ఫ్రాన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడన్న ఆరోపణలపై పోలీసులు 17 ఏళ్ల యువకుడ్ని కాల్చి చంపడాన్ని నిరసిస్తూ పౌరులు పెను విధ్వంసమే సృష్టి స్తున్నారు. మైనార్టీలపై ఫ్రాన్స్ పోలీసుల అకృత్యాలు ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అమెరికాలో జాత్యహంకారంతో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి హత్యపై కూడా అప్పట్లో ఫ్రాన్స్ నిరసనలతో దద్దరిల్లింది. గతంలో ఫ్రాన్స్‌లో పోలీసుల అతిపై పలుమార్లు తీవ్ర ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. వాటి వివరాలు..
నేహల్ ఎం..
అల్జీరియా సంతతికి చెందిన నేహల్‌కు 17 సంవత్సరాలు. మంగళవారం అతను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసులు ఆ కారు ఆపడానికి ప్రయత్నించారు. అయితే నేహల్ కారు ఆపకుండా తమ మీదకి దూసుకురావడంతో అతనిపై కాల్పులు జరపాల్సి వచి్చందని, దీంతో అందరి ప్రాణాలు కాపాడడానికే అతనిపై కాల్పులు జరిపామన్నది పోలీసుల వాదన. ఆ కాల్పుల్లో నేహల్ మృతి చెందడంతో సామాన్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
పోలీసుల తీరుని నిరసిస్తూ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల వాదనకు పూర్తిగా విరుద్ధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తోంది. ఆ యువకుడిపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. దీంతో వేలాది మంది యువతీయువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నిప్పు పెడుతున్నారు. దేశం ఒక అగ్ని గుండంగా మారింది.
మైకేల్ జెస్లెర్..
2020 నవంబర్‌లో నల్లజాతీయుడైన మ్యూజిక్ ప్రొడ్యూసర్ మైకేల్ జెస్లర్‌పై పోలీసులు తమ కర్కశత్వం ప్రదర్శించారు. పారిస్‌లో ఉన్న జెస్లర్‌ని ఒక కేసులో అరెస్ట్ చేయడానికి నలుగురు పోలీసులు వెళితే అతను ప్రతిఘటించాడన్న సాకుతో వారు తమ దాషీ్టకం ప్రదర్శించారు. జెస్లర్‌ను గొడ్డును బాదినట్టు బాదారు. ఈ వీడియో బయటకి రావడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం ఆ నలుగుర్ని సస్పెండ్ చేసింది. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లోని వ్యవస్థల్లో జాతి వివక్షపై మరోసారి విస్తృతంగా చర్చ జరిగింది.
జార్జ్ ఫ్లాయిడ్
2020 జూన్‌లో అమెరికాలో నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను తెల్ల తోలు అహంకారంతో ఒక పోలీసు అధికారి నేలపై పడేసి తన మోకాలితో అతని గొంతుపై ఎనిమిది నిమిషాల సేపు నొక్కి ఉంచి హత్య చేయడంపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పోలీసులు నల్లజాతి వారిని, అరబ్బులని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆరోపణలు గుప్పించారు. ఫ్లాయిడ్ మృతిపై అమెరికాను మించి ఫ్రాన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. ఈ నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేసినప్పడు వారి మెడపై చెయ్యి వెయ్యడాన్ని నిషేధించింది.
యెల్లో వెస్ట్స్ ఉద్యమం
2018లో ఫ్రాన్స్ ప్రభుత్వం చమురుపై పన్ను విధించడానికి సన్నాహాలు చేస్తోందనే వార్తలపై ప్రజాందోళనలు భగ్గుమన్నాయి. ప్రతిపాదిత పన్నుని నిరసిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ఈ నిరసనల్ని అణగదొక్కడానికి పోలీసులు మరింత హింసకు పాల్పడ్డారు. రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువు ప్రయోగం, గ్రనేడ్స్ కూడా వాడడంతో క్షతగాత్రులైన వేలాదిమంది శాశ్వతంగా మంచానికే పరిమితమైపోయారు.
అడమా ట్రయోర్..
2016 జూలైలో 24 ఏళ్ల వయసున్న అడమా ట్రయోర్ అనే యువకుడు పోలీసు కస్టడీలో మరణించడంతో ఫ్రాన్స్‌లో ఘర్షణలు చెలరేగాయి. ఉత్తర పారిస్‌లోని బీమాంట్ పోలీసుల అదుపులో ఉండగా అడమా ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతి గల కారణాలపై వైద్యులు భిన్న నివేదికలు సమరి్పంచడం, అనారోగ్యంతో అడమా మరణించాడని పోలీసులు చెప్పడంతో ప్రజలు రోడ్డెక్కారు. జస్టిస్ ఫర్ అడమా అంటూ పోస్టర్లు ప్రదర్శిస్తూ వేలాది మంది రోడ్లపైకి రావడంతో ఉద్రిక్తతలకి దారితీసింది.
పారిస్ ఊచకోత..
2005 నవంబర్‌లో పోలీసులను తప్పించుకుంటూ వెళ్లిన ఇద్దరు ముస్లిం అబ్బాయిలు జయ్యద్ బెన్నా, బౌనా టరయోర్ విద్యుద్ఘాతంతో మరణించడంపై కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఇద్దరు మైనార్టీలపై పోలీసులు దొంగలన్న ముద్ర వేసి వారి మరణానికి కారకులయ్యారన్న ఆగ్రహంతో ఆందోళనలకు దిగారు. ఈ ఆందోళనల్లో 10 వేల ప్రభుత్వ వాహనాలను తగులబెట్టారు. 233 ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేశారు.
పోలీసులు 4 వేల మందిని పైగా అదుపులోనికి తీసుకున్నారు. ఈ సమయంలో అల్లర్లను అదుపు చేయడానికి ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచి్చంది. ఫ్రాన్స్‌లో పోలీసుల హింస దశాబ్దాల క్రితం నుంచే ఉంది. వలస పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అల్జీరియన్లపై పోలీసుల అకృత్యాలు ఫ్రాన్స్ చరిత్రపై ఒక మాయని మచ్చగా మిగిలిపోతాయి. అరబ్బులు, ముస్లింలపై పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో తెలపడానికి ఇదే నిలువెత్తు ఉదాహరణ. పోలీసు కాల్పుల్లో 200 మంది ప్రాణాలు కోల్పోయారు.
పెరిగిపోతున్న పోలీసు హింస
► ఫ్రాన్స్‌లో పోలీసుల హింస రోజురోజుకి పెరిగిపోతోంది. గత అయిదేళ్లలో ఈ అకృత్యాలు 20% పెరిగినట్టు స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి. పోలీసులకుండే అధికారాలను పెంచుతూ 2017లో చట్టాలను సవరించారు. పోలీసుల కన్నుగప్పి పారిపోయే వారి వాహనాలపై కాల్పులు జరపవచ్చునని కొత్త చట్టాల్లో చేర్చారు. 2021లో వాహనాలపై పోలీసుల కాల్పుల ఘటనలు 157 జరగగా, 2022లో 138 జరిగాయి. ఇక గత ఏడాది పోలీసు కాల్పుల్లో 13 మంది అమాయకులు మరణించారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment