ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై విద్వేషపు దాడి | Man charged with kicking, yelling at Muslim Delta employee | Sakshi
Sakshi News home page

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై విద్వేషపు దాడి

Published Fri, Mar 17 2017 12:13 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై విద్వేషపు దాడి - Sakshi

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై విద్వేషపు దాడి

మసాచూసెట్స్‌: అమెరికాలో మరోమారు జాతి విద్వేషం బుసలు కొట్టింది. విదేశాలకు యాత్రకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వస్తూ అమెరికాలోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ముస్లిం ఉద్యోగినిపై చేయి చేసుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రోబిన్‌ రోడ్స్‌(57) ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. మసాచూసెట్స్‌ వెళ్లడానికి కనెక్టింగ్‌ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లాడు.
 
ఎయిర్‌లైన్స్‌ క్యాబిన్‌లో ముస్లిం ఉద్యోగిని ఉండటం చూసి ఉద్రేకం తెచ్చుకున్న రోడ్స్‌ నువ్వు నిద్రపోతున్నావా? లేదా నమాజ్‌ చేస్తున్నావా?. ఏం చేస్తున్నావ్‌? అంటూ గద్దించాడు. ఆ తర్వాత ఉద్యోగిని క్యాబిన్‌లోకి ప్రవేశించేందుకు అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టాడు. రోడ్స్‌ ప్రవర్తనతో షాక్‌ గురైన ఉద్యోగిని భయంతో తాను ఏం తప్పు చేశానని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన రోడ్స్‌ తప్పేం లేకపోయిన వదలనని వ్యాఖ్యానించాడు. దీంతో ఉద్యోగిని అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించగా రోడ్స్‌ అడ్డుకున్నాడు. ఘటనను మొత్తం చూస్తున్న ఓ వ్యక్తి రోడ్స్‌ దృష్టిని మరలించగా ఉద్యోగిని వెంటనే బయటకు పరుగెత్తింది. తేరుకున్న రోడ్స్‌ ఉద్యోగినిని వెంబడించి ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి మాట్లాడాడు.
 
అక్కడితో ఆగని రోడ్స్‌ ఇస్లాం, ఐసిస్‌ అంటూ పెద్దగా అరుస్తూ ప్రస్తుతం ఇక్కడ ట్రంప్‌ ఉన్నాడంటూ నినాదాలు చేశాడు. ముస్లింలను ట్రంప్‌ వెళ్లగొడతారని వ్యాఖ్యానించాడు. కాగా, రోడ్స్‌ను అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 50 వేల డాలర్ల పూచీకత్తుతో కోర్టు అతన్ని బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రోడ్స్‌కు నాలుగేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement