అవసరమన్నారు. వలసల చట్టంలో మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్న ట్రంప్.. దీని ద్వారా అమెరికాలో అక్రమంగా ఉంటున్న కొందరికి చట్టబద్ధత ఇవ్వటంతోపాటు చిన్నతనంలో చట్టవ్యతిరేకంగా ఇక్కడికి తల్లిదండ్రులతోపాటు వచ్చిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చే విషయంలో ఆలోచన చేయాలన్నారు. ట్రంప్ ప్రసంగంపై 30 లక్షల మంది ట్వీట్ల ద్వారా స్పందించారు. ‘నల్ల’ జాతీయులకు ట్రంప్ కానుక అమెరికాలోని చరిత్రాత్మక నల్లజాతీయుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల (హెచ్‌బీసీయూ)కు మేలుచేసే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సంతకం ద్వారా వచ్చే ఫెడరల్ బడ్జెట్లో ఈ హెచ్బీసీయూల బలోపేతానికి భారీ బడ్జెట్ వస్తుందని ఈ కాలేజీల ప్రెసిడెంట్లు భావిస్తున్నారు. ఒబామా హయాంలో హెచ్బీసీయూలకు ఏడేళ్లలో 4 బిలియన్ డాలర్ల నిధులొస్తే.. ట్రంప్ దీన్ని 25 బిలియన్ డాలర్లకు పెంచుతారని ఆశిస్తున్నారు. ‘దేశంలోని 100 హెచ్బీసీయూలు తిరిగి సమర్థవంతంగా పనిచేసేందుకు కనీసం 25 బిలియన్ డాలర్లు కావాలని అధ్యక్షుడిని కోరాం. అందుకు ఆయన సానుకూలం గా స్పందించారు’ అని ఈ కాలేజీల ప్రతినిధులు తెలిపారు. ‘కాన్సస్’పై అమెరికాకు స్పష్టత ఉంది: భారత్ భారత ఇంజనీర్‌పై కాల్పుల ఘటపై అమెరికా అనుసరిస్తున్న వ్యూహం స్పష్టంగా ఉందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వారి భద్రతే మన ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. అమెరికా అధ్యక్షుడు కూడా ఈ ఘటనను ఖండించారు. అమెరికాలో భారతీయుల భద్రతకు కావాల్సిన అన్ని చర్యలపై మేం దృష్టిసారించాం’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే వెల్లడించారు. వివాదాస్పద నిర్ణయాలు, పనితీరుతో ఇంటాబయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాటిపై కాంగ్రెస్ వేదికగా స్పందించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారి అమెరికన్ కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగిస్తూ.. తన విధానాలపై వస్తున్న విమర్శలకు స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దాదాపు గంట పాటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్.. వలస విధానంపై తన అభిప్రాయాలను, అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాలను, అమెరికాను మళ్లీ గ్రేట్‌గా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. తన విధానాల్లో లోపాలేవీ లేవని తేల్చి చెప్పారు. నిమ్న నైపుణ్య ఆధారిత వలస వ్యవస్థ అమెరికాకు మంచిది కాదని, ఆ వ్యవస్థ స్థానంలో.. ప్రతిభ ఆధారిత వలస విధానం అవసరమని నొక్కి చెప్పారు. కెనడా, ఆస్ట్రేలియాల్లో అదే విధానం అమల్లో ఉందని, తాను కూడా ఆ దిశగానే ముందుకెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై స్పందిస్తూ.. ‘కాన్సస్ కాల్పులు దురదృష్టకరమ’ని వ్యాఖ్యానించారు. ట్రంప్ స్పీచ్‌తో అమెరికన్లు హ్యాపీ అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు)లో కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన మొదటి ప్రసంగం తమలో ఆశావాదాన్ని నింపిందని..ప్రసంగం చూసిన ప్రతి పదిమంది అమెరికన్లలో ఏడుగురు చెప్పారు. సీఎన్ఎన్/ఓఆర్సీ చేసిన పోల్ సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. ప్రసంగం చూసిన 509 మంది అమెరికన్ల అభిప్రాయాలను క్రోడీకరించి సీఎన్ఎన్/ఓఆర్సీ ఈ ఫలితాన్ని వెల్లడించింది. 57 శాతం మంది ట్రంప్ స్పీచ్ పట్ల పాజిటివ్‌గా స్పందించారు. అధ్యక్షుడు మంచి మార్గంలోనే వెళ్తున్నారనీ, సరైన ప్రాథమ్యాలు ఉన్నాయని ప్రతి ముగ్గురిలో ఇద్దరు అభిప్రాయపడ్డారు. 2001లో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రసంగం పట్ల 66 శాతం మంది, 2009లో అప్పటి అమెరికా అధినేత బరాక్ ఒబామా స్పీచ్‌పై 68 శాతం మంది పాజిటివ్‌గా స్పందించారు. ‘ట్రంప్ నిషేధం’ నుంచి ఇరాక్‌కు ఉపశమనం! వాషింగ్టన్: ఏడు ముస్లిం దేశాల ప్రజలు అమెరికాలోకి రాకుండా ట్రంప్ విధించిన నిషేధం నుంచి ఇరాక్‌కు ఉపశమనం కలగనుంది. శ్వేతసౌధంలో పనిచేసే ఓ అధికారి చెప్పిన దానిప్రకారం కొత్తగా తీసుకురానున్న ఉత్తర్వుల్లో ఇరాక్‌పై నిషేధం ఎత్తివేయనున్నారు. ఐసిస్‌పై పోరులో సహకరిస్తున్నందుకుగానూ, ఇరాక్‌పై నిషేధం విషయంలో పునరాలోచించాలని పెంటాగాన్, ఇతర ప్రభుత్వ విభాగాలు సిఫార్సు చేస్తున్నాయి. ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన నిషేధ ఉత్తర్వులను పలు కోర్టులు కొట్టేయడంతో ఈసారి మరింత పగడ్బందీగా ఉత్తర్వులను అధికారులు తయారుచేశారు. కాన్సస్ కాల్పులు దురదృష్టకరం కాన్సస్ ఘటనపై ట్రంప్ ఎట్టకేలకు నోరువిప్పారు. ఈ ఘటనపై భారత–అమెరికన్ సమాజంతోపాటు అమెరికన్ చట్టసభ్యులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ఇటీవల యూదులపై దాడులు, గతవారం కాన్సస్ కాల్పుల ఘటన దురదృష్టకరం. ఇది విద్వేషపూరితమైన దుశ్చర్య. విధానాల విషయంలో భేదాలున్నప్పటికీ.. విద్వేషపూరిత చర్య ఏరూపంలో జరిగినా మనమంతా ఏకగ్రీవంగా ఖండించాలి’ అని ట్రంప్ ఉభయ సభల భేటీలో తెలిపారు. కాన్సస్ కేసు విచారణ జరుగుతున్న కొద్దీ ‘వర్ణ వివక్షతో కూడిన విద్వేషపూరిత చర్య’ అని నిరూపించేలా ఆధారాలు దొరుకుతున్నాయని.. వర్ణ, మత పరమైన దాడులపై అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేస్తున్నారని సభా కార్యక్రమానికి ముందే.. వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌లో ట్రంప్.. కాన్సస్ ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. అయితే, ట్రంప్ తొలి కాంగ్రెస్ ప్రసంగానికి కూచిభొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పిలవకపోవడాన్ని డెమోక్రటిక్ సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పుబట్టారు. -
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
-
శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించిన హిల్లరీ
ఎన్నారై సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ ఘాటుగా స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని, శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పాటు దివంగత శ్రీనివాస్ భార్య సునయన ప్రెస్‌మీట్ పెట్టి ట్రంప్ ఏం సమాధానం చెబుతారని అడిగిన వార్తా కథనం క్లిప్పింగ్ కూడా జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది. కాన్సాస్ కాల్పుల్లో కూచిభొట్ల శ్రీనివాస్ మరణించిన కొద్ది రోజులకే ట్రంప్ ప్రభుత్వం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని అమలుచేస్తోంది. దీని ప్రకారం ఏడు ముస్లిం దేశాలకు చెందిన వాళ్లు అమెరికా రావడానికి వీలుండదు. ఇంతకుముందు ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులకు కోర్టులు అడ్డుకట్ట వేశాయి. దాంతో దాన్ని సవరించి మరో కొత్త చట్టాన్ని తెస్తామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, కూచిభొట్ల శ్రీనివాస్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. ఎయిరిండియా విమానంలో సునయనతోపాటు శ్రీనివాస్ సోదరుడు ఈ మృతదేహాన్ని తీసుకొచ్చారు. శ్రీనివాస్‌తో పాటు ఉన్న అతడి స్నేహితుడు మాడసాని అలోక్ రెడ్డి మీద కూడా 51 ఏళ్ల ఆడమ్ పురిన్టన్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అలోక్ రెడ్డితోపాటు, పురిన్టన్ను ఆపేందుకు ప్రయత్నించిన మరో అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. With threats & hate crimes on rise, we shouldn't have to tell @POTUS to do his part. He must step up & speak out.https://t.co/QKKyXyuqNM — Hillary Clinton (@HillaryClinton) 27 February 2017 అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
పునరావృతం కానివ్వం!
శ్రీనివాస్ సంస్మరణ సభలో కన్సాస్ ఉన్నతాధికారులు ♦ కన్సాస్ సిటీలో భారత అమెరికన్ల శాంతి ర్యాలీ ♦ విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వబోమని ప్రకటన ♦ కూచిభొట్లతో అనుబంధాన్ని నెమరువేసుకున్న మిత్రులు హూస్టన్ : విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్ సిటీలో వందల మంది క్యాండిల్స్ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు. ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్ యోడర్, ఒలేత్ మేయర్ మైక్ కోప్లాండ్, పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్ మేయర్ కోప్లాండ్ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్ చీఫ్ మెంకే వెల్లడించారు. అనురాగం, ఆప్యాయతల కలబోత కూచిభొట్ల శ్రీనివాస్ సంస్మరణ సభ ఉద్వేగంగా సాగింది. ‘శ్రీనివాస్‌తో నాది తొమ్మిదేళ్ల స్నేహబంధం. ప్రతి ఒక్కరికీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత పంచే ఇలాంటి వ్యక్తిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆయన నోటివెంట ఒక్కసారి కూడా చెడు మాట వినబడలేదు. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునేతత్వం ఆయనది. ఆరోజు బార్లో జరిగిన ఘటన మరెక్కడా పునరావృతం కాకూడదు. శ్రీనివాస్ ఇకలేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నా. నాకోసం ఆయనిక్కడుండాల్సింది’ అని అలోక్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కారు కొనుక్కునేంతవరకు రోజూ ఆఫీసుకు శ్రీనివాస్ తన కార్లోనే తీసుకెళ్లేవాడు. ఒక్కరోజు కూడా విసుక్కున్నట్లు కనిపించలేదు. అలాంటి మనుషులను చాలా అరుదుగా చూస్తుంటాం. తొమ్మిదేళ్ల మా స్నేహం తాలూకు జ్ఞాపకాలింకా నా మదిలో మెదులుతున్నాయి’ అని వెల్లడించారు. శ్రీనివాస్ మిత్రులు మరికొందరు కూడా అతని మంచితనం, ఇతరులకు సహాయపడే తత్వాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. ‘గోఫండ్‌మి’ పేరుతో తెరిచిన మూడు వేర్వేరు అకౌంట్లలో ఇప్పటివరకు దాదాపు మిలియన్ (దాదాపు రూ.6.71 కోట్లు) విరాళాలుగా వచ్చాయి. వీటితో అలోక్, ఇయాన్ కు వైద్యం చేయించటంతోపాటు శ్రీనివాస్ కుటుంబానికి సాయం చేయనున్నారు. ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే! భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్ గ్రిలాట్ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. -
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
► ట్రంప్ సర్కారును ప్రశ్నించిన మృతుడు శ్రీనివాస్ భార్య ► మైనారిటీల భద్రతకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ ► విచారణ వేగవంతానికి భారత దౌత్య కార్యాలయం డిమాండ్ ► ఆసుపత్రినుంచి అలోక్ రెడ్డి డిశ్చార్జ్ ► కోలుకుంటున్న మరో బాధితుడు హూస్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఈ ఘటనలో మృతిచెందిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన డిమాండ్ చేశారు. అమెరికాలో మైనారిటీలపై వివక్షాపూరితమైన దాడులు ఆపేందుకు సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా? కాదా? అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని సునయన తెలిపారు. శ్రీనివాస్ ఉద్యోగం చేస్తున్న గార్మిన్ కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ.. ‘ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా? వద్దా? అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా? అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవుదామని ఆయన బార్‌కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్ చేశారు. ‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్‌కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా? హిందువా? క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు. (చదవండి: విద్వేషపు తూటా!) హైదరాబాద్‌లో అంత్యక్రియల కోసం భారత్‌కు బయలుదేరనున్న సునయన.. తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్‌కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్ చేశారు. 2005లో కూచిభొట్ల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్–ఎల్ పాసో (యూటీఈపీ)లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్‌తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యునివర్సిటీలో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేత్లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్ కంపెనీ ఆవరణలో శ్రీనివాస్‌కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అలోక్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రంగంలోకి భారత కాన్సులేట్ కాన్సస్ ఘటనను భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ కేసు విచారణ వేగంగా జరపాలంటూ అమెరికా సర్కారుకు లేఖ రాసింది. హూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కుటుంబానికి అవసరమైన సాయాన్ని ఆయన అందిస్తున్నారు. డిప్యూటీ కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్‌లు ఈ ఘటనలో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబాన్ని, భయంతో ఉన్న స్థానిక భారత సంతతి ప్రజలను కలిసి ధైర్యాన్నిచ్చారు. కాగా, శనివారం అలోక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ (24) ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కాన్సస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కన్సాస్‌లో భారతీయులపై దాడిని ఖండించారు. మతపరమైన దాడులు, హింస సరికాదని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలకు తమ మద్దతుండదని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు. ఖండించిన అమెరికన్ చట్టసభ్యులు కాన్సస్ కాల్పుల ఘటనను అమెరికన్ చట్టసభ్యులు బహిరంగంగా ఖండించారు. దేశంలో ఇలాంటి హింసకు తావులేదని ముక్తకంఠంతో వెల్లడించారు. ‘విద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించం. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారీస్ తెలిపారు. ‘అమెరికాలో ఇలాంటి హింసను ఒప్పుకోం’ అని కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. ‘ఇది ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు. భారతీయులు, భారత్–అమెరికన్ల భద్రతను కట్టుదిట్టం చేయాలి’ అని డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. పలువురు అమెరికన్ చట్టసభ్యులు దాడులపై నిరసన తెలిపారు. బార్లో ఏం జరిగింది? అమెరికాలోని కాన్సస్‌లోని ఆస్టిన్ బార్లో ఇద్దరు భారతీయులపై కాల్పుల ఘటనను.. బాధితుడు అలోక్ రెడ్డి న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో వెల్లడించారు. ‘బార్లో నేను (అలోక్) కూచిభొట్ల శ్రీనివాస్ కూర్చున్నాం. మాకు సమీపంలోనే పురింటన్ (కాల్పులకు పాల్పడిన వ్యక్తి) కూర్చున్నాడు. ఏ వీసాలపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు? అక్రమంగా ఇక్కడ ఉంటున్నారా? అని పురింటన్ అడిగాడు. దీనికి మేం స్పందించలేదు. చాలా మంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని లైట్ తీసుకున్నాం. కానీ మమ్మల్ని దూషిస్తూ.. వీరు అమెరికన్లు కారు అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా బార్ మేనేజర్‌ను తీసుకొచ్చేందుకు లోపలకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందేమో బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత గన్ పట్టుకుని కోపంగా వచ్చిన పురింటన్ మాపై కాల్పులు జరిపాడు. కూచిభోట్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ 24 ఏళ్ల అమెరికన్ యువకుడు పురింటన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.అతన్నీ పురింటన్ కాల్చాడు’ అని అలోక్ రెడ్డి వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేదు అమెరికా అధ్యక్షుడు వలసలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే భారతీయ ఇంజనీర్ హత్యకు కారణమని వస్తున్న వార్తలను వైట్‌హౌస్ ఖండించింది. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. మేం దీన్ని ఖండిస్తున్నాం. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ ఘటనకు సంబంధమే లేదు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవని దీన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు. కాగా, ఈ ఘట నపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గ్యుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, కాన్సస్ కాల్పులకు కారకుడు పురింటోన్ పై ఫస్ట్ డిగ్రీ హత్యకేసు నమోదు చేసినట్లు జాన్సన్ కౌంటీ జిల్లా అటార్నీ స్టీఫెన్ హోవే వెల్లడించారు. ఈ ఘటన విద్వేషపూరిత నేరమా? కాదా? అనే విషయంలో ఎఫ్‌బీఐ విచారణ ప్రారంభమైందన్నారు. కోల్‌కతాలో శ్రీనివాస్‌కు నివాళులు అర్పిస్తున్న మేయర్ సావర్ ఛటర్జీ