ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ ఘాటుగా స్పందించారు. దేశంలో పెరిగిపోతున్న 'జాతివిద్వేష నేరాల'పై ట్రంప్ మాట్లాడాల్సిందేనని, శ్రీనివాస్ హత్యకు ఏం సమాధానం చెబుతారని అన్నారు. ''దేశంలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు తన పని తాను చేయాలని మనం చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆమె ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో పాటు దివంగత శ్రీనివాస్ భార్య సునయన ప్రెస్‌మీట్ పెట్టి ట్రంప్ ఏం సమాధానం చెబుతారని అడిగిన వార్తా కథనం క్లిప్పింగ్ కూడా జతచేశారు. అమెరికాలో భారతీయుల భద్రతను ఆమె సూటిగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్లపై కాల్పుల తర్వాత ఒక్కసారిగా అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష దాడులు, ఇతర నేరాలపై చర్చ పెరిగింది.