
వాషింగ్టన్ : అమెరికాలో దారుణంగా హత్యకు గురైన ఇండియన్ టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యకేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆడం పూరింటన్ తాను నిరాపరాధినంటూ ఓ పిటిషన్ దాఖలు చేశాడు.
అయితే ఫెడరల్ ప్రాసెక్యూటర్ మాత్రం పురింటన్ కావాలనే శ్రీనివాస్, అలోక్ మదాసానిలను లక్ష్యంగా చేసుకునే దాడికి పాల్పడ్డాడని తెలిపారు. 24 ఏళ్ల అమెరికన్ ఇయాన్ గ్రిల్లాట్ కూడా ఘటనలో తీవ్ర గాయాలపాలయ్యాడని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం తొలివాదనలు జరగగా.. తదుపరి విచారణను వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేశారు. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అతనికి శిక్ష పడటం ఖాయంగానే కనిపిస్తోంది.
అమెరికా నేవీ మాజీ ఉద్యోగి ఆడమ్ పురింటన్ (51) కన్సాస్ సిటీ బార్‌లో కూచిబొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపటంతోపాటు మరో ఇద్దరినీ తీవ్రంగా గాయపరిచాడు. జాత్యాంహకార దాడి, మారణాయుధాలు కలిగి ఉండటం అనే అభియోగాలు పురింట్‌న్‌పై నమోదు అయ్యాయి. ఈ ఫిబ్రవరిలో జరిగిన ఈ కాల్పుల ఘటనను జాతి వివక్ష దాడిగా విచారణ చేపట్టినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది కూడా. గన్‌తో కాల్పులు జరిపే ముందు మీ దేశానికి వెళ్లిపోవాలంటూ పురింటన్ అరుపులు పెట్టినట్లు సాక్ష్యులు తెలిపారు. అభియోగాలు రుజువై దోషిగా తేలితే పురింటన్‌కు ఉరిశిక్ష లేదా జీవితఖైదు పడే అవకాశం ఉంది.