Black teenager
-
మూలానికి మందు వేయాలి!
ఒకటి కాదు రెండు కాదు... ఇప్పటికి ఎనిమిది రోజులు. ఫ్రాన్స్ తగలబడుతూనే ఉంది. ప్యారిస్‌కు సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ అతిక్రమించినందుకు కారు ఆపమన్నప్పుడు ఆపని పాపానికి, డ్రైవింగ్ లైసెన్స్ లేని నేరానికి 17 ఏళ్ళ నల్లజాతి టీనేజర్‌ను ఓ పోలీసు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రజాగ్రహం పెల్లుబికేలా చేసింది. పాశవిక చర్యకు పాల్పడ్డ పోలీసుపై సరైన చర్య తీసుకోకపోవడం అల్లర్లకు దారి తీసినట్టు పైకి కనిపిస్తున్నా, లోలోపల ఫ్రాన్స్‌ను పీడిస్తున్న అనేక అంశాలున్నాయి. ఆఫ్రికన్, అరేబియన్ మూలాలున్న నల్ల జాతీయులు, నిరుపేదలు ఏళ్ళ తరబడిగా ఎదుర్కొంటున్న జాతివివక్ష ఇలా విస్ఫోటించింది. యువత వీధుల్లోకొచ్చి కార్లు తగలబెట్టి, బడులు, ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లపై దాడి చేసి, దుకాణాల్ని లూఠీ చేసే పరిస్థితి తెచ్చింది. 2018 నాటి ‘ఎల్లో వెస్ట్స్‘ నిరసనల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌ను ఎన్నడెరుగని రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. శాంతిభద్రతల పునరుద్ధరణకు వేలాది భద్రతా సిబ్బందిని బరిలోకి దింపడం సరే కానీ, ఆర్థిక – సామాజిక అసమానతల కేంద్రంగా మారిన ఆ దేశం చేయాల్సిన అసలు పని వేరే ఉంది. సంపన్న సాంస్కృతిక వారసత్వం, చైతన్యశీలతతో ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఫ్రాన్స్ ఇప్పుడు వీధుల్లోకి విస్తరించిన అసంతృప్తికీ, హింసాత్మక ప్రదర్శనలకూ కేంద్రమవడం గమనార్హం. ప్యారిస్ మొదలు అనేక చోట్లకు విస్తరించిన తాజా అల్లర్లే అందుకు నిదర్శనం. మెక్రాన్ సత్వరమే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అల్జీరియన్ సంతతికి చెందిన టీనేజర్ నహేల్ హత్య అంగీకారయోగ్యం, క్షమార్హం కాదంటూనే, మూక దాడులు, విధ్వంసం సైతం సమర్థ నీయం కావన్నారు. ఆయన మాటలు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశమే. అల్లర్లు అదుపులోకి వచ్చాక పాలకులకూ, ప్రజలకూ మధ్య చర్చకు ఆ మాటలు ఉపకరిస్తాయి. కానీ, మాటలొక్కటే సరి పోవు. 2011లో బ్రిటన్ నుంచి 2013లో అమెరికాలో ‘బ్లాక్‌లైవ్స్ మేటర్’ ఉద్యమం దాకా పాశ్చాత్య దేశాల్లో జాతివివక్ష పోలీసు దౌర్జన్యాలపై అల్లర్లు పదేపదే జరుగుతూనే ఉన్నాయనేది చరిత్ర పాఠం. ఫ్రాన్స్‌లో పోలీసులు ఆదేశించినప్పుడు వాహనం ఆపకున్నా, బెదిరించినా ఆ వాహన చోదకుణ్ణి నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేసేందుకు చట్టాలు అనుమతిస్తున్నాయి. 2017లో చేసిన సవరణ అలాంటి అపరిమిత అధికారం పోలీసులకు కట్టబెట్టింది. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఇలాంటి పోలీసు కాల్పులు, మరణాలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. గత ఏడాది ఇలాంటివి 13 జరిగాయట. ఇన్నేళ్ళలో ఈ బాధితుల్లో అత్యధికులు నల్లజాతి వారే. గీత దాటితే శిక్షించాల్సిందే కానీ, కాల్చి చంపేందుకు అనుమతించడం దారుణం. ఈ చట్టాన్ని ఫ్రాన్స్ తక్షణం రద్దు చేయాలి. పోలీస్ దౌర్జన్యం, పాలనాపరమైన దీర్ఘకాలిక నిర్లక్ష్యం, వర్గ అసమానతలనేవి ఇవాళ ఫ్రాన్స్ సహా ప్రజాస్వామ్య ప్రపంచంలో అనేక ప్రాంతాలను దీర్ఘకాలంగా పీడిస్తున్న అంశాలు. సత్వరం దృష్టి పెట్టాల్సిన సమస్యలు. ఫ్రాన్స్‌లో పట్టణాలు, నగరాల చుట్టూ శివార్లలో అల్పాదాయ వర్గాల గృహసముదాయాలైన ‘బాన్లూ్య’లు ఉంటాయి. ఒకప్పటి ఫ్రెంచ్ వలస దేశాల శరణార్థులు ప్రధానంగా ఉండే ప్రాంతాలివి. ఈ శివారు నివాస సముదాయాల, అక్కడి పరదేశీయుల కష్టనష్టాలను నివారించడం కీలకం. 2021 నాటి అంచనా ప్రకారం ఫ్రాన్స్‌లో 10.3 శాతం మంది వలస జనాభానే. అత్యధికులు అల్జీరియా, మొరాకో, ట్యునీసియాల నుంచి వచ్చినవారు. ఫ్రాన్స్ శ్రామికశక్తిలో వీరిది ప్రధాన పాత్ర. అలాగే, దేశానికి వన్నె తెచ్చే ఫుట్‌బాల్‌లోనూ వీరి ప్రతిభ వెలుగులీనుతోంది. అయినప్పటికీ అనేక యూరోపి యన్ దేశాల లానే ఫ్రాన్స్ సైతం ఈ వలసదారుల్ని తమలో కలుపుకోవడంలో విఫలమవుతోంది. చట్ట సంస్థలు ఇప్పటికీ వీరిని అనుమానంగానే చూడడం విచారకరం. ఆ మాటకొస్తే, ఈ శరణార్థుల సంక్షోభానికి మానవీయ పరిష్కారం కనుగొనడంలో దేశాలన్నీ విఫలమయ్యాయి. అది విషాదం. జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండే ఫ్రాన్స్‌లో సమాజంలో వేర్వేరు వర్గాల మధ్య అంతరాలూ అంతే ఎక్కువ. సంపద పంపిణీలో, అవకాశాల్లో భారీ తేడా నెలకొంది. నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయం, లోకువగా చూస్తూ అణచివేయడం వగైరాలన్నీ వలసదారుల్లో ఆశాభంగం, ఆగ్రహం కలిగించి, అలజడి రేపుతున్నాయి. ఇవాళ ఫ్రాన్స్ సహా అనేక దేశాల్లో రాజకీయ, సామాజిక చీలిక లకు ఇవి ప్రధాన కారణం. అణగారిన ప్రజలు సామాజిక అసమానత, ఆర్థిక అసంతృప్తితో తమ బాధల్ని పాలకుల దృష్టికి తీసుకురావడానికి అల్లర్లను సాధనంగా ఎంచుకుంటున్నారు. జాతి వివక్షతో పోలీసులు జరుపుతున్న దాష్టీకం మారాలని కోరుతున్నారు. సమాజంలో లోతుగా పాతుకు పోయిన ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. పౌర సమాజం, ప్రజలు సమ్రగ్ర పరిష్కారానికి చేయూత నివ్వాలి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలే మూలస్తంభాలనే పరిణత ప్రజాస్వామ్యమైన ఫ్రాన్స్‌లోనే పరిస్థితి తద్విరుద్ధంగా ఉండడం చేదు నిజం. అక్కడి పరిణామాలు ఇతర ప్రజాస్వామ్య దేశాలకు కనువిప్పు. వివిధ జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలతో వైవిధ్యభరితమైన ప్రజానీకమున్న దేశాలు ఆ విభిన్న ప్రజానీకపు అవసరాలు, ఆకాంక్షలకు తగ్గట్టు వ్యవహరించాలి. ప్రభుత్వ సంస్థల విధి విధా నాలను అందుకు తగినట్టు మార్చుకోవాలి. పాలనలో దీన్ని తక్షణ ప్రాధాన్యంగా పెట్టుకోవాలి. లేదంటే, ఇవాళ ఫ్రాన్స్‌లో జరిగినట్టే రేపు తమ దేశంలో జరగదన్న గ్యారెంటీ ఏమీ లేదు. వివక్ష పెంచిన సామాజిక ఉద్రిక్తతలతో చేతులు కాలకముందే మేల్కోవడం వివేకవంతులైన పాలకుల లక్షణం! -
వేరొకరి ఇంటి డోర్‌బెల్ మోగించాడని నిర్ధాక్షిణ్యంగా చంపబోయాడు..కానీ..
ఓ టీనేజర్ పొరపాటున మరొకరి ఇంటి బెల్ మోగించాడు. అంతే ఓ వ్యక్తి ఏ మాత్రం కనికరం లేకుండా తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ టీనేజర్ తలలోకి రెండు తూటాలు దూసుకుపోయాయి. దీంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ భయానక ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..16 ఏళ్ల అఫ్రికన్ అమెరికన్ రాల్ఫ్ పాల్ యార్ల అనే వ్యక్తి తన కవల సోదరులను స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకునేందుకు వెళ్లాడు. అప్పుడే అతను పొరబడి వేరొకరి ఇంటి డోర్‌బెల్‌ను నాక్ చేశాడు. అంతే ఆ ఇంటి యజమాని ఆండ్రూ లెస్టర్ నిర్ధాక్షిణ్యంగా అతనిపై కాల్పులు జరిపాడు. దీంతో రెండు తుటాలు సరాసరి టీనేజర్ తలలోకి దూసుకుపోవడంతో అతను కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఐతే అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఆండ్రూ లెస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. ఐతే గంటల కస్టడీ తర్వాత ఎలాంటి ఆరోపణలు మోపకుండానే అతను విడుదలయ్యాడు. దీంతో నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని నిరసనలు వెల్లవెత్తాయి. ఇది జాత్యాహంకారంతో జరిగినే హత్య అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు టీనేజర్ అత్త ఫెయిత్ స్ఫూన్‌మూర్ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా సుదీర్ఘ చరిత్రలో నల్లజాతీయులపై హింస జరుగతూనే ఉంది దీనికి జవాబుదారితనం వహించాల్సిందే అంటూ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు మిస్సోరీ పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇది జాతిపరంగా జరిగిన హత్యగా ఆయన పేర్కొనలేదు. తాను వారి ఆవేదనను అర్థం చేసుకుంటానని చెప్పారు. అలాగే జాతి పరంగా జరిగిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేయడమే గాక నిందితుడిని అదీనంలోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. చివరికి నిందితుడు ఆండ్రూ లెస్టర్(85) వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక కోర్టు కూడా సదరు నిందితుడు సాయుధ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి దోషిగా తేల్చింది. అంతేగాదు అతనికి కోటి రూపాయాల పూచీకత్తుతో కూడిన బెయిల్‌ని మంజూరు చేసింది. అదృష్టవశాత్తు టీనేజర్ కూడా కొద్దిలో ప్రాణాపాయంతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సదరు బాధితుడితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్లో సంభాషించి..క్షేమ సమాచారాలను అడిగినట్లు వైట్‌హౌస్ పేర్కొనడం గమనార్హం. (చదవండి: అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి) -
మిచిగాన్ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి
మిచిగాన్(యూఎస్ఏ): సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలోని కాంప్‌బెట్ హాల్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని నల్లజాతి యువకుడు(19) జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులు విద్యార్థులు కాదనీ, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం విద్యార్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక్కడి మౌంట్ ప్లెజెంట్ క్యాంపస్‌లో 20వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత రెండు వారాల క్రితం ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో ఓ మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
నల్లజాతి యువకుడిపై పోలీసుల పిడిగుద్దులు
న్యూయార్క్: అమెరికాలో ఇంకా నల్ల జాతీయులపట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పేందుకు ఈ ఘటన ఓ తాజా ఉదాహరణ. వారిపై దాడులు చేసేందుకు ప్రత్యేక కారణమంటూ ఉండదని అర్థం చేసుకునేందుకు పోలీసులు చేసిన ఈ దాడి ఓ సజీవ సాక్ష్యం. మేరిలాండ్ లో కెమెరాకు పోలీసులు చేసిన ఓ దుశ్చర్య చిక్కింది. దాని ప్రకారం టోసన్ పట్ణణంలో ఓ నల్లజాతి యువకుడిపై పోలీసులు ఏ కారణం లేకుండానే దాడి చేశారు. అతడి చేతిలో ఎలాంటి ఆయుధం లేకున్నా ఉన్నట్లుగా అనుమానించి ఒక పోలీసు అధికారి అతడి చొక్కాపట్టుకునిలాగి కిందపడేయగా మరో పోలీసు అధికారి అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ వీడియో తాజాగా బయటపడటంతో ప్రస్తుతం ఆ పోలీసు అధికారి ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ సంబంధిత ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు. -
అమెరికాలో యువకుడిని కాల్చిచంపిన పోలీసు
బెర్కెలే(అమెరికా): అమెరికాలోని మిస్సోరీలో ఓ యువకుడిని పోలీసు అధికారి కాల్చిచంపడం ఉద్రికత్తతకు దారి తీసింది. తనపై కాల్పులు జరపడానికి తుపాకీ తీయడంతో ఆ యువకుడిపై కాల్పులు జరిపినట్టు పోలీసు అధికారి పేర్కొన్నారు. మిస్సోరీలోని బెర్కెలేలోని ఓ గ్యాస్‌స్టేషన్ వద్ద మంగళవారం పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓ నల్లజాతి యువకుడిని ఓ తెల్లజాతీయుడైన పోలీసు కాల్చిచంపడంతో ఆందోళనలు చెలరేగిన ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.