మూలానికి మందు వేయాలి! | Sakshi Editorial On Violence In France | Sakshi
Sakshi News home page

మూలానికి మందు వేయాలి!

Published Wed, Jul 5 2023 12:38 AM | Last Updated on Wed, Jul 5 2023 12:38 AM

Sakshi Editorial On Violence In France

ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్‌ తగలబడుతూనే ఉంది. ప్యారిస్‌కు సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్‌ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్‌ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి.

ఆఫ్రికన్, అరేబియన్‌ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్‌ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‌‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. 

సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్‌ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్‌ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్‌ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్‌ సంతతికి చెందిన టీనేజర్‌ నహేల్‌ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు.

ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్‌ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్‌లైవ్స్‌ మేటర్‌’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం.  

ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట.

ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్‌ తక్షణం రద్దు చేయాలి. పోలీస్‌ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్‌ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. 

ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్‌ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్‌లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్‌ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర.

అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్‌బాల్‌లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్‌ దేశాల లానే ఫ్రాన్స్‌ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. 

జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్‌లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్‌ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం.

అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. 

స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్‌లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి.

లేదంటే, ఇవాళ ఫ్రాన్స్‌లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement